నేర్చుకోవడం కష్టమేమీ కాదు!

కొత్త విషయాన్నో కొత్త పనులనో నేర్చుకోవాలంటే కొంతమంది చాలా కష్టమని, తమ వల్ల కాదని చేతులెత్తేస్తూ ఉంటారు. అయితే ఆ కష్టమంతా బుర్రలో నిండిపోయిన ఒకానొక నిరాశాభావమే అనేది అందరూ తెలుసుకోవలసిన విషయం. కొందరు కొన్ని నేర్చుకోవాలంటే బహుశా ఆ పని పట్ల సమాజం నుండి కాస్త హేళన ఎదురవ్వడం కూడా ఆ పని నేను నేర్చుకోలేను అని చెప్పే సాకు కూడా కావచ్చు. మొత్తానికి ఏదైనా నేర్చుకోవడం కష్టమేమీ కాదు అయితే కావాల్సిందల్లా కొన్ని రకాల లక్షణాలు. 

నేర్చుకోవడానికి కావాల్సిన లక్షణాలు ఏంటి?

లెర్నింగ్ ఈజ్ ఏ లైటింగ్ స్పాట్!

నేర్చుకోవడం అనేది ఎప్పుడూ ఒకానొక కొత్త వెలుగును జీవితంలోకి తెస్తుంది. అది ఏదైనా కావచ్చు. నేటి కాలంలో కంప్యూటర్, అందులో బోలెడు కోర్సులు. సైకిల్ దగ్గర నుండి బైక్, కార్ వంటి వాహనాల డ్రైవింగ్, కుట్లు, అల్లికలు. ఫోటోగ్రఫీ ఇవి మాత్రమే కాకుండా ఇప్పట్లో గోల్డ్ మెడల్స్ తెచ్చిపెట్టే ఎన్నో రకాల గేమ్స్, ఇంకా డాన్స్, సింగింగ్ ఇలాంటి బోలెడు విషయాలు అన్నీ జీవితంలో ఎంతో గొప్ప మార్పును తీసుకొస్తాయి. అవన్నీ కూడా జీవితాల్లో ఎంతో ఉపయోగపడేవే.

ఆసక్తి!

ఆసక్తి మనిషిలో నేర్చుకోవాలనే తపనను పెంచుతుంది. ఇది క్రమంగా మనిషిని ధైర్యవంతులుగా మార్చుతుంది. ఊహాగానాలు, అపోహలు అన్నీ వదిలిపెట్టి ఆసక్తి ఉన్న విషయం వైపు మనసు పెట్టి ఆ దారిలో వెళితే నేర్చుకోవడం ఎంతో సులువు అనిపిస్తుంది.

అవసరం!

అవసరం మనిషిని అడ్డమైన పనులు చేయిస్తుందని ఎంతోమంది జీవితాలను చూసి అర్థం చేసుకోవచ్చు. కొన్నిసార్లు సరదాగా, ఇష్టంతో నేర్చుకున్న విషయాలే అవసరానికి పనికొస్తాయి. అవసరం ఉన్నప్పుడు నూరు ఆరైనా, ఆరు నూరైనా దాన్ని ఖచ్చితంగా నేర్చుకోవాలి లేకపోతే ఎన్నో అవకాశాలు, మరెన్నో ఉంనత శిఖరాలు చేజారిపోతాయని అనిపించినప్పుడు డూ ఆర్ డై అనే రీతిలో అనుకున్నది సాధించేవరకు వెనకడుగు వెయ్యనివ్వకుండా చేస్తుంది అవసరం. 

పట్టుదల!

పట్టిన పట్టు విడవకపోవడం గొప్ప లక్షణం. మొదలుపెట్టిన పనిని మధ్యలో విడవకుండా ఎన్ని సమస్యలు, ఎన్ని అడ్డంకులు ఎదురు వచ్చినా దాన్ని పూర్తి చేయడంలో ఎంతో గొప్ప ఓర్పు ఉంటుంది. అంతేకాకుండా ఆ పట్టుదల అనేది జీవితంలో ఎన్నో విషయాల్లో ప్రేరణగా ఉంటూ మరిన్ని నేర్చుకునేందుకు సహాయపడుతుంది.

విజయం కాదు నేర్చుకోవడమే!

చాలామంది ఏదైనా ఒక విషయం నేర్చుకోగానే దాన్ని తాము సాధించిన విజయంగా భావిస్తారు. కానీ నేర్చుకోవడం అనే విషయంలో గెలుపు, ఓటమి అనేవి ఎప్పుడూ ఉండవు. అవి నేర్చుకోవడం లేదా నేర్చుకోవడాన్ని ఆపేయడం అనే భావనలో చూడాలి. అలా చూసినప్పుడు ఆటోమాటిక్ గా నేర్చుకున్నాం అనే గర్వం కానీ నేర్చుకోలేకపోయాము అనే నిరాశ కానీ దరిచేరవు. ఇంకా ముఖ్యంగా నేర్చుకోవడం అనేది ఎప్పుడూ కొత్త అనుభవాన్ని ఇస్తుంది కాబట్టి ఆ విషయంలో ఎప్పుడూ ఉత్సాహంగా ఉండచ్చు.

సాధన సాధ్యతే సర్వం!

నేర్చుకోవడం అనేది ఒక అనుభవపూర్వక ప్రక్రియ కాబట్టి ఆ వైపు సాధన అనేది  ఎంతో గొప్ప పాత్ర పోషిస్తుంది. నేర్చుకోవడంలో ఆసక్తి, పట్టుదల, అవసరం, అన్నిటికీ మించి దాన్ని ఒక అనుభవాత్మక పనిగా భావించడం వంటివి బుర్రలో పెట్టుకుని ఫాలో అయితే  కష్టమంటూ ఏదీ ఉండదు. 

                               ◆వెంకటేష్ పువ్వాడ.

Related Segment News