Previous Page Next Page 
పాకుడురాళ్ళు పేజి 13

మరో మార్గమేమిటంటే - లాబీవర్గాల్లో మంజరిని పరిచయం చేయడం ఈ  లాబీవర్గాలనబడే వాటికి అటు ప్రొడ్యూసర్లదగ్గరా, ఇటు డిస్ట్రిబ్యూటర్ల దగ్గరా కొంత పలుకుబడి ఉంటుంది. వీరికి నటులు నటీమణులు, పత్రికలవారూ కూడా బాగా పరిచయమయి ఉంటారు. ఈ బాపతు జనానికి అట్టే పనిపాటలుండవు. తమక్కావలసిన వారిని గురించి అన్ని వార్తలు సృష్టించి ప్రచారం చేస్తుంటారు. ఈ ప్రచారం వోక్కోసారి తారాస్థాయినందుకోవడం కూడా కద్దు. వీరిసాయం కూడా పొందాలనుకొన్నాడు చలపతి.
"రేపు ఎట్లుండీ మనకు పెద్ద ప్రోగ్రాములున్నాయి. కాస్త జాగ్రత్తగా ఉండాలి" అన్నాడు చలపతి.
ఏమిటన్నట్లు చూసింది మంజరి.
"పత్రికలవాళ్ళను రేపు పిలిచాను. ఇవ్వాళ్ళల్లా ఆ పనితోనే సరిపోయింది. వాళ్ళకోచిన్న పార్టీకూడా ఎరేంజ్ చేసాను" అన్నాడతను.
"అయితే వంటకాలేం  చెయ్యమంటారు? నాకయితే వంట చేతకాదు. చాతనయినట్లు చేస్తాను" అన్నది మంజరి.
చలపతి బోళాగా నవ్వాడు.
"పత్రికల వాళ్ళతో  వ్యవహారం భారీగా ఉండాలసింది. ఉడిపి కాఫీ టేరియాలో ఆర్డరిచ్చేశాను. సాయంత్రం మూడింటికల్లా వాళ్ళవాన్ వొస్తుంది. నాలుగులోగా ఫంక్షన్ ముగిసిపోతుంది" అన్నాడు చలపతి.
మం,మంజరి అయోమయంగా చూసింది.
"నీకింకా అర్ధం కాలేడుగదూ? అని నవ్వాడు చలపతి. "పత్రికలవాళ్ళకు  మనం అంటే  -నువ్వన్నమాట -
టీ పార్టీ ఇస్తున్నావ్. వాళ్ళు నిన్నేవో ప్రశ్నలడుగుతారు. నీకుతోచిన  సమాధానాలు చెబుతావు. అవన్నీ వాళ్ళ పత్రికల్లో వేసుకుంటారు. నీ బొమ్మలు కూడా వేస్తారు.
"అప్పుడేనా?" అన్నది మంజరి.
"అసలు జర్నలిస్టులు సాయం మనకావలసిందిప్పుడే! పది పత్రికలు కూడబలుక్కుని వోమాటమీద నిలబడ్డాయంటే, ఆకాశానపోయ్యే  దేవుడైనా నేలమీదికి దిగిరావలసిందే! నువ్వొకదానివున్నావనీ, సినిమాకు బ్రహ్మాడంగా పనికొస్తావనీ, ఇండస్ట్రీలోని వారికి తెలియాలి. పబ్లిక్కూ తెలియాలి. ఈ పని జర్నలిస్టులు చేసి పెడతారు. కాబట్టే వాళ్ళతో మనం చనువుగా ఉండటం అవసరమని నేననడం" అన్నాడు చలపతి.
"చనువు" అన్నమాటదగ్గర  మంజరి ముఖం చిట్లించూకొంది. ఈ మాట వెనకఉన్న సంఘటనలేవో  ఆవిడకు తెలుసు.
"సర్వేశ్వరా!" అనుకొంది మంజరి సన్నగా నిట్టూరుస్తూ.
ఓ అరగంట అటూ ఇటుగా జర్నలిస్టు లందరూ వచ్చారు. కొందరు కెమేరాలు  కూడా పట్టుకొచ్చారు. ఎందుకైనా మంచిదని, చలపతి ముందుగానే ఓ ఫోటో గ్రాఫర్ ని పిలిపించాడు.
