రిజర్వేషన్ల కోసం గుజరాత్ లో ‘లాలీ పాప్ ఉద్యమం’
posted on Sep 26, 2015 8:40PM
పటేల్ కులస్తులకు కూడా రిజర్వేషన్లు కల్పించాలని కోరుతూ గుజరాత్ లో హార్దిక్ పటేల్ ప్రారంభించిన ఉద్యమానికి తలొగ్గి ఆ రాష్ట్ర ప్రభుత్వం రిజర్వేషన్లు ఇవ్వకపోయినా పటేల్ కులస్తులలో ఆర్ధికంగా వెనుకబడిన విద్యార్ధుల కోసం రూ.1000కోట్లు ప్యాకేజీని ప్రకటించింది. కానీ అది చిన్న పిల్లలకు ఇస్తున్న ‘లాలీపాప్’ వంటిదని హార్దిక్ పటేల్ ఎద్దేవా చేసారు. పసిపిల్లలు మారాం చేస్తే పెద్దవాళ్ళు ఏవిధంగా లాలీ పాప్ ఇచ్చి ఊరదిస్తారో అదేవిధంగా గుజరాత్ ప్రభుత్వం కూడా రిజర్వేషన్ల కోసం ఉద్యమిస్తున్న పటేల్ కులస్తులను శాంతింపజేసేందుకు ఈ లాలీ పాప్ తాయిలం ప్రకటించిందని ఎద్దేవా చేసారు. అందుకే ఈనెల 29నుండి రాష్ట్ర వ్యాప్తంగా తాము లాలీ పాప్ ఉద్యమం మొదలుపెట్టబోతున్నట్లు హార్దిక్ పటేల్ ప్రకటించారు. ఈ ఉద్యమంలో భాగంగా పటేల్ కులస్తులు ప్రజలకు లాలీ పాప్ లు పంచిపెడతారు. రాష్ట్ర ప్రభుత్వం దిగివచ్చి తమకు రిజర్వేషన్లు కల్పించే వరకు తమ ఉద్యమం కొనసాగుతుందని, ఇటువంటి లాలీ పాప్ లు ఇచ్చి ప్రభుత్వం తమ ఉద్యమాన్ని దెబ్బ తీయాలని ప్రయత్నిస్తే, ఉద్యమాన్ని మరింత ఉదృతం చేస్తామని ఆయన ప్రభుత్వాన్ని హెచ్చరించారు.
కానీ పటేల్ కులస్తులకు రిజర్వేషన్లు ఇవ్వడం ఎట్టి పరిస్థితుల్లో సాధ్యం కాదని గుజరాత్ ముఖ్యమంత్రి ఆనంది బెన్ పటేల్ విస్పష్టంగా ప్రకటించారు. రాష్ట్రంలో ప్రశాంతతకు భంగం కలిగిస్తున్నందుకు రాష్ట్ర హైకోర్టు కూడా హార్దిక్ పటేల్ ను మందలించింది. కానీ అతను మాత్రం తన ఉద్యమం కొనసాగించేందుకే నిశ్చయించుకొన్నారు.
దేశంలో వ్యాపారానికి అనుకూలమయిన రాష్ట్రాలలో గుజరాత్ అగ్రస్థానంలో ఉందని ప్రపంచ బ్యాంక్ ఇటీవలే ప్రకటించింది. కానీ హార్దిక్ పటేల్ చేస్తున్న ఈ ఉద్యమాల వలన ప్రశాంతంగా ఉండే గుజరాత్ రాష్ట్రం ఇప్పుడు భగభగ మండుతోంది. ఒకవేళ ఇదే పరిస్థితి మరికొంత కాలం కొనసాగినట్లయితే గుజరాత్ రాష్ట్రం తీవ్రంగా నష్టపోయే ప్రమాదం ఉంది. కనుక కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఈ సమస్యకు వీలయినంత త్వరగా పరిష్కారం కనుగొనవలసి ఉంది.