బొజ్జ గ‌ణ‌ప‌య్య పూజ‌కు వేళాయె!

గణపతి నవరాత్రి వేడుకలు అంగ‌రంగ వైభ‌వంగా జ‌రుపుకునేందుకు తెలుగు రాష్ట్రాల్లోని ప్ర‌జ‌లు సిద్ధ‌మ‌య్యారు. ప‌ట్ట‌ణం, ప‌ల్లెల్లో వాడ‌వాడ‌లా గ‌ణ‌నాథుడి మండ‌పాలు ఏర్పాటు చేశారు.  సర్వ విఘ్నాలను తొలగించే వినాయకుడు భక్తుల నుంచి పూజలందుకోనున్నాడు. ప్ర‌తీ సంవత్సరం భాద్రపద మాసం శుక్లపక్ష చవితి రోజున దేశవ్యాప్తంగా ఈ పండగను అంగరంగ వైభవంగా ప్రజలు జరుపుకొంటారు. తొమ్మిది నుంచి ప‌ద‌కొండు రోజుల పాటు గ‌ణేశ్ ఉత్స‌వాలు కొన‌సాగ‌నున్నాయి. ఆది దంపతుల(శివ, పార్వతులు) మొదటి కుమారుడైన గణపతిని పూజించనిదే ఏ పనీ ప్రారంభించరు. 

వినాయ‌క చ‌వితి హిందువుల‌కు తొలి పండుగ‌. భాద్ర‌ప‌ద శుద్ధ చ‌వితి రోజే గ‌ణ‌నాథుడు పుట్టాడ‌ని పురాణాలు చెబుతున్నాయి. గ‌ణేషుడి ఆవిర్భావ గాథ‌లు పురాణాల్లో ర‌క‌ర‌కాలుగా చెప్ప‌బ‌డ్డాయి. శివ పురాణం ప్ర‌కారం.. ఒక‌సారి పార్వ‌తీదేవి స్నానం చేయ‌డానికి శ‌రీరానికి న‌లుగు పండిని రాసుకుంది. మిగిలిన న‌లుగు పండిని ఓ బొమ్మ‌ను త‌యారు చేసి దాని ప్రాణం పోసింది. అత‌నిని ద్వారం ద‌గ్గ‌ర కాప‌లాగా పెట్టింది. శివుడు లోప‌లికి వెళ్తుండ‌గా ద్వారం ద‌గ్గ‌ర బాలుడు అడ్డుకున్నాడు. ఇద్ద‌రి మ‌ధ్య యుద్ధం జ‌రిగింది. ఆగ్ర‌హంతో శివుడు ఆ బాలుడి త‌ల‌ను త్రిశూలంతో న‌రికివేశాడు. త‌ల తెగిప‌డి ఉన్న బాలుడిని చూసి పార్వ‌తీ దేవి క‌న్నీరుమున్నీరైంది. పార్వ‌తీదేవి బాధ‌ను చూడ‌లేకపోయిన శివుడు.. ఒక ఏనుగు త‌ల‌ను తీసుకొచ్చి అతికించి ప్రాణం పోశాడు. అత‌నికి గ‌జాన‌ణుడు అని పేరు పెట్టాడు. త‌న కార‌ణంగా ఆ బాలుడు వికార రూపాన్ని పొందాడ‌ని గ‌జాన‌నుడికి తొలిపూజ అందుకునేలా శివుడు వ‌ర‌మిచ్చాడు. దీంతో ప్ర‌తీయేడాది భాద్ర‌ప‌ద మాసంలో తొలి పూజ‌ను గ‌ణేశుడు అందుకుంటున్నాడు. 

తెలుగు రాష్ట్రాల్లో ఖైర‌తాబాద్ గ‌ణ‌నాథుడికి ప్ర‌త్యేక స్థానం ఉంది. ప్ర‌తీయేటా ఇక్క‌డ గ‌ణ‌ప‌తిని ద‌ర్శించుకునేందుకు పెద్ద ఎత్తున భ‌క్తులు త‌ర‌లివ‌స్తుంటారు. ప్ర‌తీ ఏడాది ఒక ప్ర‌త్యేక అవ‌తారంలో ద‌ర్శ‌న‌మిచ్చే గ‌ణ‌నాథుడు.. ఈసారి 70 అడుగుల ఎత్తుతో శ్రీ స‌ప్త‌ముఖ మ‌హాశ‌క్తి గ‌ణ‌ప‌తిగా భ‌క్తుల‌కు ద‌ర్శ‌న‌మివ్వ‌నున్నాడు. గ‌ణ‌నాథుడి ఉత్స‌వాలు ఒక్క భారతదేశంలోనే కాదు.. విదేశాల్లో సైతం జ‌రుపుకుంటారు. ఇంకా చెప్పాలంటే.. ముస్లిం దేశాల్లో కూడా జ‌రుపుకుంటారు. జపాన్, థాయ్‌లాండ్, శ్రీలంక దేశాలతోపాటు ముస్లింలు అత్యధిక సంఖ్యలోనున్న ఇండోనేషియాలోసైతం గణపతి పూజలందుకుంటున్నారు. 270 మిలియన్ల జనాభా కలిగిన ఆ దేశంలో 87 శాతం మంది ముస్లింలే. వారంతా విఘ్నేశ్వరుడిని పూజిస్తారు.

ఇక భారత దేశంలో బహిరంగంగా ఒక సామాజిక ఉత్సవంగా వినాయక చవితి నవరాత్రులను నిర్వహించడం అన్నది మాత్రం స్వాతంత్ర్యోద్యమ సమయంలో భారతీయుల ఐక్యతా చిహ్నంగా నిర్వహించడం ఆరంభమైంది. ఇందుకు స్వాతంత్ర్యం నా జన్మ హక్కు అని నినదించిన లోకమాన్య బాలగంగాధర్ తిలక్ కారణం. 1894లో మహారాష్ట్ర పుణె కేంద్రంగా సర్వ జనైఖ్య గణేశ్ ఉత్సవాలకు ఆయన పిలుపునిచ్చారు. ఆయన పిలుపు మేరకు ఒక సామాజిక ఉద్యమంగా గణేష్ నవరాత్రి ఉత్సవాలు ఆరంభమయ్యాయి. అలా మొదలైన గణేష్ చతుర్ధి ఉత్సవాలు ఇప్పటికీ కొనసాగుతున్నాయి.