మీరు వాడే సెంటుకీ ఉంటుందో వ్యక్తిత్వం!
posted on Sep 2, 2024 9:30AM
మన వ్యక్తిత్వం ఎలాంటిదో... మనం ఎంచుకునే వస్తువులు కొంతమేరకు ప్రతిబింబిస్తాయి. పెర్‌ఫ్యూమ్‌కి (perfume) కూడా ఈ సూత్రం వర్తిస్తుందంటున్నారు నిపుణులు. మన మనసుకి దగ్గరగా ఉన్న పరిమళాలనే ఎన్నుకొంటామని వాదిస్తున్నారు. Paul Jellinek అనే ఆయన ప్రాచీన గ్రంథాలన్నీ తిరగతోడి పరిమళాలను నాలుగు రకాలుగా విభజించారు.
AIR:-
నిమ్మ, జామాయిల్ వంటి చెట్ల నుంచి తయారుచేసే పరిమళాలు ఈ విభాగానికి వస్తాయట. ఇలాంటి పరిమళాలు మనలోని సృజనకు పదునుపెడతాయంటున్నారు. మానసికంగా దృఢంగా ఉండేవారు, నలుగురిలో కలిసే చొరవ ఉన్నవారు ఇలాంటి పరిమళాలను ఎన్నుకొంటారట. ఇలాంటివారు కొత్తదారులను వెతుకుతారనీ, తమ మనసులో మాటని నిర్భయంగా పంచుకుంటారనీ చెబుతున్నారు. ఇతరులని మందుకు నడిపించడంలోనూ, జీవితాన్ని పరిపూర్ణంగా అనుభవించడంలోనూ వీరు ముందుంటారట.
FIRE:-
ముక్కుపుటాలు అదిరిపోయేలా ఘాటైన పరిమళాలు ఈ విభాగం కిందకి వస్తాయి. ఈ తరహా పరిమళాలను ఎన్నుకొనేవారు కొత్త కొత్త ఆలోచనలతో ముందకెళ్తుంటారు. కానీ ఒకోసారి తమ సామర్థ్యాన్ని మించిన లక్ష్యాన్ని ఎన్నుకొని భంగపడుతూ ఉంటారు. వీరి వ్యక్తిత్వం ఆకర్షణీయంగా ఉన్నప్పటికీ... ఇతరులు తన గురించి ఏమనుకుంటున్నారో అనే పట్టింపు కానీ, ఇతరుల దృష్టిని ఆకర్షించాలన్న తపన కానీ వీరిలో కనిపించవు.
WATER:-
గులాబీలవంటి సున్నితమైన పరిమళాలను ఇష్టపడేవారు ఈ విభాగానికి చెందుతారు. మానసికంగా ఎప్పుడూ సందిగ్ధావస్థలో ఉండేవారు ఇలాంటి పరిమళాలను ఇష్టపడతారట. వీరి స్వభావం, నిర్ణయాలు ఎప్పుడెలా ఉంటాయో అంచనా వేయడం కష్టం. ప్రవహించే నీటిలాగా వీరు దేనినీ పట్టించుకోనట్లు కనిపించినా... తమ కుటుంబాలు, పిల్లలకు మాత్రం చాలా ప్రాధాన్యతని ఇస్తారట.
EARTH:-
తియ్యటి పదార్థాలను పోలిన పరిమళాలు ఈ కోవకి చెందుతాయి. ఇలాంటి పరిమళాలను ఇష్టపడేవారు చాలా ప్రాక్టికల్‌గా ఉంటారట. గాలిలో మేడలు కట్టడం వీరి స్వభావానికి విరుద్ధం. లోకాన్నీ, తన వ్యక్తిత్వాన్నీ ఉన్నది ఉన్నట్లుగా గ్రహించే నైపుణ్యం వీరి సొంతం. జీవితంలో ఎన్ని ఒడిదొడుకులు ఎదురైనా తట్టుకుని నిలబడేందుకు వీరు సదా సిద్ధంగా ఉంటారు.
ఇవీ Paul Jellinek చేసి తీర్మానాలు. ఆయన చెప్పినంత మాత్రాన మనం వాడే పర్‌ఫ్యూమ్ ఖచ్చితంగా మన వ్యక్తిత్వాన్ని ప్రతిబిస్తుందని అనుకోలేం. ముఖ్యంగా మనలాంటి మధ్యతరగతి ప్రజలు 1+1 ఆఫర్ ఉందనో, కొత్త పెర్‌ఫ్యూమ్ మార్కెట్లోకి వచ్చిందనో, పక్కవాళ్లు కొనుక్కున్నారనో... పెర్‌ఫ్యూమ్స్ వాడేస్తుంటారు. కాకపోతే సరదాగా కాసేపు బేరీజు వేసుకోవడం కోసం పైన పేర్కొన్న లక్షణాలని చదువుకోవచ్చు.