సముద్ర గర్భంలో అపార పసిడి నిక్షేపం!

సముద్రాన్ని ఏ క్షణంలో చూసినా అదో కొత్తదనం, అదో అద్భుతం.. సముద్ర తీరంలో ఎన్ని గంటలు గడిపినా..ప్రతి గంటా, ప్రతి నిముషం, ప్రతి క్షణం అలల కదలికలో, ఆటుపోట్లలో ఓ కొత్తదనం కనిపిస్తుంది. ఓ అద్భుతం ఆవిష్కృతం అవుతుంది. అలాంటి సముద్ర గర్భంలో మరెన్నో వింతలూ, అద్భుతాలు ఉన్నాయని పర్యావరణ నిపుణులు చెబుతూనే ఉంటారు.

వేల ఏళ్ల కిందటి నిధులనూ, నిక్షేపాలనూ, రహస్యాలనూ కూడా సముద్రం తన గర్భంలో అతి పదిలంగా కాపాడుతుంటుందనడానికి తాజా సాక్ష్యమే ఇటీవల అధికారులు గుర్తించిన భారీ పసిడి గని,

. సముద్ర గర్భంలో కొలంబియా అధికారులు గుర్తించిన పసిడి నిథి విలువ దాదాపు 17 బిలియన్ డాలర్లు ఉంటుందని అంచనా. ఆ నిథి ఎప్పుడో 1708లో స్పానిష్ యుద్ధ సమయంలో మునిగిపోయిన రెండు ఓడలలో తరలిస్తున్న బంగారంగా అధికారులు భావిస్తున్నారు.  అప్పట్లో జరిగిన యుద్ధంలో బ్రిటిష్ నౌకల దాడిలో మునిగిపోయిన ఓడల తాలూకు శిథిలాలను ఇప్పుడు గుర్తించారు. ఆ శిథిలాలలోనే భారీ బంగారు నిక్షేపాన్నీ గుర్తించారు. సముద్ర గర్భంలో దాదాపు మూడు వేల అడుగుల లోతున ఈ నిక్షేపం ఉన్నట్లు గుర్తించారని వాషింగ్టన్ పోస్టు పేర్కొంది. ఈ బంగారు గనిని వెలికి తీయడానికి ప్రయత్నాలు ప్రారంభించనున్నట్లు అధికారులు చెబుతున్నారు. అయితే అదేమంత తేలికైన పని కాదని నిపుణులు అంటున్నారు.