నెహ్రూ గురించి వివాదం మొదలు

 

దేశంలో ఒకదాని తరువాత ఒక వివాదం చెలరేగుతూనే ఉన్నాయి. ఫలానా గొడవ సద్దుమణిగిందనుకునే లోపలే టీవీ ఛానళ్లు వేడివేడి వివాదాలను వండి వారుస్తున్నాయి. తాజాగా నెహ్రూ గురించి ఒక జిల్లా కలెక్టరు చేసిన వ్యాఖ్యలు సరికొత్త గొడవను సృష్టిస్తున్నాయి. మధ్యప్రదేశ్‌కు చెందిన అజయ్ గంగ్వార్‌ ఈ వివాదానికి మూలకర్త. నెహ్రూ వీరాభిమాని అయిన అజయ్‌, నెహ్రూ కనుక అడ్డుకోకపోతే... మన దేశం హిందూ తాలిబాన్‌ రాజ్యంగా మారిపోయేదని అభిప్రాయపడ్డారు. నెహ్రూ, బాబా రాందేవ్‌లాంటి వారిని కాకుండా హోమీ బాబాలాంటి శాస్త్రవేత్తలను ప్రోత్సహించారంటూ మెచ్చుకున్నారు. గోశాలలు, ఆలయాలు కట్టే బదులు... ఐఐటీలు, పవర్ల ప్లాంటులూ స్థాపించారని గుర్తుచేశారు. గంగ్వార్‌ తన ఫేస్‌బుక్‌లో చేసిన ఈ వ్యాఖ్యలు సహజంగానే విస్తృత ప్రచారాన్ని పొందాయి. మధ్యప్రదేశ్‌లో అధికారంలో ఉన్న బీజేపీకి ఆగ్రహాన్ని కలిగించాయి. దాంతో ఆయనను కలెక్టరు స్థానం నుంచి బదిలీ చేసి సచివాలయానికి తరలించారు. కానీ గంగ్వార్‌ మాత్రం తాను చేసిన వ్యాఖ్యలకు కట్టుబడి ఉన్నానంటూ చెప్పుకొచ్చారు. నెహ్రూ గురించి ఈ తరానికి తెలియచేయాల్సిన అగత్యం ఉందనీ.. ఇది సిద్ధాంతపరమైన చర్చ అనీ తన మాటలను తానే వెనకేసుకు వచ్చారు. నెహ్రూ గురించి గంగ్వార్‌ వ్యాఖ్యలు, వాటి మీద ఆ రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవడం ఇప్పుడు మధ్యప్రదేశ్‌లో సంచలనంగా మారింది. ఇన్నాళ్లూ నెహ్రూని అంతగా పట్టించుకోని కాంగ్రెస్‌ కూడా వివాదంలో తనదైన గొంతుని వినిపించేందుకు సిద్ధపడుతోంది. మరి ఈ వివాదం ఏ తీరులో మారుతుందో, ఏ తీరానికి చేరుతుందో చూడాల్సిందే!

Online Jyotish
Tone Academy
KidsOne Telugu