మధ్యాహాల్లో కుర్చీలు వరుసగా వేశారు. అందరూ కూచున్నాక. అర్ధంలేని సంభాషణ ప్రారంభమయింది. కొంతమంది జర్నలిస్టులు, ఏడెనిమిదేళ్ళ  కిందటి సంగతులు ఎత్తుకొని బిగ్గరగా మాట్లాడుతున్నారు.
"కళ్యాణిని మొదటిసారిగా మా పత్రికలో పరిచయం చేశాను. అయిదారు ఆర్టికల్స్ కూడా పబ్లిష్ చేసినట్లు జ్ఞాపకం, ఠకామని నాయుడుగారు బుక్ చేశారు. చిన్న వేషమేననుకోండి  - ముందుగా ఇంత పుటింగ్ దొరికింది. కవితోటి, డైరెక్టర్ తోటి మాట్లాడి ఆవేషానికి మాంచి ప్రామినెన్స్  ఉండేలా చేసాను కళ్యాణి తారాజువ్వలా పైకొచ్చింది" అన్నాడొకాయన.
"రజనీ కుమారికూడా చాలా లక్కీగా పైకొచ్చింది గదుటయ్యా  నాలుగుసార్లు ఆవిడ బొమ్మను ముఖచిత్రంగా వేశాను. ఆరుమాసాలు తిరక్కుండా బుక్కింగ్స్  కాళ్ళముందు కొచ్చిపడ్డాయి. అన్నాడింకో" జర్నలిస్టు.
"దానికి నీకేమాత్రం ముట్టిందో కూడా చెప్పరేం?" అని ఎవరో అన్నారు సన్నగా.
కానీ ఆగోలలో ఎవరూదాన్ని వినిపించుకోలేదు.
"ఏమయ్యా చలపతీ! ఇంకా ఎంతసేపు కూచోవాలి?" అన్నారెవరో.
"వస్తున్నాను వన్ మినిట్" అన్నాడు చలపతి హడావిడిగా అటూ ఇటూ తిరుగుతూ.
సంభాషణ షూటింగ్ లమీదికి మళ్ళింది.
"ప్రసన్నా ఫిలింస్ వారు అంతఃపురం సెట్ వేశారోయ్. మార్వెలెస్సనుకో. ఆ లోకదానికే డెబ్బయివేల పైచిలుకు అయిందట శర్మ బ్రదర్స్ దగ్గరుండి డిజైన్ చేశారు. బ్యూటిఫుల్" అన్నాడొకాయన.
ఈయన జర్నలిస్టు మాత్రమేకాదు. లాబీ వర్గాలలోకూడా ఉంటూ వుంటాడు.
"హీరో రావు ఈ సీనులో అద్బుతంగా యాక్ట్ చేసిపారేశాడు. పిక్చర్ మొత్తానికి అదే హైలైట్. అతని కెరీర్ లో అంత సూపర్బ్ గా యాక్ట్ చేసిన ఇన్సిడెంట్ మరోటి లేదు. కెమెరామెన్ మిత్రా కూడా చాలా సైన్ గా షూట్ చేశాడు" అని కలిపాడు ఆయనే.
"ఇప్పుడు రావుగారికి ఎన్ని పిక్చర్లున్నాయేమిటి?" అన్నాడింకో జర్నలిస్టు.
"లేకేం. తెలుగు పిక్చర్స్ పద్దెనిమిద్దాకా ఉన్నాయి. నటరాజా మూవీస్ వారు టామిల్ పిక్చర్లో బుక్ చేశారు. నిన్ననేయ సిటీ కలెక్షనంతా యిస్తామన్నారు బోంబేవారు. ఆయన ప్రాణాలుతోడేస్తున్నారు  రమ్మని. కానీ ఆంధ్ర కళామతల్లి సేవను వొదులుకోవడం  వారికిష్టం లేదు. అంచేత రానన్నారు. వారికున్న ఆంధ్రాభిమానం ఎవరికయ్యా మనవాళ్ళలో ఉంది?"
ఒకరిద్దరు గుసగుసలాడుకోవడం గమనించాడుగానీ, మన వాడు తన ధోరణిని మానుకోలేదు.
"రోజుకు 20 గంటలు పనిచేసిన వారికి తెమలడంలేదు. కొత్త కంపెనీల వారికి మరో మూడేళ్ళదాకా కాల్ షీట్స్ ఇవ్వలేమనీ చెబుతున్నారు. అయినా ప్రొడ్యూసర్స్ ఆయన్ని వదలడంలేదు. పైగా బోలెడంత ప్రెషర్ తీసుకున్నారు. ఈ మధ్య ఏం జరిగిందో తెలుసా? ఓ ప్రొడ్యూసర్ - రావుగారు స్టూడియో కెళ్ళాక వచ్చాడు. అమాంతం వాళ్ళమ్మ కాళ్ళమీద పడ్డాడు. మీరు ఎలాగైనా చెప్పి రావుగార్ని  మా పిక్చర్లో వేషం వెయ్యమని చెప్పాలంటూ గోలకెత్తాడు. పాపం! ఆ ముసలమ్మకి  గొడవలేమీ తెలియవాయే "సరేలే నాయనా! అలాగే చెబుతా" నంది. రావుగారొచ్చి ఈ సంగత్తెలుసుకుని చాలా విచారించాడండీ! కానీ మాట తిరగలేదు. ఆరోగ్యాన్ని కూడా లెక్క చేయకుండా పనిచేసే ఆర్టిస్టు ఇంకోరున్నారా?"
"చలపతి బావగారూ! సారిడాన్ ఉంటే సప్లయి చేస్తారూ!" అన్నాడింకో జర్నలిస్టు.
ఈయన మూర్తిగారి మనిషి.  
అందరూ గొల్లున నవ్వేశారు.
మరో పది నిమిషాలకల్లా ఉడిపి కాఫీ టేరియావారు, సర్వీస్ చేశారు. ఈలోగా మంజరి కూడా అక్కడికొచ్చి కూచుంది.
ఈ పూట మంజరి జగన్మోహనంగా తయారయింది. ఓ మేకప్ మాన్ ని పిలిపించి చలపతి ఆవిణ్ణలా తయారుచేశాడు. దాదాపు మూడుగంటలగ్గానీ  మంజరి మేకప్  పూర్తికాలేదు.
చలపతి ఎంతనూరిపోసినా మంజరిలో ఏమూలనో చెప్పరాని భయం  తారట్లాడుతూనే ఉంది. పదిమంది మగవాళ్ళ మధ్య తిరగడం వేరు, వాళ్ళు వేసే సవాలక్ష జనమేజయ ప్రశ్నలకు సమాధానం ఇవ్వడం వేరూనూ.
అందరూ సిగరెట్లుకాలుస్తున్నప్పుడు, చలపతి అసలు విషయంలోకొచ్చాడు.
"మంజరి పేరు మీకు కొత్తకావచ్చు కానీ మన ప్రాతంలో ఈ పేరు చాలా పాతపడిపోయింది. ఓ దశాబ్దంపాటు నాటకరంగాన్ని ఉర్రూత లూపింది. అనేకచోట్ల ఈ అమ్మాయికి సన్మానాలు జరిగాయి. ఎందరో ఎన్నో యోగ్యతా పత్రాలిచ్చారు. వెండితెరకు పరిచయం చేద్దామన్న సదభిప్రాయంతో, యీమెను నేనిక్కడకు తీసుకొచ్చాను. అదే - రెండేళ్ళపాటు ఈమెను విడిచి పెట్టడానికి ఆ నాటక సమాజంవాళ్ళు ససేమీ  వీలుకాదన్నారు. వాళ్ళతో దాదాపు యుద్దంచేసి పట్టుకొచ్చాను. మనమందరమూ సాహిత్య, కళారంగాల్లో పనిచేస్తున్నవాళ్ళమే గనుక అందులోని సాధక బాధకాలు మనకు  క్షుణ్ణంగా తెలుసు. మీరు చేతనైనంత సాయం చెయ్యాలని, చెయ్యగలరని ఆశిస్తున్నాను" అని ఓ చిన్న ఉపన్యాసం యిచ్చాడు చలపతి.
ఆసరికే అతనికి చిరు చెమటలు పోశాయి.
పత్రికలవాళ్ళు తలోవిధంగానూ అనుకొన్నారు. కొంతమంది చిలిపివాళ్ళు ఆ మాటల్ని పైకి అనేవారు కూడాను.
