ఈ లక్షణాలు కనిపిస్తే మీరు తప్పకుండా పాప్ స్మియర్ పరీక్ష చేయించుకోవాల్సిందే..!

మహిళల ఆరోగ్యం విషయంలో ఎన్నో రకాల జాగ్రత్తలు తీసుకోవడం ఎంతైనా అవసరం. ముఖ్యంగా శరీరంలో జరిగే చిన్న చిన్న మార్పులను, అనారోగ్య లక్షణాలను ఎప్పటికప్పుడు గమనించడం ద్వారా పెద్ద ప్రమాదాల బారిన పడకుండా ముందుగానే అప్రమత్తం కావచ్చు. నేటి ఆధునిక బిజీ జీవితంలో చాలామంది మహిళలు తమ ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేస్తుంటారు. కానీ మహిళల్లో వచ్చే గర్భాశయ ముఖద్వార సమస్యలను, క్యాన్సర్ వంటి తీవ్రమైన ముప్పులను ముందస్తుగా గుర్తించడంలో పాప్ స్మియర్ పరీక్ష చాలా ముఖ్యమైనది. అసలు ఈ పరీక్ష ఎందుకు అవసరం, ఏయే లక్షణాలు కనిపిస్తే  ఆలస్యం చేయకూడదనే విషయాలను వివరంగా తెలుసుకుంటే..

30ఏళ్లు నిండిన మహిళలు..

సాధారణంగా ముప్పై సంవత్సరాలు నిండిన ప్రతి మహిళా క్రమం తప్పకుండా ప్రతి మూడు సంవత్సరాలకు ఒకసారి పాప్ స్మియర్ పరీక్ష చేయించుకోవడం చాలా మంచిది. అయితే ఒకవేళ శరీరంలో కొన్ని ప్రత్యేకమైన అనారోగ్య లక్షణాలు కనిపిస్తే ముప్పై ఏళ్ల వయసుతో సంబంధం లేకుండా అంతకంటే ముందే ఈ పరీక్షను చేయించుకోవాల్సి ఉంటుంది.

మహిళల్లో తెల్లబట్ట సమస్యతో పాటు రక్తం కారడం లేదా భిన్నమైన రంగులో స్రావాలు వెలువడడం వంటివి కనిపిస్తే దానిని తేలికగా తీసుకోకూడదు. అలాగే దుర్వాసనతో కూడిన డిశ్చార్జ్ సమస్య ఉంటే అది ఏదైనా ఇన్ఫెక్షన్ లేదా అంతర్గత సమస్యకు సంకేతం కావచ్చు.

శారీరక కలియిక తర్వాత కొద్దిగా రక్తం చుక్కలు పడడం లేదా కడుపులో నొప్పి రావడం వంటి లక్షణాలు కనిపిస్తే వెంటనే వైద్యులను సంప్రదించి తగిన పరీక్షలు చేయించుకోవడం చాలా అవసరం. ఇలాంటి లక్షణాలు గర్భాశయానికి సంబంధించిన సమస్యలను సూచించే అవకాశం ఉంది.

చాలా మందిలో ఎప్పుడూ కడుపులో దిగువ భాగంలో లేదా పెల్విక్ ప్రాంతంలో దీర్ఘకాలికంగా నొప్పి వేధిస్తూ ఉంటుంది. ఈ రకమైన కడుపు నొప్పిని ఎట్టి పరిస్థితుల్లోనూ విస్మరించకూడదు.

మెనోపాజ్ దశ దాటిన తర్వాత ఒకవేళ మళ్ళీ రక్తస్రావం జరిగితే దానిని చాలా సీరియస్‌గా తీసుకోవాలి. ఇది ప్రమాదకరమైన ఆరోగ్య సమస్యలకు దారితీసే అవకాశం ఉన్నందున వెంటనే గైనకాలజిస్ట్ వద్దకు వెళ్లి పాప్ స్మియర్ పరీక్ష చేయించుకోవడం చాలా ముఖ్యం.

మహిళలు తమ ఆరోగ్యాన్ని ఎప్పుడూ ప్రాధాన్యతగా భావించాలి. ఎలాంటి చిన్న లక్షణం కనిపించినా భయపడకుండా సరైన సమయంలో వైద్య పరీక్షలు చేయించుకోవడం ద్వారా ఏ సమస్యలనైనా మొదటి  దశలోనే పూర్తిగా నయం చేసుకునే అవకాశం ఉంటుంది. ఆరోగ్యమే మహాభాగ్యం అనే సూత్రాన్ని పాటిస్తూ, మన శరీరం ఇచ్చే  సంకేతాలను అర్థం చేసుకుని సకాలంలో తగిన జాగ్రత్తలు తీసుకోవడం ఎంతో మంచిది.

                                   *రూపశ్రీ.