మహాలో శివసేన, ఎంఐఎం భాయి భాయి!

రాజకీయాలలో శాశ్వత మిత్రులు ఉండరు అన్నది నానుడి. అలాగే శత్రువుకు శత్రువు మిత్రుడు అని కూడా అంటారు. సరిగ్గా అలాగే జరుగుతోంది మహారాష్ట్రలో. దేశంలో ముస్లింల సంక్షేమం, భద్రత కోసం పుట్టిన పార్టీ  ఎంఐఎం.  దేశంలో హిందువుల ఐక్యత అంటూ పని చేస్తున్న పార్టీ శివసేన. అయితే ఈ రెండు పార్టీలూ రాజ్యసభ ఎన్నికల సందర్భంగా కలిసాయి. ఈ రెండు పార్టీలూ తమతమ పార్టీల సిద్ధాంతాలను ఏమీ మార్చుకోలేదు. కానీ కలిశాయి. అందుకు ప్రాతిపదిక రాజ్యసభ ఎన్నికలో బీజేపీ అభ్యర్థిని ఓడించాలన్న ఏకైక లక్ష్యమే.

రెండు పార్టీలకూ బీజేపీతో పొసగడం లేదు. బీజేపీ-ఎంఐఎం పార్టీల మధ్య వైరుధ్యం తెలిసిందే. విమర్శలూ, ప్రతి విమర్శలు ఇరు పార్టీల మధ్యా సర్వ సాధారణం. ఎప్పుడూ ఇరు పార్టీల మధ్యా పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితే ఉంటుంది. ఇక శివసేన విషయానికి వస్తే.. మౌలికంగా శివసేన, బీజేపీ రెండు పార్టీలదీ హిందుత్వ అజెండాయే అయినా రెండూ సుదీర్ఘ కాలం పొత్తులతో సాగినా మోడీ హయాంలో రెండు పార్టీల మధ్యా చెడింది. బీజేపీ బిగ్ బ్రదర్ షో ను శివసేన సహించలేకపోయింది. అందుకే సైద్ధాంతికంగా పెద్దగా తేడా లేకపోయినా రెండు పార్టీల దారులూ వేటికవి అయిపోయాయి.  

మహారాష్ట్రలో మహావికాస్ అఘాడీ కూటమికి నేతృత్వం వహిస్తూ రాష్ట్రంలో అధికార పగ్గాలను చేపట్టింది. ఇప్పుడు రాజ్యసభ ఎన్నికల సందర్భంగా ఎంఐఎం ఆ కూటమితో చేతులు కలిపింది. రాజకీయ పార్టీల మధ్య రాజకీయ అవసరాలకి తగ్గట్టుగా నిర్ణయాలు, పొత్తులు ఉంటాయన్న సంగతి తెలిసిందే.  అందులో భాగంగానే శత్రువుకు శత్రువు అన్న చందాన ఎంఐఎం శివసేనతో చేతులు కలిపింది. మహారాష్ట్ర రాజ్యసభ ఎన్నికలలో బీజేపీని ఓడించడమే లక్ష్యంగా ఇరు పార్టీలూ ఏక మార్గంలోకి వచ్చాయి.

దీంతో ఎంఐఎం రాజ్యసభ ఎన్నికలలో బీజేపీ పరాజయం కోసం శివసేన నేతృత్వంలోని మహా వికాస్ అఘాడీ కూటమి అభ్యర్థిగా రంగంలో నిలిచిన కాంగ్రెస్ అభ్యర్థికి ఎంఐఎం సభ్యులు ఓటేస్తారు. ఈ విషయాన్ని ఎంఐఎం ఎంపీ ఇంతియాజ్ జలీల్ ట్వీట్ చేశారు. ఇక్కడ కొసమెరుపేమిటంటే.. శివసేనతో తమ సైద్ధాంతిక విభేదాలు అలాగే కొనసాగుతాయని పేర్కొన్నారు.  ఒక్క రాజ్యసభ ఎన్నికల కోసమే ఆ పార్టీతో తాము చేతులు కలిపామని స్పష్టం చేశారు. మహారాష్ట్ర నుంచి ఆరు రాజ్యసభ స్థానాలకు నిన్న అంటే జూన్ 10న ఎన్నికలు జరిగాయి. ఈ ఎన్నికలలో ఏడుగురు అభ్యర్థులు రంగంలో ఉన్నారు.  

సిద్ధాంతాలతో సంబంధం లేకుండా పార్టీలు చేతులు కలపడం ఇదేం కొత్త కాదు. గతంలో బీజేపీ స్వయంగా ఈ పని చేసింది. జమ్మూ కాశ్మీర్ లో అధికారం పంచుకోవడానికి మెహబూబా ముఫ్తి నేతృత్వంలోని ప్రొగ్రసివ్ డెమెక్రటిక్ ఫ్రంట్ తో చేతులు కలిపింది.