ప్రతి రోజూ మనం ఎన్నో రకాల ఆరోగ్య సమస్యల గురించి వింటూనే ఉంటాం. అయితే వాటిలో అత్యంత భయపెట్టే , ప్రాణాంతకమైన సమస్యల్లో బ్రెయిన్ స్ట్రోక్ ఒకటి. పేరు వినగానే చాలా మందికి బ్రెయిన్ స్ట్రోక్ వస్తే ఇక మరణమేనా అనే అభద్రతా భావం కలుగుతుంటుంది. కానీ సరైన అవగాహన ఉండి, సకాలంలో స్పందిస్తే ప్రాణాలను కాపాడుకోవడం సాధ్యమవుతుంది. అసలు బ్రెయిన్ స్ట్రోక్ బారిన పడకుండా ఉండేందుకు, ఒకవేళ అది వస్తే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో తెలుసుకోవడం ప్రతి ఒక్కరికీ ఎంతో అవసరం. దీని గురించి వివరాలు తెలుసుకుంటే..

బ్రెయిన్ స్ట్రోక్.. ప్రతి నిమిషం ఎంతో విలువైనది..

మనుషులను తీవ్రమైన అనారోగ్యానికి లేదా మరణానికి గురిచేస్తున్న సమస్య బ్రెయిన్ స్ట్రోక్.. ప్రపంచ వ్యాప్తంగా అందరినీ తీవ్ర ఆందోళన కలిగిస్తున్న సమస్య ఇది. గణాంకాలను పరిశీలిస్తే ప్రపంచవ్యాప్తంగా ప్రతి ఏటా దాదాపు 65 లక్షల నుంచి 73 లక్షల మంది స్ట్రోక్ కారణంగా ప్రాణాలు కోల్పోతున్నారు. మన మెదడులోని ఏదైనా భాగానికి అకస్మాత్తుగా రక్త ప్రసరణ నిలిచిపోయినా లేదా తగ్గిపోయినా ఈ ప్రమాదం వస్తుంది. దీనివల్ల మెదడులోని కణాలకు ఆక్సిజన్, పోషకాలు అందక అవి వేగంగా చనిపోవడం ప్రారంభిస్తాయి. సరైన సమయంలో గుర్తించి చికిత్స అందించకపోతే ఈ పరిస్థితి ప్రాణాంతకంగా మారుతుంది. అందుకే స్ట్రోక్ విషయంలో ప్రతి ఒక్క నిమిషం ఎంతో విలువైనది.

లక్షణాలు గుర్తించకపోవడమే సమస్య..

బ్రెయిన్ స్ట్రోక్ అనేది హఠాత్తుగా వచ్చినప్పటికీ, దాని వెనుక ఉండే అసలు ప్రమాదాలు మాత్రం సంవత్సరాల ముందే మన శరీరంలో పుట్టుకొస్తుంటాయి. కానీ చాలా మందికి ఈ ఆరోగ్య సమస్యల గురించి సరైన అవగాహన ఉండదు. స్ట్రోక్ వచ్చిన తర్వాత కూడా లక్షణాలను గుర్తించడంలో ఆలస్యం చేస్తుంటారు. దీనివల్ల వైద్యులు చికిత్స అందించడానికి అవసరమైన ఎంతో విలువైన సమయం వృథా అయిపోతుంది. స్ట్రోక్ బారిన పడిన రోగులపై నిర్వహించిన ఒక అధ్యయనంలో దాదాపు 73 నుంచి 80 శాతం మంది రోగులలో స్ట్రోక్  లక్షణాలు ప్రారంభమైన సుమారు నాలుగున్నర గంటల కంటే ఎక్కువ సమయం గడిచాక ఆసుపత్రికి చేరుకుంటున్నట్లు తేలింది. లక్షణాలపై అవగాహన లేకపోవడమే దీనికి ప్రధాన కారణమని వైద్య నిపుణులు స్పష్టం చేస్తున్నారు. లక్షణాల గురించి అవగాహన ఉంటే చాలా తొందరగా ట్రీట్మెంట్ పొందే వెసులుబాటు ఉంటుంది.

అకస్మాత్తుగా వచ్చేది కాదు..