"అబ్బాయీ ఈ ఫీల్డులో పైకిరావాలంటే వోబ్లయిజింగ్ నేచర్ ఉండటం ముఖ్యం. అలా వొప్పేసుకొంటూ కొంతకాలం  "కృషి" చెయ్యాలి. అప్పటిగ్గానీ ఛాన్సులురావు. నేను చెయ్యగలిగిందేదో తప్పకుండా చేస్తా" అన్నాడొక కుర్రాడు.
అతని చేతిలో "కొరడా" అనే పత్రిక ఉంది. అతను వచ్చినప్పటి నుంచీ మంజరిని   అదేపనిగా చూస్తున్నాడు. మంజరి అతన్ని నిరుత్సాహపరచడం  యిష్టం లేక రెండుమూడు సార్లు దొంగచూపులు చూసి ఓసారి నవ్వి నవ్వనట్లుగా నవ్వి యదోచితంగా నటించింది. ఆ దెబ్బతో ఆ కుర్రాడు గుమ్మయిపొయ్యాడు.
చెప్పవలసినవన్నీ చలపతే చెప్పడంచేత మంజరి పని తేలికయింది. ఆవిణ్ణి ఎవ్వరూ ఏ ప్రశ్నలూ అడగలేదు. రకరకాల ఫోజుల్లో నిలబెట్టి, ఓ డజను స్నాప్స్  తీసుకొన్నాడొకాయన. చలపతి తీసుకొచ్చిన ఫోటోగ్రాఫర్ చాలా సీన్స్ తీశాడు.
"రెండుమూడు రోజుల్లో కాపీలు తయారవుతాయి. అవన్నీ నేనే స్వయంగా మీకు అందజేస్తాను. మీరు మాత్రం నాయందూ ఆవిడయందూ దయవుంచి తగిన పబ్లిసిటీ ఇప్పించండి. మీరుణం ఉంచుకోను" అన్నాడు చలపతి.
మంజరికి, వీరందర్నీ పరిచయం చేసాడు చలపతి. 'కొరడా' పత్రిక అతను పోతూ పోతూ మంజరికేసి తిరిగి ఓ కన్ను సగందాకా మూసి తెరిచి నవ్వి మరీ వెళ్ళాడు.
మంజరి తనలో తను నవ్వుకొంది.
                                                           6
రెండు మూడు  వారాల తరువాత గానీ, ఈ సమావేశం ఫలితాలు కనిపించలేదు. ఈ పదిహేనురోజులపాటు, చలపతి కాలు గాలిన పిల్లిలాగా పత్రికా కార్యాలయాలు చుట్టూ తిరుగుతూనే వున్నాడు. వారికి మంజరిని గురించి నూరిపోస్తూనే ఉన్నాడు.
"అనవసరంగా మళ్ళీ మీరు వెళ్ళడందేనికండి! బోలెడంత డబ్బుపోసి  మొన్నపార్టీ కూడా ఇస్తిమి. చెప్పవలసిందంతా అప్పుడే చెబితిమి. కాళ్ళకు బలపాలు కట్టుకొని పదే పదే తిరగడం దేనికట?" అన్నది మంజరి. సానుభూతి చూపిస్తున్నందుకు చలపతి లోలోపల చాలా సంతోషించి నటువంటి వాడయినాడు. అవతల ఉత్సాహాన్ని బయట పడనీయకుండా - చిన్న నవ్వుమాత్రం నవ్వాడు.
"మీకు ఇంట్లో కూచుంటే తోచదా?" అని కూడా మంజరి అన్నది.
చలపతి ఈ మాటతో ముగ్దుడయిపోయాడు.
"అది కాదు మంజరి! ఈ పత్రికలవాళ్ళ  వ్యవహారం నీకు తెలియదు వీరిలో చాలామంది ఉత్తములే ననడంలో సందేహం లేదు. వారి మంచి తనాన్ని మనక్కావలసిన విధంగా వాడుకోవాలి. వారితో కలిసి మెలిసి ఉన్నప్పుడే అది సాధ్యం" అన్నాడు చలపతి.
మంజరి కేమీ అర్ధం కాలేదు. అసలు అర్ధం చేసుకోవాలని కూడా ఆవిడ అభిమతం కాదు.
