ఏపీకి ప్రత్యేకహోదా రాదు: జేసీ దివాకర్ రెడ్డి

 

రాష్ట్రానికి ప్రత్యేకహోదా కోరుతూ ఏపీ జర్నలిస్టుల ఫోరం ఆధ్వర్యంలో నిన్న డిల్లీలో జంతర్ మంతర్ వద్ద జరిగిన ధర్నాలో పాల్గొన్న రాజమండ్రి ఎంపీ మురళీమోహన్ ప్రత్యేకహోదాతో సహా విభజన సమయంలో రాష్ట్రానికి ఇచ్చిన అన్ని హామీలను కేంద్రం అమలుచేయాలని డిమాండ్ చేసారు. పార్లమెంటులో కూడా దీని కోసం తాము పోరాడుతామని తెలిపారు. ఈ ధర్నాలో తెదేపా ఎంపీలు అందరూ కూడా పాల్గొన్నారు. కానీ తెదేపా ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి అనంతపురంలో మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రానికి ఎట్టి పరిస్థితుల్లో ప్రత్యేకహోదా రాదని కుండ బద్దలు కొట్టినట్లుగా చెప్పారు. తాము ప్రధాని మోడీ, హోంమంత్రి రాజ్ నాద్ సింగ్, బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షాలతో మాట్లాడినప్పుడు వారు రాష్ట్ర పరిస్థితుల పట్ల చాలా సానుభూతి చూపారని, వారు రాష్ట్రాన్ని అన్ని విధాలా ఆదుకొనేందుకు అవసరమయిన ప్రత్యేక ఆర్ధిక ప్యాకేజి ఇవ్వగలమని చెప్పారని కానీ రాష్ట్రానికి ప్రత్యేకహోదా మాత్రం ఇవ్వలేమన్నట్లుగా వారు మాట్లాడారని ఆయన తెలిపారు.

 

ఈ ప్రత్యేకహోదా అంశం కారణంగా తెదేపా, బీజేపీలు ప్రతిపక్షాల నుండి తీవ్ర విమర్శలు ఎదుర్కొంటున్నాయి. ఇటువంటి సమయంలో అధికార తెదేపాకి చెందిన నేతలే ప్రత్యేకహోదా గురించి ఈవిధంగా పరస్పర విరుద్దంగా మాట్లాడుతూ చేజేతులా తమ పార్టీకి, ప్రభుత్వానికీ కూడా మరిన్ని సమస్యలు తెచ్చిపెడుతున్నారు. ప్రత్యేకహోదా విషయంలో జరుగుతున్న జాప్యం కారణంగా తెదేపా, బీజేపీలకు ఎదురవుతున్న ఇబ్బందుల కంటే అధికార పార్టీకి చెందిన జేసీ దివాకర్ రెడ్డి, రాయపాటి సాంభశివరావు వంటి నేతలు చేస్తున్న ఇటువంటి వ్యాఖ్యల వలన మరింత ఇబ్బందికర పరిస్థితులు ఎదుర్కోవలసి వస్తోంది. వారు చేస్తున్న వ్యాఖ్యలు ప్రతిపక్షాలకి బలమయిన ఆయుధాలుగా మారుతున్నాయి. కనుక ఇప్పటికయినా తెదేపా దీనిపై ఒక నిర్దిష్ట విధానంతో ముందుకు సాగడం మంచిదని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu