ప్రతి స్త్రీకి గర్భధారణ అనేది ఒక కీలకమైన సమయం. ప్రసవం అనేదిస్త్రీ కి మరో జన్మ లాంటిదని చెబుతారు. కానీ గర్బం మోయడం ఒక ఎత్తైతే.. ప్రసవం మరొక ఎత్తు. అందువల్ల ప్రసవం కోసం సరైన ఆసుపత్రిని ఎంచుకోవడం చాలా ముఖ్యం. ప్రసవానికి ఏ ఆసుపత్రి మేలు అనే విషయం తెలుసుకోవడానికి చాలామంది  కేవలం ఆసుపత్రి ఉన్న ప్రదేశాన్ని లేదా పేరును మాత్రమే చూస్తారు. గైనకాలజిస్టుల ప్రకారం, ప్రసవ సమయంలో ఎలాంటి సమస్యలు తలెత్తకుండా , తల్లి, బిడ్డ ఇద్దరికీ సరైన సంరక్షణ అందేలా చూసుకోవడానికి, ప్రతి ఒక్కరూ ఆసుపత్రిని ఎంచుకునే  ముందు ఏడు విషయాలు తప్పక తెలుసుకోవాలట. అవేంటో తెలుసుకుంటే..

మొట్టమొదటి   చాలా ముఖ్యమైన  విషయం..

ఆసుపత్రిలో 24 గంటలూ గైనకాలజిస్ట్ అందుబాటులో ఉన్నారా లేదా అని తెలుసుకోవాలి. ప్రసవం అనేది ఏ సమయానికి జరుగుతుందో చెప్పలేం..  డెలివరీ పెయిన్స్ అనేవి ఏ సమయంలోనైనా ప్రారంభం కావచ్చు. అందువల్ల డాక్టర్ కేవలం కొన్ని గంటలు మాత్రమే అందుబాటులో ఉంటే, ఎమర్జెన్సీ పరిస్థితుల్లో సమస్యలకు దారితీయవచ్చు. కాబట్టి, రాత్రిపూట లేదా సెలవు దినాల్లో కూడా ఆసుపత్రిలో అనుభవజ్ఞులైన గైనకాలజిస్ట్ అందుబాటులో ఉంటారా లేదా అని తప్పకుండా తెలుసుకోవాలి.

ధరల తేడా..

సాధారణ ప్రసవానికి,  సి-సెక్షన్ ప్రసవాలకు ధరలు ఎలా ఉంటాయి?  ఎంత సమయం పడుతుంది అనేది తప్పకుండా తెలుసుకోవాలి. ఈ రెండింటికి  వాటి ప్రత్యేకమైన విధానాలు , వేర్వేరు సమయాలు ఉంటాయి. ప్రతి  ప్రసవానికి ఎంత సమయం పడుతుందో ఆసుపత్రి నుండి ముందుగానే తెలుసుకోవడం ముఖ్యం, దీనివల్ల  కుటుంబ సభ్యులు పూర్తి సమాచారంతో మానసికంగా సిద్ధంగా ఉండగలగడం జరుగుతుంది.

మూడవ విషయం..

ఆర్థిక విషయాలకు సంబంధించింది ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలి. ప్రతి ఆసుపత్రి వేర్వేరు డెలివరీ ప్యాకేజీలను అందిస్తుంది, కానీ ఆ ప్యాకేజీలలో ఖచ్చితంగా ఏమేమి చేర్చబడ్డాయో అర్థం చేసుకోవడం చాలా ముఖ్యం. వీటిలో గది ఛార్జీలు, డాక్టర్ విజిటింగ్స్, ఎమర్జెన్సీ  ఛార్జీలు, అవసరమైన టెస్ట్ లు , మందుల ఛార్జీలు.. ఇలా అన్నీ ఉన్నాయో లేదో   ముందుగానే చూసుకోవాలి. ఇది తరువాత హాస్పిటల్లో

 శిశువు భద్రత..

ఆసుపత్రిలో నియోనాటల్ ఇంటెన్సివ్ కేర్ యూనిట్ లేదా NCU (నర్సరీ కేర్ యూనిట్) ఉందో లేదో నిర్ధరించుకోవడం చాలా ముఖ్యం. కొన్నిసార్లు, శిశువులు నెలలు నిండకుండానే పుడతారు లేదా పుట్టిన తర్వాత వారికి స్పెషల్ కేర్  అవసరం అవుతుంది. ఆసుపత్రిలో ఈ సౌకర్యాలు ఇప్పటికే ఉంటే, శిశువుకు ఎమర్జెన్సీగా స్పెషల్ కేర్ అందించవచ్చు.

పిల్లల డాక్టర్..

ఆసుపత్రిలో పిల్లల డాక్టర్  అన్ని వేళలా అందుబాటులో ఉంటారా లేదా అని తెలుసుకోవాలి. ఎందుకంటే, పుట్టిన వెంటనే శిశువును పరీక్షించడానికి , సంరక్షించడానికి పిల్లల డాక్టర్ ఉండటం  చాలా కీలకం. ఏ కారణం చేతనైనా బిడ్డకు వెంటనే  వైద్య సహాయం అవసరమైతే, వైద్యుడు  అందుబాటులో ఉండటం చాలా ముఖ్యం.

డెలివరీ పార్ట్నర్..

ప్రసవ సమయంలో భర్త లేదా కుటుంబ సభ్యుడు మహిళతో ఉండటానికి ఆసుపత్రి అనుమతిస్తుందా లేదా అని కనుక్కోవాలిి. వీరిని ప్రసవ భాగస్వామి అని పిలుస్తారు. చాలా మంది మహిళలకు, ప్రసవమనే ఈ కష్ట సమయంలో సన్నిహితంగా ఒకరు తోడు ఉండటం ఎంతో సహాయపడుతుంది, ఎందుకంటే ఈ సమయంలో వారికి శారీరక , మానసిక మద్దతు రెండూ అవసరం. అందువల్ల, ప్రసవానికి ముందే ఆసుపత్రి విధానం గురించి విచారించడం ముఖ్యం.

మహిళల మూవ్మెంట్..

ప్రసవ సమయంలో మహిళ కదలడానికి లేదా పొజిషన్ మార్చుకోవడానికి అనుమతి ఉందా లేదా అనేది కనుక్కోవాలి. చాలా ఆసుపత్రులు మహిళను మంచానికే పరిమితం చేస్తాయి, అయితే మరికొన్ని హాస్పిటల్స్ అయితే లైట్ గా  కదలడానికి  అనుమతిస్తాయి, ఇది నొప్పిని తగ్గించి, ప్రసవాన్ని సులభతరం చేయడానికి సహాయపడుతుంది.

కాబట్టి మహిళలు ప్రసవం కోసం హాస్పిటల్స్ ను ఎంచుకునే ముందు పైన పేర్కొన్న విషయాలను విచారించిన తర్వాతే ఎంచుకోవడం మంచిది.

 

                                         *రూపశ్రీ.