ఇదేం పోయే కాలం..గుర్తింపు కోసం ఈ పిచ్చి చేష్టలేంటి?
posted on Jun 11, 2022 7:19AM
వెర్రి వేయి విధాలు అన్నారు పూర్వీకులు.. కానీ ఇప్పటి సామాజిక మాధ్యమంలో కనిపిస్తున్న వేలం వెర్రిగాళ్ల వ్యవహారం చూస్తే వేయి ఎన్ని విధాలో ఏ గణిత మేధావీ కూడా గణించలేడని తేల్చేసే వారేమో. వ్యూలూ, లైకుల పిచ్చి కొందరిలో పీక్స్ కు వెళ్లిపోయింది. అందు కోసం ఎంత పిచ్చి పని చేయడానికైనా వారు వెనుకాడటం లేదు.
నవ్వి పోదురుగాక నాకేటి సిగ్గు..నవ్వితే, నచ్చిందన్న లైక్ కొడితే చాలు అన్నట్లుగా వారి వేలం వెర్రి ముదిరిపోయింది. సరిగ్గా అలాంటిదే ఈ 44 ఏళ్ల యూట్యూబర్ చేసిన పని. సైఫుల్ ఆరిఫ్ అనే 44 ఏళ్ల వ్యక్తి ఇండోనేసియా నివాసి. అతగాడికి ఒక్కసారిగా ప్రపంచం దృష్టిని తనవైపు తిప్పేసుకోవాలనే పిచ్చి కోరిక పుట్టింది. దానికి ఏం చేయాలని ఆలోచించాడు.
సామాజిక మాధ్యమంలో ఇప్పటి వరకూ ఎవరూ చేయని వింత పని ఒకటి చేస్తే చాలనుకున్నారు. అంతే చేసేశాడు. దానికి యూట్యూబులో అప్ లోడ్ చేసేశాడు. అంతే అతను పోస్టు చేసిన వీడియో యూట్యూబ్ లో క్షణాల్లో వైరల్ అయిపోయింది. నవ్వుకున్నా, తిట్టుకున్నా, ఇదేం పొయె కాలంరా బాబూ అని నెటిజన్లు కామెంట్లు పెట్టినా సైపుల్ ఆరీఫ్ కు మాత్రం వెంటనే గుర్తింపు వచ్చేసింది.
అతగాడు కోరుకున్నది అదేగా మరి. అందుకే తెగ హ్యాపీ ఫీలైపోతున్నాడు. ఇంతకీ అతడు ఇందు కోసం ఏం చేశాడో తెలుసా?.. పెళ్లి చేసుకుని ఆ వీడియోను సామాజిక మాధ్యమంలో పోస్టు చేశాడు. పెళ్లి వీడియో పోస్టు చేస్తే ఎందుకు అంత వైరల్ అవుతుందని ఆశ్చర్యపోకండి. పెళ్లిళ్లలో పెళ్లి కూతురు డాన్స్ చేస్తేనే వైరల్ అయిపోతున్న రోజులివి. అందుకే అతడు మనిషిని కాకుండా ఒక మేకను పెళ్లి చేసుకున్నాడు. సంప్రదాయ బద్ధంగా వివాహ క్రతువు జరిపించుకుని మేక మెడలో తాళి కట్టాడు. మేకకు కన్యాశుల్కం కింద సొమ్మ కూడా చెల్లించాడు. అతడి పిచ్చి పనికి నెటిజన్లు నవ్వుకున్నారు. తిట్టుకున్నారు. ఏమైతేనేం మొత్తానికి అతగాడికి లక్ష్యం నెరవేరింది. గుర్తింపు వచ్చేసింది.