పిరుదుల భాగంలో కొవ్వు పేరుకుపోవడం చాలా మంది ఎదుర్కొనే సాధారణ సమస్య. ముఖ్యంగా మహిళల్లో ఈ సమస్య ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది.  రోజూ గంటల తరబడి ఒకే చోట కూర్చుని పనిచేయడం, సరైన శారీరక శ్రమ లేకపోవడం, పోషకాహార లోపం వల్ల ఈ భాగంలో కొవ్వు సులభంగా పెరుగుతుంది. దీనివల్ల శరీర ఆకృతి దెబ్బతినడమే కాకుండా కొన్ని రకాల ఆరోగ్య సమస్యలు కూడా వచ్చే అవకాశం ఉంటుంది. క్రమం తప్పకుండా కొన్ని ప్రత్యేకమైన వ్యాయామాలు చేయడం ద్వారా ఈ కొవ్వును కరిగించి, పిరుదులను దృఢంగా, మంచి ఆకృతిలోకి తీసుకురావచ్చు. ఆ వ్యాయామాలు ఏమిటో.. వాటిని ఎలా చేయాలో తెలుసుకుంటే..

స్క్వాట్స్

పిరుదుల కొవ్వును తగ్గించడానికి , అక్కడి కండరాలను దృఢపరచడానికి స్క్వాట్స్ అత్యంత ప్రభావవంతమైన వ్యాయామం. ఈ వ్యాయామం చేయడానికి ముందుగా నిటారుగా నిలబడాలి. కాళ్ళను భుజాల వెడల్పులో ఉంచాలి. ఆ తర్వాత కుర్చీలో కూర్చుంటున్నట్లుగా నెమ్మదిగా కిందకు వంగాలి. ఈ సమయంలో మోకాళ్ళు కాళ్ళ వేళ్ళ కంటే ముందుకు వెళ్ళకూడదు. కొన్ని సెకన్ల పాటు ఈ స్థితిలో ఉండి, ఆ తర్వాత పాత స్థితికి రావాలి. దీనిని రోజూ 15 నుండి 20 సార్లు మూడు సెట్లుగా చేయడం వల్ల మంచి ఫలితం ఉంటుంది.

లంజెస్

ఈ వ్యాయామం పిరుదుల భాగంలోని కండరాలపై నేరుగా ప్రభావం చూపుతుంది. మొదట నిటారుగా నిలబడి, ఒక కాలును ముందుకు వేయాలి. ముందుకి వేసిన కాలు మోకాలు వద్ద తొంబై డిగ్రీల కోణంలో వంగేలా శరీరాన్ని కిందకు దించాలి. వెనుక ఉన్న కాలు నేలకు కాస్త ఎత్తులో ఉండాలి. ఆ తర్వాత నెమ్మదిగా సాధారణ స్థితికి వచ్చి, మరొక కాలుతో కూడా ఇదే విధంగా చేయాలి. ఇది పిరుదుల కొవ్వును కరిగించడమే కాకుండా కాళ్ళకు కూడా మంచి బలాన్ని ఇస్తుంది.

గ్లూట్ బ్రిడ్జ్..

నేలపై పడుకుని చేసే ఈ వ్యాయామం పిరుదుల కొవ్వును తగ్గించడంలో బాగా పనిచేస్తుంది. మొదట వెల్లకిలా పడుకుని మోకాళ్ళను మడవాలి. పాదాలను నేలకు ఆనించి ఉంచాలి. చేతులను శరీరానికి ఇరువైపులా ఉంచాలి. ఇప్పుడు పిరుదులు, నడుము భాగాలను పైకి లేపాలి. శరీరం మోకాళ్ళ నుండి భుజాల వరకు ఒకే వరుసలో ఉండేలా చూసుకోవాలి. కొన్ని సెకన్ల పాటు ఈ స్థితిలో ఉండి, ఆ తర్వాత నెమ్మదిగా కిందకు రావాలి. దీనివల్ల పిరుదుల వద్ద ఉండే కండరాలు బలంగా మారతాయి.

డాంకీ కిక్స్..

డాంకీ కిక్స్ చేయడానికి మొదట చేతులు, మోకాళ్ళను నేలపై ఆనించి నాలుగు కాళ్ళ జంతువులాగా నిలబడాలి. ఇప్పుడు ఒక కాలును మోకాలు వద్ద మడిచి ఉంచి, వెనుక వైపు పైకి లేపాలి. కాలు పిరుదుల కంటే కాస్త పైకి వెళ్ళేలా చూసుకోవాలి. కొన్ని సెకన్లు అలానే ఉంచి, తర్వాత కాలును కిందకు తీసుకురావాలి. ఇలా రెండు కాళ్ళతో మార్చి మార్చి చేయాలి. ఇది పిరుదుల రూపాన్ని మెరుగుపరచడానికి ఎంతగానో దోహదపడుతుంది.

స్టెప్ అప్స్..

ఇంటి వద్ద ఉండే మెట్లు లేదా ఒక చిన్న స్టూల్ సహాయంతో ఈ వ్యాయామం చేయవచ్చు. ముందుగా స్టూల్ ముందుకు నిలబడాలి. ఒక కాలును స్టూల్ పై ఉంచి, దానిపై బరువు వేస్తూ శరీరాన్ని పైకి లేపాలి. ఆ తర్వాత రెండవ కాలును కూడా పైకి తీసుకురావాలి. మళ్ళీ నెమ్మదిగాకిందకు దిగాలి. ఇలా క్రమం తప్పకుండా చేయడం వల్ల తొడలు , పిరుదుల భాగంలో ఉన్న కొవ్వు త్వరగా కరుగుతుంది.

పైన పేర్కొన్న  వ్యాయామాలతో పాటు ప్రతిరోజూ తగినంత నీరు తాగడం, నూనె పదార్థాలు తగ్గించడం , సమతులాహారం తీసుకోవడం వల్ల వేగంగా ఫలితాలను పొందవచ్చు. అంతే కాదు.. పిరుదుల భాగంలో కొవ్వు తగ్గాలి అంటే.. ముఖ్యంగా ఎక్కువసేపు కూర్చోవడాన్ని వీలైనంత తగ్గించాలి. ఒకవేళ కూర్చుని పని చేయాల్సిన అవసరం ఉన్నా.. అరగంట ఒకసారి అయినా లేచి అటు ఇటు తిరుగుతూ ఉండాలి. ఇలా చేస్తే పిరుదుల కొవ్వు క్రమంగా తగ్గుతుంది.

 

                          *రూపశ్రీ.