వైసీపీలో లుకలుకలు, బొత్సపై సీనియర్ల ఫైర్!
posted on Sep 28, 2015 12:40PM
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి హోల్ అండ్ సోల్ జగన్మోహన్ రెడ్డే, పార్టీ అధినేతగా ఆయనే సుప్రీం, నెంబర్ వన్ కూడా, దాంట్లో ఎలాంటి సందేహం లేదు, తల్లి విజయమ్మ కొద్దిరోజులు గౌరవ అధ్యక్షురాలిగా ఉన్నా, పార్టీలో ఆమె పాత్ర ఏమీ లేదనేది సత్యం, జగన్ జైలుకెళ్లినప్పటి పరిస్థితులను బట్టి విజయమ్మ గౌరవ అధ్యక్షురాలి పాత్ర పోషించినా, పార్టీలో నెంబర్ టు అని చెప్పుకోవడానికి అవకాశం లేదు, ఇక పార్టీలో జగన్ షర్మిల పాత్రా తక్కువేమీ కాదు, జగన్ జైలు జైల్లో ఉన్నప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో సుదీర్ఘమైన పాదయాత్ర చేసి పార్టీని కాపాడటంలో ప్రముఖ పాత్ర పోషించింది, అలాగనీ జగన్ తర్వాత షర్మిలనే అని చెప్పడటానికి లేదు, ఒకానొక టైమ్ లో షర్మిల పాత్ర పార్టీలో కనుమరుగైందనే చెప్పాలి, జగన్ జైలు నుంచి వచ్చాక ఏడాదిన్నరపాటు షర్మిల ఊసే లేదు, ఈమధ్యే అప్పుడప్పుడూ తూతూమంత్రంగా తెలంగాణలో పర్యటిస్తూ ఏదో ఉన్నానంటే ఉన్నానట్లుగా కథ నడిపిస్తోంది,
అయితే వైసీపీలో నెంబర్ టు ఎవరనేదే ప్రశ్న ఈమధ్య పార్టీ నేతల్లో మొదలైందట, జగన్ మెంటాలిటీని బట్టి వైసీపీలో నెంబర్ 2 అనే ఛాన్సే లేదే, ఎందుకంటే అటు అసెంబ్లీలో అయినా, ఇటు బయట అయినా అంతా జగన్ మయమే, ఇంకెవరూ పెద్దగా హైలెట్ కారు, అవుదామన్న జగన్ ఒప్పుకోడు, అందుకే వైసీపీ నేతలు కూడా అధినేత అభీష్టాన్ని గుర్తించి నడుచుకుంటూ సైడైపోతుంటారు, కానీ ఇటీవలే పార్టీలో చేరిన బొత్స మాత్రం ఈ మధ్య అంతా తానై నడిపిస్తున్నారట, జగన్మోహన్ రెడ్డి కూడా బొత్స మాటకు చాలా విలువ ఇస్తున్నాడట, అసలు వైసీపీలో రాజకీయమంతా బొత్స చుట్టూనే తిరుగుతోందని, జగన్ కూడా బొత్సకు అధిక ప్రాధాన్యత ఇస్తున్నారని చెప్పుకుంటున్నారు, పార్టీ ఆఫీసులో కనీసం ప్రెస్ మీట్ పెట్టాలన్న జగన్ నుంచి అనుమతి కావాలని, అలాంటిది బొత్స పదేపదే మీడియా సమావేశాలు నిర్వహిస్తున్నారంటే ఏ స్థాయిలో చక్రం తిప్పుతున్నాడోనని మాట్లాడుకుంటున్నారు,
బొత్స సత్యనారాయణ వ్యవహారాన్ని చూసి పార్టీ ప్రారంభం నుంచీ ఉన్న సీనియర్లు కూడా ముక్కున వేలేసుకుంటున్నారట, బొత్స దాదాపు జగన్ తర్వాత తానే అన్నట్లు వ్యవహరిస్తున్నాడని, అందుకే పలువురు సీనియర్లు పార్టీ ఆఫీసుకి కూడా రావడం మానేశారని వైసీపీ నేతలు చెవులు కొరుక్కుంటున్నారు. ఏకులా వచ్చి మేకులా తయారయ్యాడని చెప్పుకుంటున్నారు, మరి బొత్స హయా వైసీపీలో నడుస్తుందో చూడాలి.