బ్రెయిన్ స్ట్రోక్ అనేది ఒక్కసారిగా వచ్చే సమస్య కాదు. దీని వెనుక ప్రధానంగా హై బ్లడ్ ప్రెషర్ అనగా అధిక రక్తపోటు, మధుమేహం , కొలెస్ట్రాల్ వంటి దీర్ఘకాలిక సమస్యలు ఉంటాయి. ఈ అనారోగ్యాలు చాలా కాలం పాటు ఎలాంటి స్పష్టమైన లక్షణాలు బయటపడకుండానే శరీరం లోపల పెరుగుతుంటాయి. ఆరోగ్యంగా ఉన్నామని భావించే యువకులు కూడా ఈ సమస్యల పట్ల అప్రమత్తంగా ఉండాలి. ఐసీఎంఆర్ , ఇండియాబీ పరిశోధనల ప్రకారం మన దేశంలో సుమారు 35.5 శాతం మంది వయోజనులు హై బ్లడ్ ప్రెషర్ తో, 87.3 శాతం మంది డిస్లిపిడెమియా అనగా రక్తంలో కొలెస్ట్రాల్ లేదా కొవ్వు స్థాయిలు సాధారణం కంటే ఎక్కువగా ఉండటంతో, అలాగే 11.4 శాతం మంది మధుమేహంతో బాధపడుతున్నారు.

రక్తనాళాలు దెబ్బతినడం వల్లే..

అధిక రక్తపోటు రక్త నాళాలపై తీవ్రమైన ఒత్తిడిని కలిగిస్తుంది. అలాగే డయాబెటిస్ ,  కొలెస్ట్రాల్ స్థాయిలు ఎక్కువగా ఉండటం కూడా రక్త నాళాలను దెబ్బతీస్తాయి. ఇవన్నీ కలిసి బ్రెయిన్ స్ట్రోక్ ముప్పును విపరీతంగా పెంచుతాయి.

 స్ట్రోక్ రావడానికి చాలా సంవత్సరాల ముందే ఏర్పడే ప్రమాదకర పరిస్థితులను చాలామంది నిర్లక్ష్యం చేయడం వల్లే ఈ సమస్య మరింత పెరుగుతుంది. అలాగే  స్ట్రోక్ వచ్చిన తర్వాత కూడా లక్షణాలను గుర్తించలేక వైద్య సహాయం అందడంలో ఆలస్యం చేయడం వల్ల మరణం సంభవిస్తుంది.

ఆరోగ్యంగా ఉన్నామని లైట్ తీసుకోకండి..

చూడటానికి పూర్తిగా ఆరోగ్యంగా కనిపిస్తున్న యువతలో కూడా హై బ్లడ్ ప్రెషర్, డయాబెటిస్, కొలెస్ట్రాల్ సమస్యల కారణంగా స్ట్రోక్ ముప్పు పొంచుకుని ఉంటోంది. ముఖంలో ఒక వైపు వంకర పోవడం, మాట తడబడటం, చేతులు లేదా కాళ్లలో అకస్మాత్తుగా బలహీనత కలగడం లేదా శరీర సమతుల్యత దెబ్బతినడం వంటి లక్షణాలు కనిపిస్తుంటాయి. అయితే చాలా మంది వీటిని కేవలం సాధారణ నీరసం, అలసట లేదా వయసు ప్రభావం అనుకుని లైట్ తీసుకుంటారు. ఈ చిన్న నిర్లక్ష్యమే ప్రాణాల మీదికి తెస్తుంది.

స్ట్రోక్ నుండి బయట పడే మార్గం..

స్ట్రోక్ సమస్య నుండి,  దానికి గల కారణాల  నుంచి బయటపడాలంటే రోజువారీ జీవితంలో కొన్ని మార్పులు చేసుకోవడం చాలా ముఖ్యం.

క్రమం తప్పకుండా ఆరోగ్య పరీక్షలు చేయించుకోవడం, వైద్యుల సలహాలు పాటించడం, రోజువారీ జీవితంలో అకస్మాత్తుగా ఏవైనా ఆరోగ్య సమస్యలు వస్తే.. వాటిని  ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండటం ఎంతో అవసరం.

ముఖంలో తేడాలు రావడం, మాట్లాడటంలో ఇబ్బంది కలగడం వంటి చిన్న మార్పులను కూడా నిర్లక్ష్యం చేయకుండా వెంటనే వైద్యులను సంప్రదించడం ద్వారా ప్రాణాంతక పరిస్థితుల నుంచి సులభంగా బయటపడవచ్చు.

ఆరోగ్యమే మహాభాగ్యమనే సత్యాన్ని గ్రహించి ముందస్తు జాగ్రత్తలు పాటించడమే బ్రెయిన్ స్ట్రోక్ నుండి రక్షణ పొందే ఉత్తమ మార్గం.

                                                                                                                                             *రూపశ్రీ