విటమిన్-డి లోపం ఉంటే పిల్లలు పుట్టడం కష్టమా..ఈ నిజాలు తెలుసుకోండి..!
.webp)
శరీరానికి కావాల్సిన విటమిన్లు , పోషకాల గురించి మాట్లాడుకునేటప్పుడు మనం సాధారణంగా కాల్షియం, ఐరన్ లేదా విటమిన్-సి వంటి వాటి గురించే ఎక్కువగా చర్చిస్తూ ఉంటాము. కానీ మన శరీరంలో విటమిన్-డి పాత్ర ఎంత ముఖ్యమైనదో చాలా మందికి సరిగ్గా తెలియదు. ఎముకలను బలంగా ఉంచడానికి మాత్రమే ఇది ఉపయోగపడుతుందని అందరూ అనుకుంటారు. అయితే నేటి కాలపు వైద్యులు చెబుతున్న దాని ప్రకారం విటమిన్-డి మన శరీరంలోని ఎముకలకు మాత్రమే కాకుండా ప్రత్యుత్పత్తి వ్యవస్థకు కూడా చాలా అవసరం. ఎండలో తిరిగితే లభించే ఈ విటమిన్ లోపిస్తే దంపతులలో పిల్లలు పుట్టే అవకాశాలపై ప్రభావం పడుతుందా లేదా అనే ప్రశ్న ఇప్పుడు చాలా మందిలో కలుగుతోంది. ఈ విషయంలో వైద్య నిపుణులు , పరిశోధనలు ఏం చెబుతున్నాయో వివరంగా తెలుసుకుంటే..
మన దేశంలో ఎండకు ఎటువంటి కొదవ ఉండదు. సంవత్సరంలో ఎక్కువ రోజులు సూర్యరశ్మి పుష్కలంగా లభిస్తుంది. అయినప్పటికీ మనలో చాలా మంది విటమిన్-డి లోపంతో బాధపడుతూ ఉంటారు. అందుకే ఆరోగ్య నిపుణులు దీనిని ఒక రకమైన సైలెంట్ సమస్యగా చెబుతున్నారు. ఎందుకంటే ఇది ఎలాంటి పెద్ద లక్షణాలు లేకుండానే శరీరం లోపల ఉండి ఆరోగ్యాన్ని దెబ్బతీస్తుంటుంది. ఇటీవలి కాలంలో జరిగిన పలు వైద్య అధ్యయనాలు ఈ విటమిన్ లోపానికి పురుషులు , మహిళల్లో సంతానోత్పత్తి సమస్యలకు మధ్య గట్టి సంబంధం ఉందని వెల్లడించాయి.
మహిళలకు..
మహిళల విషయంలో చూస్తే విటమిన్-డి లోపం వారి శరీరంలో హార్మోన్ల సమతుల్యతను దెబ్బతీస్తుంది. మహిళల నెలసరి క్రమంగా రావడానికి , అండాశయాల నుంచి ప్రతి నెల ఆరోగ్యకరమైన అండం విడుదల కావడానికి కొన్ని రకమైన హార్మోన్లు చాలా అవసరం. విటమిన్-డి మన శరీరంలో ఒక హార్మోన్ లాగా పనిచేస్తూ ఈ ప్రక్రియను నియంత్రించడంలో సహకరిస్తుంది. శరీరంలో దీని స్థాయి తగ్గినప్పుడు హార్మోన్ల పనితీరు మందగించి అండాల నాణ్యత , సంఖ్యపై ప్రతికూల ప్రభావం పడుతుంది. అయితే ఇది నేరుగా పూర్తిగా సంతానలేమికి కారణం కాకపోయినా గర్భం దాల్చడాన్ని కష్టతరం చేయడంలో మాత్రం కీలక పాత్ర పోషిస్తుంది.
పురుషులకు..
పురుషుల ఆరోగ్యం విషయానికి వస్తే వారిలో కూడా సంతానోత్పత్తి సామర్థ్యంపై విటమిన్-డి ప్రభావం స్పష్టంగా కనిపిస్తుంది. పురుషులలో వీర్యకణాల సంఖ్య, వాటి నాణ్యత , అవి కదిలే వేగం సక్రమంగా ఉండటంలో ఈ విటమిన్ ముఖ్యమైన బాధ్యత నిర్వహిస్తుంది. పురుషుల శరీరంలో వీర్యకణాలు ఉత్పత్తి అయ్యే చోట ప్రత్యేకమైన విటమిన్-డి రిసెప్టర్లు ఉంటాయి. ఇవి టెస్టోస్టెరాన్ హార్మోన్ ఉత్పత్తిని , వీర్యకణాల తయారీని నియంత్రించడంలో సహాయపడతాయి. శరీరంలో విటమిన్-డి తగినంత లేకపోతే వీర్యకణాల నాణ్యత తగ్గిపోయి తద్వారా సంతానోత్పత్తి సమస్యలు ఎదురయ్యే అవకాశం పెరుగుతుంది.
ఈ సమస్య నుంచి బయటపడాలంటే ఏం చేయాలి?
సాధారణంగా ఒక చిన్న రక్త పరీక్ష ద్వారా మన శరీరంలో విటమిన్-డి ఎంత మోతాదులో ఉందో సులభంగా తెలుసుకోవచ్చు. ఒకవేళ లోపం ఉన్నట్లు తేలితే ఆహారపు అలవాట్లలో , జీవనశైలీలో కొన్ని చిన్నపాటి మార్పులు చేసుకోవడం ద్వారా దీనిని సరిదిద్దుకోవచ్చు. ప్రతిరోజూ ఉదయం పూట కొంత సమయం ఎండలో గడపడం చాలా మంచిది. దీనితో పాటు గుడ్డు సొన, చేపలు, , విటమిన్-డితో కూడిన పౌష్టికాహారాన్ని ఆహారంలో భాగం చేసుకోవాలి. ఒకవేళ లోపం చాలా ఎక్కువగా ఉంటే డాక్టర్ల సలహా మేరకు తగిన సప్లిమెంట్లను వాడుకోవచ్చు. ఏదైనా ఆరోగ్య సమస్య ఉన్నప్పుడు సొంత వైద్యం చేసుకోకుండా నిపుణులైన వైద్యులను సంప్రదించి తగిన సలహా తీసుకోవడమే ఎప్పుడూ మంచిది.
*రూపశ్రీ.




