ఏమిటా అసంతృప్తి!

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌  నిన్న కలెక్టర్ల సదస్సులో మాట్లాడుతూ చేసిన వ్యాఖ్యలు విశ్లేషకులకు పనిపెట్టేలా సాగాయి. ‘‘ఇప్పటివరకు భిన్న దృక్పథాలున్న పార్టీలెన్నో అధికారంలోకి వచ్చాయి. అనేక కార్యక్రమాలను చేపట్టాయి. అయినా ఇప్పటికీ సమాజంలో ఎక్కడో ఏదో అసంతృప్తి ఉంది. లోపం ఎక్కడుందో గుర్తించాలి. ప్రజలకు నిజంగా ఏం కావాలో తెలుసుకోవాలి. పరిష్కారాలు వెతకాలి. ప్రజల అసంతృప్తి పరిధి దాటితే.. దాన్ని కొన్ని శక్తులు దుర్వినియోగం చేసే అవకాశముంది...’’ అంటూ కేసీర్‌ చెప్పిన మాటలు వాస్తవాలను ప్రతిబించేలా ఉన్నాయి.

 

సమాజంలో తీవ్ర అసంతృప్తి ఉందన్న విషయాన్ని పాలకులు ఒప్పుకోవడం ఆశ్చర్యమే! కళ్ల ముందున్న ప్రజల జీవితాలు ఎంత దయనీయంగా ఉన్నా, భేషజాలకు పోయి ‘ఆల్ ఈజ్ వెల్‌’ అని వాక్రుచ్చే స్టేట్‌మెంట్స్‌కి ఈ వ్యాఖ్యలు కాస్త భిన్నంగా ఉన్నాయి. కానీ సమాజంలోని అసంతృప్తికి కారణం ఏమిటో తెలియాలంటే మేధావులు బుర్రలు బద్దలుకొట్టుకోనక్కరలేదు. ఒక సగటు మనిషి జీవితం సాఫీగా సాగిపోకుండా ఎక్కడెక్కడ ఇబ్బందుల పాలవుతున్నాడో తెలిస్తే చాలు. నీరు, రోడ్లు, విద్య, చదువు, విద్యుత్తుకి సంబంధించి మౌలిక సదుపాయాలు సవ్యంగా లేని సమాజంలో అసంతృప్తి ఉండకుండా మరేముంటుంది? గాలితో పాటు పోయే కరెంటు, వానతో పాటు నిండిపోయే రోడ్లు, అవసరానికి అందని వైద్యం, ప్రమాణాలు లేని విద్య ఉన్న రాష్ట్రంలో ప్రజలు సంతోషంగా ఎలా ఉంటారు.

 

మౌలిక వసతుల సంగతి అలా ఉంచితే... పోనీ ప్రజల జీవన ప్రమాణాలు ఏమన్నా మెరుగుపడ్డాయా అంటే అదీ కనిపించడం లేదు. పేదవాడి కోసమని అమలుచేస్తున్న ఫలితాలు వారి జీవితాలను పెద్దగా మార్చినట్లు తోచడం లేదు. ఉద్యోగకల్పనలోనూ తెలంగాణ ప్రభుత్వం చెప్పుకోదగ్గ విజయాలేవీ సాధించలేదు. రైతుల పరిస్థితీ అంతంత మాత్రంగానే ఉంది. ముంపు గ్రామాలు, ఆదివాసీల హక్కుల విషయంలో గత ప్రభుత్వాలకు భిన్నంగా ఏమీ వ్యవహరించడం లేదన్నా ఆరోపణలు ఉన్నాయి.

 

ప్రజల జీవితాలు ఇలా ఉంటే పాలకుల తీరు మరోలా ఉంది. భూకబ్జాలలోనూ, అధికార దుర్వినియోగంలోనూ కొందరు అధికార పక్ష నాయకులు ఆరితేరిపోయారన్న వార్తలు వినవస్తున్నాయి. అధికారులు సైతం ఉదాసీనంగా ప్రవర్తిస్తున్నరన్న ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి. ఒక భవంతి కూలినా, ఒక క్రిమినల్‌ పట్టుబడినా... ఆ ఘటన వెనుక ఎవరో ఒక ప్రముఖ నాయకుని పేరు వినిపిస్తోంది. ఇలాంటి ఆరోపణల్లో నిజానిజాల మాట అటుంచితే... ప్రజా ప్రతినిధుల మీద మునుపటి నమ్మకాలు సన్నగిల్లాయన్న విషయంలో పెద్దగా అనుమానం లేదు.

 

మరి ఇలాంటి పరిస్థితుల్లో సమాజంలో అసంతృప్తి ఉండక మరేముంటుంది. ఆ విషయం తెలిసిన పాలకులు ముందుగా ప్రభుత్వం వైపు నుంచే కఠినమైన సంస్కరణలు చేపట్టవలసి ఉంటుంది. లేకపోతే ముఖ్యమంత్రిగారు భయపడినట్లుగానే – ‘ప్రజల అసంతృప్తి పరిధి దాటితే.. దాన్ని కొన్ని శక్తులు దుర్వినియోగం చేసే అవకాశముంది.’

Online Jyotish
Tone Academy
KidsOne Telugu