సేవ చేస్తే సంతోషం లభిస్తుంది!
posted on Aug 10, 2016 10:34AM
మానవ సేవే మాధవ సేవ అని నమ్ముతారు భారతీయులు. సేవ చేస్తే పుణ్యం, పురుషార్థం రెండూ లభిస్తాయని ఆశిస్తారు. ఇందులో వాస్తవం లేకపోలేదని నిరూపిస్తోంది ఒక పరిశోధన. స్వచ్ఛంద సేవలో పాల్గొన్నవారు పదికాలాల పాటు చల్లగా ఉంటారని పేర్కొంటోంది.
17 ఏళ్ల పరిశోధన
ఇంగ్లండుకు చెందిన రెండు సంస్థల నేతృత్వంలో 1991 నుంచి 2008 వరకు ఈ పరిశోధన జరిగింది. ఇందులో భాగంగా 66,000 మందికి కొన్ని ప్రశ్నాపత్రాలను అందించారు పరిశోధకులు. వీటి ద్వారా వారిలో ఎందరు స్వచ్ఛంద సేవలో పాల్గొంటున్నారన్న విషయాన్ని గమనించారు. అదే సమయంలో వారిలోని మానసిక ఆరోగ్యాన్ని కూడా పరిశీలించారు. ఇలా మానసిక ఆరోగ్యాన్ని పరిశీలించేందుకు ఒక ప్రమాణికమైన GHQ-12 అనే విధానాన్ని అవలంబించారు.
పెద్దవాళ్లదే పెద్దమనసు
- పరిశోధనలో పాల్గొన్నవారిలో 21 శాతం మంది తాము తరచూ స్వచ్ఛంద సేవలో పాల్గొంటామని తెలియచేశారు.
- మగవారికంటే ఆడవారే సేవ చేసేందుకు ఎక్కువగా చొరవ చూపుతున్నట్లు తేలింది.
- ఈ పరిశోధనలో 15 ఏళ్ల కుర్రవాళ్ల నుంచి 80 ఏళ్లకి పైబడిన వారందరూ పాల్గొన్నారు. అయితే సేవ చేసేందుకు కుర్రవాళ్లకంటే వృద్ధులే ఎక్కువ ఉత్సాహం చూపుతున్నట్లు వెల్లడైంది.
అనూహ్యమైన ఫలితాలు
ఈ పరిశోధనలో స్వచ్ఛంద సేవ చేయడానికీ, మానసిక ఆరోగ్యానికీ మధ్య స్పష్టమైన సంబంధం కనిపించడం అందరినీ ఆశ్చర్యపరిచింది. అయితే యువకుల మానసిక ఆరోగ్యం మీద స్వచ్ఛంద సేవ తాలూకు ప్రభావం పెద్దగా కనిపించకపోగా... 40 ఏళ్లు దాటినవారిలోనే ఇలాంటి ఫలితాలు వెల్లడయ్యాయి. ఇదే రకమైన సానుకూల ప్రభావం 80 ఏళ్లు దాటినవారిలో కూడా కనిపించింది.
కారణం
పెద్దవారవుతున్న కొద్దీ స్వచ్ఛంద సేవలో పాల్గొనడం వల్ల ఉపయోగాలు ఉండటానికి రకరకాల కారణాలను చెబుతున్నారు పరిశోధకులు. స్వచ్ఛంద సేవ చేయడం వల్ల సామాజిక బంధాలు గట్టిపడతాయనీ, వీటితో ఆరోగ్యమూమెరుగుపడుతుందంటున్నారు. పైగా వయసు పైబడినవారిలో తాము ఎవరికీ, ఎందుకూ పనికిరామన్న భావన కలిగే అవకాశం ఉంది. స్వచ్ఛంద సేవ చేయడం ద్వారా తమ అవసరం ఈ సమాజానికి ఉందన్న నమ్మకం కలుగుతుంది. ఇక చాలామంది వృద్ధులు ఒంటరితనంలో మగ్గిపోతుంటారు. ఇలాంటివారికి నలుగురితో కలిసి నాలుగు మంచి పనులు చేసే అవకాశాన్ని స్వచ్ఛంద సేవలు కల్పిస్తాయి.
అదీ సంగతి! సేవ చేస్తే పుణ్యం లభిస్తుందో లేదోగానీ.... మానసిక ఆరోగ్యం మాత్రం పదిలంగా ఉంటుందన్నమాట. అలాగని ఏదో పక్కింటివారికి కాసేపు సాయం చేసి రావడం కాదట. నిబద్ధతతో సమాజానికి చేసే సేవే సత్ఫలితాలనిస్తుందంటున్నారు పరిశోధకులు.
- నిర్జర.