ప్రజల్లో లీడర్.. పార్టీ కార్యకకర్తలకు గాడ్ ఫాదర్ లోకేష్
posted on Jan 2, 2025 1:34PM
నారా లోకేష్. ఏపీ రాజకీయాలలో ఆయన ఇప్పుడు సెంటరాఫ్ అట్రాక్షన్. ప్రజలలో తిరుగులేని నాయకుడు. అయినా ఆయన పార్టీ విషయానికి వచ్చే సరికి ఒక కార్యకర్త మాత్రమే. ఒక కార్యకర్తలాగే పార్టీ కోసం శ్రమిస్తారు. అదే విధంగా తోటి కార్యకర్తల సంక్షేమం కోసం నిరంతరం పాటుపడతారు. లోకేష్ లోని ఈ లక్షణాలను ఆయన రాజకీయాలలో అడుగుపెట్టక ముందే.. వైసీపీ పసిగట్టేసింది. అందుకే లోకేష్ కు రాజకీయాలంటేనే విరక్తి కలిగేలా చేయాలన్న ఉద్దేశంతో ఆయనపై విమర్శల దాడి చేసింది. బాడీ షేమింగ్ కు పాల్పడింది. లోకేష్ ఆహారపు అలవాట్లను గేలి చేసింది. పప్పు అంటూ అవహేళన చేసింది. అయితే ఇదంతా గతం.. ఇప్పుడు లోకేష్ పరిపూర్ణమైన నాయకుడు. ఇంకా స్పష్టంగా చెప్పాలంటే ది లీడర్. ఆయన గురించి స్పష్టంగా చెప్పాలంటే.. తనను తాను నాయకుడిగా మలచుకున్న యవకుడు. విమర్శల ఉలి దెబ్బలకు శిల్పంగా మారిన నేత.
రాజకీయ అడుగులు ప్రారంభించిన సమయంలో లోకేష్ మాట్లాడిన ఒకటీ రెండు అమాయకపు మాటలతో ట్రోల్ చేసే వారికి తనయువగళం పాదయాత్రలో చెంపపెట్టులాంటి సమాధానం ఇచ్చారు. వేలకిలోమీటర్లు నడిచి, ప్రజలతో మమేకమై వారి కష్టాలను తెలుసుని, సొంత పార్టీలో, కార్యకర్తల్లో అసంతృప్తిని దూరం చేసి భరోసా ఇస్తూ ముందుకు సాగారు. ప్రత్యర్ధుల విమర్శల దాడికి సమాధానం చెబుతూనే, లోకేష్ వారికి దిమ్మతిరిగేలా ప్రతి సవాళ్లు విసిరారు. పాదయాత్రలో భాగంగా కియా ఫ్యాక్టరీ వద్ద లోకేష్ విసిరిన సెల్ఫీ చాలెంజ్ , అలాగే టిసిఎల్, జోహో, డిక్సన్ వంటి కంపెనీల వద్ద లోకేష్ విసిరిన సెల్ఫీ సవాళ్లు రాష్ట్ర యువతను ఆకట్టుకున్నాయి. డిక్సన్ కంపెనీ ఉద్యోగుల బస్సు ఎక్కి లోకేష్ సెల్ఫీ దిగుతూ.. మిస్టర్ జగన్ రెడ్డీ.. నేను తెచ్చిన డిక్సన్ కంపెనీ ఇది.. అందులో ఉద్యోగాలు చేస్తున్న అక్కాచెల్లెళ్లు వీరు.. నువ్వు ఒక్క కంపెనీ అయినా తెచ్చానని చెప్పుకోగలవా? అంటూ నేరుగా అప్పటి సీఎం జగన్ కు విసిరిన సవాల్ వైసీపీ నేతల నోళ్లు మూయించింది.