"ఉదయమే వెడతారు, రాత్రి యెప్పటికోగాని రారు, ఒక్క దాన్ని బిక్కు బిక్కు మంటూ కూచోవాలి. నాతో ఉండటం విసుగెత్తి పోయి, మీరిలా పారిపోతున్నారేమోనని నా అనుమానం" అన్నది మంజరి దిగులుగా ముఖం పెట్టి.
ఈ మహాస్త్రం చలపతి మీద దివ్యంగా పనిచేసింది. అతను మంజరి దగ్గరగా వచ్చి, మెత్తగా ఆవిణ్ణి కావలించుకొని, బుగ్గలు వాసన చూసి వదిలేశాడు.
"అది కాదమ్మడూ! నీకు లోకానుభవం లేదు. చెప్పినా నీకర్ధం కాదు. నిన్నో స్టార్ ని చేసిందాకా నాకు నిద్రాహారాలు ఇమడవు. ఈ విషయమయి నన్ను మాటమాటకి అడక్కు. నువ్వూ మనస్సులో ఏమీ ఉంచుకోకు. పది కంపెనీల్లో నీకు బుకింగ్ దొరికాక, నేనిక నిశ్చింతగా ఉండగలుగుతాను. అందాకా - నేనిలా పనిచేయవలసిందే" అన్నాడు చలపతి.
"ఎంత మంచివారండీ మీరు?" అన్నది మంజరి, దాదాపుగా పరవశత్వం  చెందిన ధోరణిలో.
చలపతి ఏమీ అనలేదు. గబగబా గుడ్డలేసుకొని వెళ్ళిపోయాడు.
అతను వెళ్ళాక మంజరి తనలో తనే నవ్వుకుంది.
"ఈ దెబ్బతో చలపతి చిత్తయిపోవాలి. ఇక  తాత్సారం అన్న మాటే ఉండదు అనుకొంది మంజరి.
ఆవిడ మనస్సీ రెండు వారాలపాటు చాలా ఆరాటపదిపోయింది. ఈ వచ్చిన పత్రికల వాళ్ళందరూ తన బొమ్మల నెలా వేస్తారో, ఏమని వేస్తారో చూడాలని ఆవిడనుకున్నది. అనుకొన్నవి అనుకున్నట్లుగా జరిగితే - ఇంత భారీ ఎత్తున పబ్లిసిటీ జరగడం ఇదే మొదటిసారి అనుకొన్నదావిడ.
పత్రికలవాళ్ళతో  'నేస్తం' కలుపుతూనే, అటు లాబీవర్గాలతో కూడా చేతులు కలిపాడు చలపతి. రావుగారి వర్గాలతోనూ, మూర్తిగారి వర్గంతోనూ మంజరి గురించి చెప్పాడు. గ్రూపువారితో చెప్పినట్లు , ఇంకో ముఠావారితో అతను చెప్పలేదు.
"మనరావుగారు, కట్టుగుడ్డలతో మద్రాసు రావడం నాకు తెలుసు. ఆయన్ను చూస్తూనే మహానటుడనుకొన్నాను. ఆంధ్ర చలన చిత్రాకాశంలో, చండభాస్కరునిలాగదా  ప్రకాశిస్తాడనుకొన్నాను, నేననుకొన్నంతా అయింది. గత 20 సంవత్సరాల నుండి ఏకైక కధా నాయకుడిలాగా నిలిచిపోయాడు. వంద సినిమాల్లో జయప్రదంగా నటించాడు. ఆయనగారు - మన సినీ పరిశ్రమను ఉద్దరించడానికి జన్మించిన తరువాత పురుషుడేగానీ, మరొకటికాదు. ఈ రోజున రావు గారికున్న పలుకుబడి అమోఘం. ఆయన మాటను కాదనగల దమ్ములున్నవాడెన్నడూలేడు. మా మంజరి రావుగారి సహాయం కోరుతూ ఉంది. ఆయనగారు ఏ కంపెనీకి ఫోను చేసినా, ఓ చిన్న వేషం దొరుకుతుంది. ఆ వేషంలో రాణించడానికి, మంజరి శాయశక్తులా కృషి చేస్తుంది. నాదీ పూచీ, మీరు చెయ్యవలసిందల్లా - మంజరిని గురించి రావుగారితో నాలుగు మంచి ముక్కలనడం" అన్నాడు చలపతి.
