ఆరోగ్యమే మహా భాగ్యం అన్నారు పెద్దలు. అయితే శరీరంలో అన్ని అవయవాలు సక్రమంగా పనిచేస్తేనే  ఆరోగ్యం బాగుంటుంది. ముఖ్యంగా శరీరానికి శక్తిని ఇచ్చే ఆహారం ప్రేగులలోనే జీర్ణం అవుతుంది. కానీ నేటికాలంలో చాలామంది పేగు ఆరోగ్యం దెబ్బతినడం వల్ల చాలా రకాల ఆరోగ్య సమస్యలు ఎదురవుతున్నాయి.  ముఖ్యంగా నేటికాలంలో ఫాస్ట్ ఫుడ్,  శీతల పానీయాలు తాగడం వల్ల పేగు ఆరోగ్యం దెబ్బతింటుంది. శరీరంలో కొన్ని లక్షణాలను బట్టి   ప్రేగు ఆరోగ్యం బాగుందా లేదా అనే విషయాన్ని తెలుసుకోవచ్చు.  ఆ లక్షణాలు ఏంటో తెలుసుకుంటే..

శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచుకోవాలి అంటే ప్రేగు ఆరోగ్యం ఎంతో ముఖ్యం.  ఎందుకంటే ఆరోగ్యకరమైన బ్యాక్టీరియా పేగులలోనే తయారవుతుంది. పేగు ఆరోగ్యం దెబ్బతింటే ఆరోగ్యకరమైన బ్యాక్టీరియా తయారవదు. దీని వల్ల అనారోగ్య సమస్యలు వస్తాయి.

ప్రేగు ఆరోగ్యం దెబ్బతింటే జీర్ణక్రియ నుండి రోగ నిరోధక శక్తి దెబ్బతినడం వరకు చాలా రకాల సమస్యలు వస్తాయి.

తరచుగా ఉబ్బరం, కడుపులో గ్యాస్ ఏర్పడటం వంటి సమస్యలు వస్తుంటే ప్రేగు ఆరోగ్యం దెబ్బతినిందని,  ప్రేగు సమస్యలు ఉన్నాయని అర్థం.

గట్ మైక్రోబయోమ్ అసమతుల్యత ఏర్పడినప్పుడు ఆహారం సరిగా జీర్ణం కాదు.  దీని వల్ల కడుపులో గ్యాస్ ఏర్పడటం, కడుపు ఉబ్బరంగా మారడం, పొట్ట బరువుగా ఉండటం జరుగుతుంది.

తరచుగా మలబద్దకం లేదా విరేచనాలు వంటి సమస్యలు వస్తున్నా కూడా ప్రేగు ఆరోగ్యం దెబ్బతిన్నదని అర్థం.

ప్రేగు ఆరోగ్యం సరిగా లేకపోవడం వల్ల పోషకాలు సరిగా గ్రహించబడవు. ఇది తరచుగా అలసటకు దారితీస్తుంది.  ఎంత మంచి ఆహారం తీసుకున్నా శరీరం శక్తివంతంగా ఉండదు.

శరీరంలో దాదాపు 70శాతం రోగనిరోధక వ్యవస్థ పేగు ఆరోగ్యం మీద ఆధారపడి ఉంటుంది.  కాబట్టి ప్రేగు సమస్యలు వస్తే రోగనిరోధక శక్తి కూడా బలహీనంగా ఉండటం,  చిన్న చిన్న ఇన్ఫెక్షన్లను కూడా శరీరం భరించలేకపోవడం వంటి సమస్యలు ఏర్పడతాయి.

గట్ మైక్రోబయోమ్ అసమతుల్యత కావడం వల్ల జీవక్రియ కూడా ప్రభావితం అవుతుంది.  ఇది బరువు పెరగడానికి అయినా కారణం కావచ్చు, లేదంటే బరువు తగ్గడానికి అయినా కారణం కావచ్చు.


                                *రూపశ్రీ.

గమనిక:
ఇది సోషల్ సమాచారం మాత్రమే. కొన్ని అధ్యయనాలు, సంబంధిత నిపుణుల ప్రకారం ఈ వివరాలు అందించాం. వ్యక్తుల ఆరోగ్యాన్ని బట్టి ఫలితాలుంటాయి. వీటిని పాటించేముందు.. సంబంధిత నిపుణుడిని సంప్రదించడం శ్రేయస్కరం. అలాగే, హెల్తీ లైఫ్ స్టైల్, సరైన ఆహారం కూడా తీసుకోవడం మీ ఆరోగ్యానికి ఎంతో మేలు...