పెద్దాయన.. పెద్దలకు మాత్రమే వీడియో... పెద్ద గండంలో కాంగ్రెస్!

 

మోదీ 2014లో ఇచ్చిన నినాదం కాంగ్రెస్ హఠావ్! నిజానికి వాలకం చూస్తుంటే కాంగ్రెస్ ను ఎవరో వచ్చి తొలగించే అవసరమే లేనట్లు కనిపిస్తోంది. హస్తం పార్టీ వరుసగా ఒక్కో రాష్ట్రంలో తనపై తానే భస్మాసుర హస్తం పెట్టుకుంటూ వస్తోంది! తాజాగా వారి చేతిలో వున్న ఏకైక పెద్ద రాష్ట్రం కర్ణాటక కూడా హస్తం చేయి నుంచి జారిపోయే పరిస్థితులు క్రమంగా అధికమవుతున్నాయి!
సీఎం సిద్ధరామయ్య క్యాబినేట్లోని సీనియర్ మంత్రి హెచ్, వై. మేటి. ఎక్సైజ్ శాఖను నిర్వహించే ఆయన మత్తులో చిక్కుకుని చేయ కూడని పనే చేశాడు. మందు తాగినా బావుండేది. మగువతో అడ్డంగా దొరికిపోయాడు. అదీ ఆమెకు ఇష్టం లేకుండా బలవంతం చేశాడట ప్రబుద్ధుడు. ఇదంతా కేవలం ఆరోపణ కాదు. 70ఏళ్లు పైబడ్డ ఆ నవ యవ్వన సుందరాంగుడి గన్ మెన్ లో ఒకరే వీడియో తీసి మరీ సాక్ష్యం అందించాడు. దాన్నిఅందుకున్న ఓ సమాచార హక్కు ఉద్యమకారుడు బజారుకీడ్చాడు. ఇప్పుడు రాసలీల ముదురు, ముసలి మంత్రిగారి పదవి ఊడింది. స్వయంగా ఆయనే రాజీనామా చేయగా, గవర్నర్ ఉన్నపళంగా అమోదించారు!

 

నిజానికి పొలిటిషీన్స్ రాసలీలలు జరపటం మన దేశంలో పబ్లిక్ సీక్రెట్. అంతా అందరికీ తెలిసిందే. కాని, వీడియోతో సహా బయటపడ్డప్పుడు ఒక్కసారిగా అంతా షాకవుతారు. మేటి లాంటి మేటి నాయకులు కూడా ఆ దెబ్బకు తాటి పళ్లలా ఊడి కింద పడతారు. కాని, కర్ణాటకలో సమస్య కేవలం బజారున పడ్డ పెద్దాయనది మాత్రమే కాదు. త్వరలో ఎన్నికలు రానున్న వేళ మొత్తం పార్టీనే మూల్యం చెల్లించుకోవాల్సి రావొచ్చు. అదీ ఇప్పుడు ఢిల్లీ హైకమాండ్ కు పెద్ద టెన్షన్! 

 

హెచ్ వై మేటీ నేరుగా వ్యవహారం నడుపుతూ బుక్కయ్యాడు. కాని, అంతకు ముందు కాంగ్రెస్ పార్టీ వారే బ్లూ ఫిల్ములు చూస్తూ అంసెబ్లీని భ్రష్ఠుపట్టించారు. ఇక అవినీతి ఆరోపణలకైతే కొదవే లేదు. కర్ణాటకలో ముఖ్యమంత్రి సిద్ధరామయ్య సహా బోలెడు మంది అధికార వర్గం నేతలపై ఆరోపణలు వచ్చాయి. కేసులు నడుస్తున్నాయి. వీటన్నిట్ని జనం నిశ్శబ్ధంగా చూస్తూనే వున్నారు. మరో వైపు కావేరి జలాల విషయంలో సుప్రీమ్ తీర్పు కూడా కర్ణాటక రాష్ట్రానికి వ్యతిరేకంగా వచ్చింది. దీన్ని ప్రతిపక్షం రాష్ట్ర కాంగ్రెస్ సర్కార్ కి వ్యతిరేకంగా వాడుకుంటోంది. అసలు బెంగుళూరు రోడ్లపై ట్రాఫిక్ సమస్య మొదలు పక్క రాష్ట్రం తమిళనాడుతో నీటి గొడవల వరకూ అనేక విషయాల్లో సిద్ధరామయ్య గవర్నమెంట్ ఫెయిలవుతూ వస్తోంది!

 

కర్ణాటక వచ్చే ఎన్నికల్లో దాదాపుగా హస్తం చేయి నుంచి జారిపోయే సూచనలు స్సష్టంగా కనిపిస్తున్నాయి. ఏదో అద్భుతం జరిగి మళ్లీ అక్కడ కాంగ్రెస్ జెండా రెపరెపలాడాలి తప్ప గత 5ఏళ్ల పాలన మాత్రం ఏ విధంగానూ ఓట్లు సంపాదించే స్థితిలో లేదు. దానికి తోడు ఇప్పుడు రాసలీలలు కూడా బయటపడటం రచ్చని మరింత ఎక్కువ చేసేసింది. ఒకవేళ కర్ణాటక లాంటి పెద్ద రాష్ట్రం కూడా పోతే... మోదీ చెప్పిన కాంగ్రెస్ ముక్త్ భారత్... దాదాపుగా జరిగిపోయినట్టే! కౌంట్ డౌన్ బిగిన్స్ ...

Online Jyotish
Tone Academy
KidsOne Telugu