జగన్ అందుకే రామోజీని కలిసారుట!

 

రెండు రోజుల క్రితం బద్ద శతృవులయిన రామోజీరావు, జగన్మోహన్ రెడ్డి ఫిలిం సిటీలో సమావేశం కావడం గురించి వారి మీడియాలలో చిన్నముక్క వ్రాయకపోయినా మిగిలిన వారందరూ వారి సమావేశంపై రకరకాల ఊహాగానాలు వ్రాసుకుపోతున్నారు. కానీ ఆశ్చర్యకరమయిన విషయం ఏమిటంటే వారి సమావేశం గురించి వైకాపా నేతలకి ఏమీ తెలియక పోవడం. కనుక వారు కూడా దాని గురించి మాట్లాడేందుకు ఇష్టపడటం లేదు. తెదేపా నేతలు దానిపై ఇంతవరకు స్పందించలేదు. కేవలం మర్యాదపూర్వకంగానే రామోజీని కలిసారని మొదట చెప్పిన వైకాపా తరువాత రామోజీ చాలా పెద్దాయన కనుక ఆయన సలహాలు తీసుకోవడానికి వెళ్లి కలిసారని మరో ముక్క జోడించింది. ఆ తరువాత మాట్లాడిన రోజా ప్రత్యేక హోదాపై ఏవిధంగా ముందుకు పోవాలి? అనే దానిపై ఆయన సలహా తీసుకోనేందుకే వెళ్లి కలిసారని మరో లైన్ జోడించారు.

 

కానీ ప్రత్యేక హోదా పోరాడేందుకు జగన్ తన శత్రువయిన రామోజీ సలహా తీసుకోవడం ఏమిటి...విచిత్రం కాకపోతే? ఎక్కడయినా యుద్దంలో విజయం సాధించేందుకు శత్రువులను సలహాలు అడుగుతారా? అని ఆలోచిస్తే ఆమె చెప్పిన మాటలు ఎంత అసంబద్దంగా ఉన్నాయో అర్ధం అవుతాయి. ఒకవేళ దాని కోసమే రామోజీని కలిసి ఉండి ఉంటే అంతకంటే అవివేకం మరొకటి ఉండబోదు. ఎందుకంటే ప్రత్యేక హోదా విషయంలో ఈనాడు మీడియా చాలా ఆచి తూచి వార్తలు ప్రచురిస్తోంది. ప్రత్యేక హోదాను వ్యతిరేకించినా ప్రజల నుండి వ్యతిరేకత ఎదురయ్యే ప్రమాదం ఉంది. సమర్ధిస్తే బీజేపీకి, తెదేపా ప్రభుత్వానికి చాలా ఇబ్బందికర పరిస్థితులు సృష్టించినట్లువుతుంది. కనుక ఈ విషయంలో జగన్ తన శత్రువయిన రామోజీని సలహాకోరడం అవివేకమే అవుతుంది.

 

జగన్ తనపై కేసుల మాఫీ కోసం లేదా తమ పార్టీకి వ్యతిరేకంగా ఈనాడు మీడియాలో రాబోతున్న కొన్ని వార్తలను ఆపడానికో రామోజీరావు కాళ్ళు పట్టుకొని ఉండవచ్చని కొందరు ఊహించారు. కానీ జగమొండిగా పేరుబడిన జగన్ తన కేసుల మాఫీ కోసమో, తన పార్టీకి వ్యతిరేకంగా వచ్చే వార్తలను ఆపడానికో రామోజీ కాళ్ళు పట్టుకోవడానికి సిద్ధమయ్యే అవకాశమే లేదు. కేసుల విషయంలో అవసరమయితే నేరుగా హోం మంత్రి రాజ్ నాథ్ సింగ్ కాళ్ళే పట్టుకొనే వెసులుబాటు ఉంది ఆయనకి. ఇక ఈనాడు మీడియాలో వైకాపాకి, జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా ఎప్పటి నుండో వార్తలు వ్రాస్తోంది కనుక ఈరోజు కొత్తగా వ్రాసేదేమీ లేదు. ఒకవేళ ఉన్నా జగన్ చేతిలో కూడా బలమయిన మీడియా ఉంది కనుక దానికి ఏవిధంగా కౌంటర్ ఇవ్వాలో ఆయనకి బాగానే తెలుసు.

 

ఎప్పుడూ దుందుడుకు నిర్ణయాలు తీసుకొనే అలవాటున్న జగన్మోహన్ రెడ్డి ఈ విషయంలో కూడా అలాగే ప్రవర్తిస్తున్నట్లుంది. కనుక జగన్ చాలా వ్యూహాత్మకంగానే రామోజీని కలిసి ఉండవచ్చును. ఆ విషయం రామోజీకి తెలియదనుకోలేము. జగన్ మర్యాదపూర్వకంగా కలిసినా దాని వలన తెదేపాలో గుబులు మొదలవుతుంది. ఇంతకాలం తమకు అండగా నిలబడ్డ రామోజీపై అనుమానం మొదలవుతుంది. బహుశః తెదేపాకు, రామోజీరావుకు మధ్య ఉన్న దృడమయిన బంధం తెగ్గోట్టేందుకే జగన్ తన అహాన్ని పక్కనపెట్టి వెళ్లి రామోజీని కలిసి ఉండవచ్చును. కానీ రాజగురువుగా పేరొందిన రామోజీ ఆ మాత్రం గ్రహించలేరని అనుకోలేము. కనుక ఆయన తప్పనిసరిగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకి తమ సమావేశం గురించి ఈపాటికి వివరణ ఇచ్చుకొనే ఉండాలి. లేకుంటే జగన్ వ్యూహం పనిచేయడం మొదలవుతుందని వేరేగా చెప్పుకోనవసరం లేదు. .