అంతెందుకు 2014--2019మధ్య కాలంలో ఆయన మంత్రిగా పనిచేసిన సందర్భంలో విపక్షాల ప్రశ్నలకు దీటుగా సమాధానం ఇచ్చారు. గణాంకాలతో సహా సోదాహరణంగా అపుడు మండలిలో లోకేష్ అనర్ఘళ ప్రసంగానికి సీనియర్లు అభినందించిన సందర్భాలు ఉన్నాయి. ఇపుడు లోకేష్ భారీ విజయం సాధించాక మంగళగిరిలో తన స్థానాన్ని పదిలపరచుకునే ప్రయత్నాలకు శ్రీకారం చుట్టారు. ఏ ప్రజలు అయితే తనకు భారీ మెజార్టీ ఇచ్చారో వారి కోసం అహరహం శ్రమించి పనిచేయాలని లోకేష్ భావించి కార్యాచరణ మొదలెట్టేశారు. మంగళగిరిలో లోకేష్ నిర్వహిస్తున్న ప్రజాదర్బార్ కు విశేష స్పందన లభిస్తోంది. ప్రజల సమస్యలను సావధానంగా వినడమే గాక అప్పటికప్పుడే ఆయా సమస్యల పరిష్కారానికి అధికారుల ద్వారా చర్యలు చేపట్టడం ప్రజల్లో భరోసా కల్పిస్తోంది. అంతే కాదు సమస్యలు విన్న వించేందుకు వచ్చే ప్రజల కోసం ఆ ప్రాంతంలో అన్నా క్యాంటీన్లు ఏర్పాటు చేయాలని కూడా లోకేష భావిస్తున్నారు. టీడీపీ యువ నాయకుడు, విద్యాశాఖ, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ గ్రాఫ్ ఈ నిర్ణయంతో పెరిగిందన్న వ్యాఖ్యలు వినవస్తున్నాయి. ప్రజలతో మమేకం కావడం ఆయనకు మంచి ఇమేజ్‌ను తెచ్చి పెడుతున్నది.
మంత్రిగా బాధ్యతలు చేపట్టిన వెంటనే ఉండవల్లిలోని తన నివాసంలో ప్రజాదర్బార్ ప్రారంభించారు. లోకేష్ కు సమస్య చెప్పుకుంటే అది పరిష్కారమైపోయినట్లునన్న విశ్వాసం ప్రజలలో వ్యక్తం అవుతున్నదంటే ఎంతటి అకుంఠిత దీక్షతో లోకేష్ పని చేస్తున్నారో అర్ధమౌతోంది. పాదయాత్రతో ఆయన ప్రజల దృష్టిలో నాయకుడై పోయారు. తమ కష్టాలను తీర్చడానికి నాయకుడిగా తానున్నానన్న భరోసాను ప్రజలలో లోకేష్ కల్పించారు.
ప్రజలలో నాయకుడిగా గుర్తింపు పొందినా నారా లోకేష్ పార్టీ విషయానికి వచ్చే సరికి ఒక కార్యకర్తలాగే ఉంటారు. కార్యకర్తల సంక్షేమమే పార్టీకి కొండంత బలం అని ప్రగాఢంగా నమ్ముతారు. పార్టీ కార్యకర్తల కోసం నిలబడటంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. ఈ విషయం కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్న కార్యకర్తలకు, నిరుపేద కార్యకర్తల పిల్లలు చదువులకు ఆర్ధిక సహాయం చేస్తూ కార్యకర్తలను నిరంతరం ఆదుకోవాల్సిన అవసరం ఉందని ఆయన నమ్మడమే కాదు.. పార్టీ కూడా అందుకు అంగీకరించేలా చేశారు. కార్యకర్తల కోసం నిరంతరం సంక్షేమ కార్యక్రమాలను అమలు చేయడం కోసం ఒక ప్రత్యేక నిధి, దానిని నిర్వహించేందుకు ఒక పటిష్ఠ వ్యవస్థ అవసరం అని లోకేష్ గట్టిగా చెప్పి పార్టీని అందుకు ఒప్పించారు. అంతే కాదు 2014లో తాను మంత్రిగా బాధ్యతలు చేపట్టిన రోజే నా రాలోకేష్ పార్టీ కార్యకర్తల సంక్షేమ నిధి సమన్వయకర్తగా బాధ్యతలు స్వీకరించారు. అలా బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి చిత్తశుద్ధితో కార్యకర్తల సంక్షేమానికి కట్టుబడి ఉన్నారు. ఇప్పటివరకు, పార్టీ కార్యకర్తల కోసం సంక్షేమ నిథి నుంచి లోకేష్ 138 కోట్ల రూపాయలు ఖర్చు చేశారు. అలాగే గత ప్రభుత్వ పాలనలో చట్టపరమైన కేసుల్లో చిక్కుకున్న కార్యకర్తలకు సహాయం చేయడానికి ఒక లీగల్ సెల్‌ను కూడా ఏర్పాటు చేశారు. ప్రమాదాలకు గురైన కార్యకర్తలకు సహాయం చేయడానికి మరో సెల్ ప్రారంభించారు. మరణించిన పార్టీ కార్యకర్తల పిల్లల పిల్లలు హైదరాబాద్ మరియు కృష్ణా జిల్లాలోని చల్లపల్లిలోని రెసిడెన్షియల్ పాఠశాలల్లో చేర్చి వారి చదువులకయ్యే మొత్తం వ్యయాన్ని పార్టీ భరించేలా విధానపరమైన నిర్ణయం తీసుకున్నారు.
