15వ శతాబ్దపు స్మారక కట్టడం కూల్చివేత.. సీనియర్ ఐఏఎస్ కు విజిలెన్స్ నోటీసులు
posted on Apr 28, 2023 11:55PM
15వ శతాబ్దపు స్మారక కట్టడాన్ని కూల్చివేసి భవన నిర్మాణం చేపట్టిన ఢిల్లీ జల్ బోర్డు మాజీ సీఈవో ఢిల్లీ ప్రభుత్వ విజిలెన్స్ విభాగం నోటీసులు జారీ చేసింది. సీనియర్ ఐఏఎస్ అధికారి అయిన ఉదిత్ ప్రకాష్ రాయ్ ఢిల్లీ జల్ బోర్డు సీఈవోగా ఉన్న సమయంలో 15వ శతాబ్దానికి చెందిన స్మారక చిహ్నాన్ని కూల్చివేశారంటూ విజిలెన్స్ ఆయనకు నోటీసులు ఇచ్చింది. ఇదే విషయంలో ఢిల్లీ జల్ బోర్డు కు చెందిన ఐదుగురు అధికారులకు కూడా షోకాజ్ నోటీసులు అందాయి.
ఈ నోటీసులకు రెండు వారాలలోగా సమాధానం ఇవ్వాల్సిందిగా విజిలెన్స్ విభాగం ఆదేశాలిచ్చింది. ఇక కూల్చివేతకు గురైన భవనం పఠాన్న కాలం నాటి రాజవంశానికి చెందిన ప్యాలెస్. ఇది ఢిల్లీలోని లజ్ పత్ నగర్ సమీపంలోని జలవిహార్ ప్రాంతంలో ఉంది. ఆ భవనాన్ని వాస్తవానికి జల్ బోర్డ్ పురావస్తు శాఖకు అప్పగించాల్సి ఉంది. ఇందుకోసం ప్రక్రియ కొనసాగుతుండగానే ఆ భవనాన్ని కూల్చి వేసి ప్రకాశ్ రాయ్ భవంతిని నిర్మించారు. వాస్తవానికి ప్రస్తతం ఆయన ఢిల్లీ జల్ బోర్డులో లేరు. ఆయనకు మిజోరం బదలీ అయ్యింది. ఆ భవనాన్ని ఖాళీ చేయాల్సిందిగా నోటీసులు ఇచ్చినప్పటికీ ఆయన కుటుంబం అందులోనే నివసిస్తోంది.
కాగా స్మారక చిహ్నం కూల్చివేతపై చర్యలు తీసుకోవాలని బీజేపీ, తృణమూల్ కాంగ్రెస్ సహా పలు రాజకీయ పార్టీలు డిమాండ్ చేస్తున్నాయి. నిత్యం అవినీతి వ్యతిరేక పోరాటం గురించి పాట్లాడుతూ సింప్లిసిటీ అంటూ గొప్పలు చెప్పుకునే కేజ్రీవాల్ తన అధికార నివాస సుందరీకరణకు రూ.45 కోట్లు వ్యయం చేశారు. జల్ మండల్ మాజీ సీఈవో స్మారక చిహ్నాన్ని, పదిలంగా కాపాడుకోవలసిన చారిత్రక కట్టడాన్ని కూల్చివేసి భవంతిని నిర్మించుకున్నారని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
పదిహేనవ శతాబ్దపు స్మారక చిహ్నాన్ని పడగొట్టేస్తుంటే భారత పురావస్తు శాఖ నిద్రపోతోందా అంటూ పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ అధినేత్రి మమతా బెనర్జీ మండి పడ్డారు. ఈ విషయంపై వివరణ ఇవ్వడమే కాకుండా చర్యలు తీసుకోవాలని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి ఆమె లేఖ రాశారు. అలాగే స్మారక చిహ్నం కూల్చివేతపై ఉన్నత స్థాయి విచారణ జరపాలని డిమాండ్ చేస్తూ బీజేపీ ఢిల్లీ అధ్యక్షుడు వీరేంద్ర సచ్ దేవా ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ కు లేఖ రాశారు.