ఆధార్ కార్డు పేరుతో హైదరాబాద్ లో తెదేపా, బీజేపీ ఓట్లు రద్దు?
posted on Aug 8, 2015 9:10AM
.jpg)
ఓటరు కార్డులను ఆధార్ కార్డులతో అనుసంధానం చేయడం మంచి ఆలోచనే. తద్వారా బోగస్ ఓట్లను తొలగించవచ్చును. కానీ ఆ పేరుతో ప్రత్యర్ధ రాజకీయ పార్టీలను దెబ్బ తీయలనుకొంటే? అధికార తెరాస పార్టీ జి.హెచ్.యం.సి. ఎన్నికలలో గెలవలేమనే భయంతో హైదరాబాద్ లో తెదేపా, బీజేపీలకు మంచి పట్టు ఉన్న ప్రాంతాలలో సుమారు 34 లక్షల ఓట్లను తొలగించేందుకు ఓటర్లకు నోటీసులు ఇచ్చిందని ఆ పార్టీల నేతలు ఆరోపిస్తున్నారు. తెలంగాణా తెదేపా నేతలు ముఖ్యమంత్రి ఎన్నికల అధికారి బంవార్ లాల్ ని కలిసి దీని గురిని ఒక పిర్యాదు కూడా చేసారు.
ఎన్నికల కమీషన్ ఆధార్ కార్డు ఉన్నా లేకపోయినా ఓటర్లు తమ ఓటు హక్కుని వినియోగించుకోవచ్చని, ఓటరు కార్డుని ఆధార్ కార్డుతో అనుసంధానం చేయడానికి ఎటువంటి గడువు విధించలేదని, అదొక నిరంత ప్రక్రియగా కొనసాగుతుందని చెపుతున్నప్పటికీ, తెలంగాణా ప్రభుత్వం ఆధార్ కార్డు లేని వారి ఓట్లను రద్దు చేసేందుకు నోటీసులు జారీ చేస్తోందని వారు ఆరోపించారు. తెదేపా, బీజేపీలను ఎన్నికలు జరుగక మునుపే దెబ్బ తీసేందుకే తెలంగాణా ప్రభుత్వం ఇటువంటి కుట్రలు చేస్తోందని వారు ఆరోపించారు. ఒకవేళ ఓటరు కార్డులని ఆధార్ కార్డులతో అనుసంధానం చేయాలనుకొంటే రాష్ట్రమంతటా ఆ ప్రక్రియను చేప్పట్టాలి కానీ ప్రభుత్వం ఒక్క హైదరాబాద్ పైనే ప్రధానంగా దృష్టి పెట్టడంతో ప్రతిపక్షాల ఆరోపణలు నిజమని నమ్మవలసి వస్తోంది. తెలంగాణా ప్రభుత్వం చేస్తున్న ఈ ప్రయత్నాలను ఎన్నికల సంఘం అడ్డుకోవాలని వారు కోరుతున్నారు. మరి దీనిపై ఎన్నికల సంఘం ఏవిధంగా స్పందిస్తుందో చూడాలి.