గత నాలుగు రోజులనుండి  చలపతి డబ్బుతో ఖర్చులు వెళ్ళమారుస్తున్న రావుగారి లాబీ మనుషులు, చలపతి విన్నపాన్ని మన్నించడమేకాకుండా చేతనైనంత సాయంకూడా చేస్తామన్నారు.
"సగం పని తీరింది" అనుకొన్నాడు చలపతి.
మూర్తిగారి మనుషులతోనూ, అతను ఇదే పంపిణీమీద మాట్లాడాడు.
"మూర్తిగారంటే మొదట్లో నాకు సదభిప్రాయం లేదు. అప్పటికే రావుగారు మద్రాసులో పాతుకుపోయారు. ఈ పోటీలో ఎలా నెగ్గుకొస్తాడా అనుకొన్నాను. భగవంతుడా ఆయన్ను దయగా చూశాడు. రెండేళ్ళలో రావును తన్నిపారేసి, చుక్కల్లోకి చేరిపోయాడు. మూర్తిగారు కాదన్న తరువాత గానీ, రావుగార్ని, ప్రొడ్యూసర్లు బుక్ చెయ్యడంలేదు....ఎంత మందికి ఎన్ని విదాలుగా మూర్తి సాయం చేసింది నాకు తెలుసు. ఆయనది దయాహృదయం, ఎక్కడ టాలెంట్ ఉన్నా ఇట్టే పసిగడతారు. నేనంటున్న దేమిటంటే మంజరి టాలెంటున్న ఆర్టిస్టు. ఒక్క అవకాశాన్ని మూర్తిగారు  యిప్పించితేచాలు. వారు చెబితే కాదనే కంపెనీలుంటాయని నేననుకోను" అన్నాడు చలపతి.
మూర్తిగారిని పొగడినందుక్కాదుగానీ, రావుగారిని చులకన చేసినందుకు ఈ వర్గంవారు చాలా సంతోషించారు. చేయగలిగినంత చేస్తామన్నారు. వారందరికి, యధాశక్తి కానుకలు సమర్పించుకొని, వారిని సంతోష తరంగిత స్వాంతులను చేశాడు  చలపతి.
తను చెయ్యగలిగిందంతా చేశానని చలపతి తృప్తిపడి ఊరు కోలేదు. నిజానికి తన కార్యక్రమం ఇప్పుడే ప్రారంభమయింది. దీని మంచిచెడ్డలు చూసుకొనిగానీ, తను భవిష్యత్కార్యక్రమాలను నిర్ణయించకూడదు. సినిమా రంగంలో పైకిరావడానికి, శాస్వతమైన మార్గమంటూ ఏదీ లేదు. ఎప్పటికప్పుడు వాతావరణానికి అనుగుణంగా మార్చుకుంటూ ప్లాన్లు వేసుకోవాలి. అలా వేసుకోనివాడు మట్టిగొట్టుకు పోతాడు. తనావిషయంలో గడితేరిన వాణ్ణని  చలపతి నమ్మకం.

                                                         *    *    *    *
పదిన్నర కల్లా భోజనం చేసి, పదకొండింటిదాకా మంచంమీద దొర్లి ఆపాటికి ఏమీ తోచకపోవడం చేత, తాయారును పిలిచి ఓ కవరు తెప్పించింది మంజరి.
హఠాత్తుగా ఆవిడకు, రాజమణి, వసంతా, కోటేశ్వరరావు, రామచంద్రం, మాధవరావు, కలగాపులగంగా, జ్ఞాపకం వచ్చారు. ఆ జ్ఞాపకాలతో ఈ రోజల్లా మంజరి కాలక్షేపం చేయవచ్చు. కానీ రాజమణి ఆరోగ్యం ఎలా ఉందో కనుక్కోవడం ముఖ్యమనుకొంది.
ఎలా ఉత్తరం ప్రారంభించాలో మంజరికి చప్పున తట్టలేదు. నాలుగైదు పంక్తులు రాసి కొట్టిపారేసింది. ఆకరికి ఎలాంటి సంబోధనా లేకుండానే మొదలెట్టింది.
