వంటింట్లో సుగంధ ద్రవ్యాలు చాలా ఉంటాయి.  ఇవి అటు వంటలను ఘుమఘుమలాడించడమే కాకుండా.. ఇటు ఆరోగ్యానికి చాలా మేలు చేస్తాయి.  చాలామంది రక్తంలో చక్కెర నియంత్రణకు,  ఇన్సులిన్ నిరోధకతకు పిసిఏస్ లేదా జీవక్రియ ఆరోగ్యాన్ని మెరుగుపరచడం కోసం దాల్చిన చెక్కను ఉపయోగిస్తారు. అయితే దాల్చిన చెక్క కొనేముందు చాలా జాగ్రత్తగా ఉండాలని చెబుతున్నారు ఆరోగ్య నిపుణులు. తప్పుగా ఉన్న దాల్చిన చెక్కను కొనుగోలు చేయడం,  దాన్ని వినియోగించడం వల్ల ప్రయోజనం చేకూరడానికి బదులు,  హాని జరిగే  అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అసలు క్వాలిటీ ఉన్న దాల్చిన చెక్కను ఎలా గుర్తించాలి? దాల్చిన చెక్కలో రకాలేంటి? వీటి గురించి వివరాలు తెలుసుకుంటే..

సిలోన్ సిన్నమోన్..

సిలోన్ సిన్నమోన్ ను  నిజమైన దాల్చిన చెక్క అని కూడా పిలుస్తారు. ఇది  ప్రధానంగా శ్రీలంక నుండి వస్తుంది. ఇది సహజంగానే చాలా తక్కువ మొత్తంలో 'కూమరిన్' కలిగి ఉంటుంది. ఇది దీర్ఘకాలిక రోజువారీ ఉపయోగం కోసం సురక్షితమైనదని చెబుతారు.

సిలోన్ దాల్చిన చెక్క సారం పై చేసిన అధ్యయనాలు ఇది ఆహారం తీసుకోవడానికి ముందు   రక్తంలో చక్కెర స్థాయిలను,  ఇన్సులిన్ సున్నితత్వాన్ని మెరుగుపరచడంలో సహాయపడుతుందని చూపించాయి .


కాసియా సిన్నమోన్..

ఇది మార్కెట్లో లభించే అత్యంత సాధారణ దాల్చిన చెక్క. ఇందులో చాలా ఎక్కువ స్థాయిలో కూమరిన్ ఉంటుంది. దీన్ని అప్పుడప్పుడు మీ ఆహారంలో రుచి కోసం చేర్చుకుంటే పర్వాలేదు. కానీ  ఆరోగ్య ప్రయోజనాల కోసం ప్రతి రోజు పెద్ద పరిమాణంలో తీసుకుంటే అది కాలేయంపై అదనపు ఒత్తిడిని కలిగిస్తుందని చెబుతున్నారు.

ఇది గుర్తుంచుకోవాలి..

 దాల్చిన చెక్కను దాని రుచి,  సువాసన కోసం మాత్రమే ఉపయోగిస్తుంటే ఏ రకమైన దాల్చిన చెక్కనైనా వాడవచ్చు, కానీ దాల్చిన చెక్కను రోజువారీ ఆరోగ్య దినచర్యలో భాగం చేసుకుంటూ ఉంటే సిలోన్ దాల్చిన చెక్కను ఎంచుకోవడం మంచిది.

సిలోన్ దాల్చిన చెక్క ఎలా గుర్తించాలి..

దుకాణంలో నిజమైన దాల్చిన చెక్కను గుర్తించడానికి, ఈ విషయాలను గుర్తుంచుకోవాలి.

సిలోన్ దాల్చిన చెక్క..

దీని బెరడు మడతపెట్టిన కాగితంలాగా సన్నగా, మృదువుగా,  బహుళ పొరలుగా ఉంటుంది. సింపుల్ గా చెప్పాలంటే చుట్టలాగా ఉంటుంది.  లోపల పొరలుగా కనిపిస్తూ ఉంటుంది.

కాసియా దాల్చిన చెక్క..

కాసియా దాల్చిన చెక్క మందంగా, గట్టిగా,  కలపతో లాగా ఉంటుంది. దీనికి ఒకే పొర ఉంటుంది.

పొడి కొనుగోలు చేస్తే..

దాల్చిన చెక్కను కొనుగోలు చేస్తే.. సిలోన్ దాల్చిన చెక్కను,  కాసియా దాల్చిన చెక్కను వాటి ఆకృతిని చూసి గుర్తించవచ్చు. కానీ పొడి కొనుగోలు చేసేవారు చాలా జాగ్రత్తగా ఉండాలి. ప్యాకేజీపై ఉన్న లేబుల్‌ను తప్పకుండా చదవండి. దానిపై 'సిలోన్ దాల్చిన చెక్క' లేదా 'సిన్నమోమమ్ వెరం' అని రాసి ఉండాలి. అలాంటి దాల్చిన చెక్క పొడినే కొనుగోలు చేయాలి.

                                          *రూపశ్రీ.