నిజానికి దేశంలో ప్రప్రధమంగా పార్టీ కార్యకర్తల కోసం సంక్షేమ నిథి ఏర్పాటు చేసిన పార్టీ ఏదైనా ఉందంటే అది తెలుగుదేశం పార్టీయే. అలా సంక్షేమ నిథి ఏర్పాటు చేసి కార్యకర్తలకు అండగా నిలవాలన్న ఆలోచన లోకేష్ దే. తెలుగుదేశం కార్యకర్తలు, వారి కుటుంబాల కోసం, వివిధ సంక్షేమ కార్యక్రమాలు అమలుచేయడమే కాకుండా వాటన్నినీ నిరంతరంగా కొనసాగించేందుకు పటిష్టమయిన ఒక యంత్రాంగాన్ని ఏర్పాటు చేయాలన్న ఆలోచన కూడా నారా లోకేష్ దే. పార్టీ కార్యకర్తలకి రెండు లక్షల రూపాయల ప్రమాద బీమా ఆలోచనా ఆచరణా కూడా నారా లోకేష్ దే. పార్టీకి వెన్నెముక లాంటి కార్యకర్తలకు ఎల్లవేళలా పార్టీ అండగా నిలవాలన్న సదుద్దేశంతో నారా లోకేష్ కార్యకర్తల కోసం పార్టీ నిలబడుతుందన్న విశ్వాసాన్ని వారిలో కలగచేశారు. ఇప్పుడు తాజాగా కార్యకర్తల ప్రమాద బీమా మొత్తాన్ని ఐదు లక్షల రూపాయలకు పెంచుతూ ఇన్సూరెన్స్ కంపెనీతో ఒప్పందం చేసుకున్నారు. ఈ ఒప్పందం సందర్భంగా పార్టీ తరఫున ఆయన 42 కోట్లు బీమా కంపెనీకి చెల్లించారు.
తాజాగా తెలుగుదేశం పార్టీ చేపట్టిన సభ్యత్వ నమోదు డ్రైవ్ కు అనూహ్య స్పందన వచ్చింది. పార్టీ సభ్యుల సంఖ్య కోటికి చేరింది. ఈ కోటి మంది కార్యకర్తలకూ ప్రమాద బీమా సౌకర్యన్ని కల్పిస్తూ యునైటెడ్ ఇన్సూరెన్స్ కంపెనీతో ఒప్పందంపై నారా లోకేష్ బుధవారం (జనవరి 1) సంతకం చేశారు. ఒకేసారి 1 కోటి మంది కార్యకర్తలకు బీమా సౌకర్యం కల్పించిన ఘనత తెలుగుదేశం పార్టీదే. తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు ఈ బీమా ఈ ఏడాది జనవరి 1 నుంచే అమలులోకి వస్తుంది. జనవరి 1, 2025 - డిసెంబర్ 31, 2025 మధ్య కాలంలో 1 కోటి మంది పార్టీ కార్యకర్తలకు టిడిపి మొదటి దశలో రూ. 42 కోట్లు కేటాయించింది. ఈ ఒప్పందం ప్రకారం, టిడిపి కార్యకర్తలు ప్రమాద కవరేజీ కోసం ఐదు లక్షల రూపాయలు పొందే అవకాశం కలిగింది. కార్యకర్తల కోసం పార్టీ నిలబడేలా చేసి.. తద్వారా పార్టీ కోసం కార్యకర్తలు నిలబడేలా చేసింది నారా లోకేష్ అని చెప్పడానికి ఇసుమంతైనా సందేహం లేదు.