"-నేనిక్కడ క్షేమంగా ఉన్నాను, నువ్వెలా ఉందీ నాకు తెలీదు. వాసంతి ఎలా ఉంది? అన్నట్లు నాకోవిషయం  స్పష్టంగా రాయి రాజమణి! ఆ పిల్ల పేరు వసంతియా వసంతా? నాకిప్పటికీ, ఆ రెండు పేర్లూ తికమకగానే ఉంటాయి. మీరిద్దరూ ఆకూపంలోంచి  ఎప్పుడు బయటపడతారో నాకు తోచకుండా ఉంది. వసంతను - మరీ సలగొట్టకు. నాక్కొంచెంస్థిమితం చిక్కగానే మిమ్మల్ని పిలిపించుకొందామని సంకల్పం. భగవంతుడేం చేస్తాడో తెలీదు.
"నా విషయం ఇంకా అయోమయంగానే వుంది. చలపతి గారు నాకు బొత్తిగా అర్ధంకాకుండా ఉన్నాడు. ఒక్కోసారి ఆయనమాటలు నాకు బోధపడవు. నన్ను నిజంగానే పైకి తేసుకురావాలనుకుంటున్నాడో, లేక దాని వెనుక అతని స్వార్ధమేదన్నా ఉన్నదో నాకు తెలీదు. ఉత్తి పుణ్యానికి నామీద అంత అభిమానం ఆయన గారికెందుక్కలగాలో తెలీదు. ఆ మాటకొస్తే, ఎవరికైనా ఇంకోరి మీద నిష్కారణంగా  ప్రేమాభిమానాలు పుట్టుకొస్తాయా? చలపతి ముంగిరకం గాడని, నాకెందుకో మొదట్నుంచీ అనిపిస్తూనే ఉంది. అతని లోపల ఏముందో నేను తెలుసుకోలేకపోతున్నాను.
"మ్,మొన్నీమధ్య ఏంజరిగిందనుకున్నావ్ రాజమణీ! ఎవడో వెంకటేశ్వర్లట - ఓ కంపెనీలో మేనేజరుగా ఉంటున్నాట్ట. ప్రొడ్యూసరుకు  తోడల్లుడట. చలపతి వాణ్ణి పట్టుకొచ్చాడు. ఆడవాళ్ళను గురించి నా ఎదుటనే సిగ్గులేకుండా మాట్లాడుకొన్నారు. నేను సిగ్గుతో చచ్చిపోయానని కాదు - యీ దశలో నేను సిగ్గుపడతానని కూడా నువ్వనుకోవని నాకు తెలుసు. ఉన్నట్లే వుండి  ఇప్పుడే వస్తానని చలపతి మాయమయ్యాడు. ఆ పట్టు పట్టు రాత్రి పన్నెండు దాటాకగానీ చలపతి రాలేదు. వచ్చాక  చాలా - ఆత్రంగా  "ఏం జరిగిందేమిటి? ఏమన్నాడేమిటి?" అన్నాడు. ఆ క్షణాన చలపతిని చూస్తుంటే చెప్పరాని అసహ్యం వేసింది. వాడు నాకూ ఆ వెంకటేశ్వర్లకూ  లంకె కలపాలని అతగాడి అభిప్రాయమనుకుంటాను పోనీ ఆ విషయం నాతో ముందుగా చెబితే, నేనూ కాదనేదాన్నిగాదు. నేను తన కేమవుతానని, చలపతి ప్రచారం చేసుకొన్నదీ తెలిస్తే - ఆ దోవ వేరు. తన భార్యనని చెప్పుకొంటున్నాడో, మేనకోడల్నంటున్నాడో, మరదలననుకుంటుంన్నాడో - నాకు తెలీదాయే. ఇంటికి వచ్చిన ప్రతి వెధవనూ నాకు  'మనప్రాణమిత్రుడు - ఆప్తుడు - సహృదయుడు' అంటూ పరిచయం చేస్తాడాయే. వాళ్ళందరితోనూ, నేను ఎక ఎకలు పక పకలుగా వుంటే వీడు అసూయపడి చస్తాడేమోనని , అదోభయం. పతివ్రతలాగా నటిస్తే నేమో "ఏమిటా వెధవ బిగింపూ నువ్వూనూ! సోషల్ గా మూవ్ కావాలిగానీ మడి గట్టుక్కూచుంటే లాభం లేదు" అని హితబోధ చేస్తున్నాడు.
   

 

 

 


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS