పంచమవేదం అయిన మహాభారతం నుండి విద్యార్థులు ఏం నేర్చుకోవచ్చు..?

మహాభారతాన్ని పంచమవేదం అని అంటారు. ఇందులో ఉన్న పాత్రలు అనేకం.  ప్రతి పాత్రా ఇందులో ప్రత్యేకమే.. ప్రతి పాత్ర నుండి ఏదో ఒక విషయాన్ని నేర్చుకోవచ్చు. చిన్ననాటి నుండే పిల్లలకు మహాభారతం, రామాయణం, భగవద్గీత వంటివి చదవడం అలవాటు చేయాలని వీటి వల్ల పిల్లలలో వ్యక్తిత్వ విలువలు మెరుగవుతాయని పెద్దలు చెబుతారు.  మహాభారతం నుండి పిల్లలు చాలా సులభంగా అర్థం చేసుకోగల కొన్ని విషయాలు తెలుసుకుంటే..


లక్ష్యం..


అర్జునుడు అంటే అందరికీ ఇష్టం. ఒక లక్ష్యాన్ని సాధించడంలో అర్జునుడిని మించిన యోధుడు లేడని అంటారు. లక్ష్యం పై దృష్టి పెడితే అసాధ్యాలను అయినా సుసాధ్యం చేయవచ్చని అర్జునుడిని చూసి నేర్చుకోవచ్చు.


జ్ఞానం..

ఎప్పుడూ జ్ఞానాన్ని సంపాదిస్తూ ఉంటేనే జీవితంలో మెరుగ్గా ఉండగలం. జ్ఞాన సంపాదన ఉన్నవారే విజయం సాధించవచ్చని మహాభారతం చెబుతుంది.

కర్ణుడు..


కర్ణుడు మహాభారతంలో గొప్ప యోధుడు.  బాగా కష్టపడితే ఎలాంటి కష్టమైన పరిస్థితుల నుంచి అయినా బయట పడవచ్చని కర్ణుడి ద్వారా తెలుసుకోవచ్చు.  సాధారణ వ్యక్తి నుండి ఒక  రాజ్యానికి రాజుగా ఎదిగిన తీరు అమోఘం.


ఆకర్షణలు..

విద్యార్థులు చాలా విషయాలకు తొందరగా ఆకర్షితులు అవుతారు. కానీ ఆకర్షించే విషయాల నుండి దూరంగా ఉండాలని,  అలా చేస్తేనే తమ బాధ్యత తాము సంపూర్ణంగా నెరవేర్చగలరని  మహాభారతం చెబుతుంది.


దుర్యోధనుడు..


మహాభారతంలో దుర్యోధనుడు చాలా చెడ్డవాడు.  నిజానికి దుర్యోధనుడు చెడు సావాసం వల్లే చెడ్డవాడిగా మారాడు. చెడు స్నేహాలు చేస్తే దుర్యోధనుడిలా చెడిపోతారని,  చెడు సావాసాలు పతనానికి దారి తీస్తాయని విద్యార్థులు తెలుసుకోవాలి.


పాండవులు..

ఐకమత్యమే మహా బలం అని పిల్లలు చదువుకుంటూనే ఉంటారు.  పాండవులు అందరూ కలసి కట్టుగా ఉండటం వల్లే ఎన్ని సమస్యలు ఎదురైనా వాటిని అధిగమించి విజయం సాధించారని అర్థం చేసుకోవాలి.


ధర్మరాజు..

ధర్మరాజు ఉన్నత వ్యక్తిత్వం గలవాడు. వ్యక్తిత్వం మంచిగా ఉంటే మనిషికి విలువ కూడా అదే వస్తుందని ధర్మరాజు వ్యక్తిత్వం నుండి తెలుసుకోవాలి.


దృఢ చిత్తం..


దృఢచిత్తం మనిషి ఏదైనా సాధించేలా చేస్తుంది.  దృఢచిత్తం వల్లనే పాండవులు అజ్ఞాతవాసం చెయ్యాల్సి వచ్చినా అందులో విజయం సాధించారని విద్యార్థులు తెలుసుకోవాలి.


సహనం..

సహనం ఎంతటి కష్టాన్ని, బాధను అయినా అధిగమించేలా చేస్తుంది. సహనం కోల్పోకుండా ఉంటే విద్యార్థులు తమ జీవితంలో విజయాలు తప్పకుండా అందుకుంటారు.


భీష్ముడు..


మహాభారతంలో భీష్ముడు చాలా కీలకం. మనసును ఎప్పుడూ చెప్పుచేతల్లో ఉంచుకోవడం భీష్ముడికే చెల్లింది.  అంత గొప్ప యోధుడు కూడా తన కర్తవ్యాన్ని ఏ నాడు నిర్లక్ష్యం చేయలేదు.

                                                *రూపశ్రీ.