ప్రత్యేక రాజకీయాలకు యువత ఎందుకు బలవ్వాలి?
posted on Aug 8, 2015 9:15PM
.jpg)
ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా కోసం జరుగుతున్న పోరాటంలో తిరుపతి పట్టణంలో మంచాల వీధికి చెందిన కోటి అనే కాంగ్రెస్ కార్యకర్త మొట్టమొదటి సమెదగా మారాడు. ఈరోజు కాంగ్రెస్ పార్టీ తిరుపతిలో నిర్వహించిన బహిరంగ సభలో అతను అందరూ చూస్తుండగానే ఒంటిపై కిరోసిన్ పోసుకొని ఒంటికి నిప్పంటించుకొన్నాడు. అక్కడ ఉన్నవారు వెంటనే మంటలను ఆర్పినప్పటికీ అప్పటికే 50 శాతం కాలి గాయాల పాలయ్యాడు. ప్రస్తుతం అతని పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు చెపుతున్నారు, కాంగ్రెస్ పార్టీ అతనిని చెన్నై లేదా వేలూరు తరలించి మంచి వైద్యం అందించాలని భావిస్తోంది.
ఈ ప్రత్యేక హోదా అనే అంశం ప్రస్తుతం రాజకీయ పార్టీలకు అధికార తెదేపా, బీజేపీలను డ్డీ కొనేందుకు ఒక బలమయిన ఆయుధంగా ఉపయోగించుకొంటున్నాయి. రాజకీయ పార్టీలు ఆడుతున్న ఈ రాజకీయ చదరంగంలో ప్రత్యేక హోదా వల్ల తమకు, రాష్ట్రానికి ఏమి ప్రయోజనం చేకూరుతుందో కూడా తెలియని కోటి వంటివారు అందరికంటే ముందు పావులుగా మారి బలవుతుంటారాని ఈ సంఘటన నిరూపిస్తోంది. ఇంతకు ముందు తెలంగాణా సాధన కోసం కూడా సుమారు 1200మందికి పైగా ఆత్మహత్యలు చేసుకొన్నారని తెరాస నేతలే చెప్పేవారు. కానీ తెలంగాణా రాష్ట్రం ఏర్పడిన తరువాత బలిదానాలు చేసుకొన్న వారిలో కేవలం 456 మంది కుటుంబాలనే ప్రభుత్వం గుర్తించింది. వారికే కొన్ని ప్రయోజనాలు చేకూర్చింది. మిగిలిన కుటుంబాలు నిరాదారణకి గురయ్యాయి. తెలంగాణా కోసం బలిదానాలు చేసుకొన్న యువకుల తల్లి తండ్రులకు జీవితాంతం సరిపోయే విషాదం, కష్టాలు మిగలగా రాజకీయ నాయకులకు పదవులు, అధికారం, విలాసవంతమయిన జీవితాలు అన్నీ దొరికాయి. చివరికి తెలంగాణా సాధన కోసం ఏనాడు నోరు విప్పని వారికి కూడా మంత్రి పదవులు, ఎమ్మెల్యే, ఎమ్మెయల్సీ సీట్లు దక్కాయి. కనుక కళ్ళ ముందు కనిపిస్తున్న ఈ చరిత్ర నుండి ఆంద్రప్రదేశ్ యువత కూడా ఒక గుణపాఠంగా స్వీకరించి, ప్రత్యేక హోదా కోసం పోరాడాలే తప్ప ప్రాణాలు తీసుకోకూడదని గుర్తుంచుకోవాలి. ఈ ప్రత్యేక హోదా అంశాన్ని రాజకీయ పార్టీలు ఒక బలమయిన రాజకీయ ఆయుధంగానే వాడుకొనేప్రయత్నం చేస్తున్నాయనే సంగతిని కూడా గ్రహించాలి.