వర్షాకాలంలో దోమల బెడద తగ్గాలంటే ఈ టిప్స్ పాటించాలి..!

వర్షాకాలం ఇంటి పరిసరాలు చాలా చిత్తడిగా ఉంటాయి.  ఇలాంటి ప్రాంతాలు దోమలు పెరగడానికి అనువుగా ఉంటాయి.  విపరీతమైన దోమల కారణంగా వర్షాకాలంలో వైరల్ ఇన్ఫెక్షన్లు,  మలేరియా,  చికెన్ గున్యా వంటి జ్వరాలు వస్తాయి.  అయితే ఇంటి పరిసరాలలో అసలు దోమలు ఉండకూడదంటే ఈ కింద చెప్పుకునే చిట్కాలు ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా ఫాలో అవ్వాలి.  ఇలా చేస్తేనే ఈ వర్షాకాలంలో జ్వరాల బారిన పడకుండా తమను తాము మాత్రమే కాకుండా కుటుంబాలను కూడా కాపాడుకోవచ్చు.


ఇంటి పరిసరాలలో ఉండే పూల కుండీలు,  బకెట్లు,  పాత టైర్లు వంటి వాటిలో వర్షం నీరు చేరుతూ ఉంటుంది.  ఇలాంటి వాటిలో నీటిని ఎప్పటికప్పుడు తొలగిస్తూ ఉండాలి. నీరు అలాగే నిల్వ ఉంటే దోమలు గుడ్లు పెట్టి తమ సంతతిని వృద్ధి చేసుకుంటాయి. వర్షాకాలం పూర్తయ్యేలోపు ఈ దోమల ఉదృతి పెరుగుతుంది.  కాబట్టి ఇంటి పరిసరాలు పొడిగా, నీటితో లేకుండా జాగ్రత్తలు తీసుకోవాలి.


ఇంటి చుట్టుప్రక్కల ప్రాంతాల్లో  ఉన్న నీటి కాలువలు,  డ్రైనేజీ సిస్టం, నీరు నిల్వ చేసే సొంపు వంటివి శుభ్రంగా ఉంచుకోవాలి.  వర్షం కారణంగా వీటిలో కాగితాలు, ప్లాస్టిక్ కవర్లు అడ్డు పడి నీరు నిలుస్తూ ఉంటుంది.  ఇవి కూడా దోమలకు ఆవాసాలుగా మారతాయి. నీటి కాలువలు, డ్రైనేజీ సిస్టమ్ ఎప్పుడూ నీరు పారుతూ ఉండేలా చూసుకోవాలి.


తప్పనిసరి పరిస్థితిలో బయటకు వెళ్లినా,  ఇంటి చుట్టుప్రక్కల దోమల ఉదృతి ఎక్కువగా ఉన్నా దోమ కాటుకు గురి కాకుండా, చర్మాన్ని సంరక్షించగల లోషన్ లు, క్రీములు, స్ప్రే లు  ఉపయోగించాలి. ఇవే కాదు నిమ్మ, యూకలిప్టస్ నూనె వంటి సారాలతో కూడిన స్ప్రే లు దోమలను దరిదాపుల్లోకి రానివ్వవు. వీటిని వినియోగించాలి.


ఇంట్లో నీలగిరి తైలం లేదా యూకలిప్టస్ నూనె, నిమ్మ,  టీట్రీ వంటి నూనెలను ఉపయోగించాలి. ఆయిల్ డిఫ్యూజర్ లను ఉపయోగించాలి.  ఇవి దోమలను ఇంట్లో నుండి తరిమికొట్టడంలో సహాయపడతాయి. పైపెచ్చు ఇల్లంతా చాలా ఆహ్లాదంగా ఉంటుంది.


సాయంత్రం సమయాల్లోనే దోమలు ఎక్కువగా వస్తుంటాయి.   ఈ సమయంలో ఇంట్లో సీలింగ్ ఫ్యాన్ లు ఆన్ లో ఉంచాలి.  గాలి ఉదృతి కారణంగా దోమలు సరిగా ఎగరలేక ఇంట్లో నుండి వెళ్లిపోతాయి. ముఖ్యంగా పడకగదులలో ఫ్యాన్లు ఆన్ లో ఉంచితే పడుకునే సమయానికి దోమలు అక్కడి నుండి వెళ్లిపోతాయి.


దోమల బెడద తప్పించుకోవడానికి ఇంట్లో వేప,  సాంబ్రాణి వంటి హానికరం కాని వాటితో ఇంట్లో ధూపం వెయ్యాలి.  ఇవి ఒకవైపు దోమలను తరిమికొట్టడంలోనూ, మరొకవైపు వాటి వాసన కారణంగా ఇంట్లో వారికి ఆరోగ్యాన్ని చేకూర్చడంలోనూ సహాయపడతాయి.


ఇంటి బాల్కనీ,  ఇంటి ఆరుబయట ప్రాంతంలో సిట్రోనెల్లా,  లావెండర్,  బంతి పువ్వులు, నిమ్మగడ్డి వంటి మొక్కలను పెంచాలి.  ఈ మొక్కల సువాసన కారణంగా దోమలు ఆ దరిదాపుల్లో ఉండవు.


ముఖ్యంగా ఇంటి తలుపులకు,  కిటికీలకు నెట్ కర్టెన్లు ఏర్పాటు చేసుకోవాలి.  దీనివల్ల ఇంట్లోకి తాజా గాలి వస్తూనే దోమలు రాకుండా ఉంటాయి.


                                        *రూపశ్రీ.