'మంజూ! స్టేజి మీదే కాదు, నిజ జీవితంలో కూడా నువ్వు చాలా బాగా అభినయించ గలవు సుమా!'
అతడి మనసిపు డెంతో తేలిగ్గా, స్వచ్చంగా బరువు తీరినట్లుంది. మంజుల అలా అన్నందుకు కాని, శాశ్వతంగా విడిపోయి నందుకు కాని, అతడి కేమీ బాధన్పించడం లేదు. అసలు, ఆ విషయం తనకెప్పుడూ సంబంధించనదిగానే అతడికి తోచింది. తనలో తనే కొంచెం ఆశ్చర్యపోయాడు. తన మనసు అంత చంచల మైనదా? కాదు! మంజుల, యీ విధంగా ప్రవర్తించ కుందా తన ప్రేమని, భావాలని , నిజాయితీగా వెల్లడించి ఉంటె, నిన్ను విడిచి పెట్టడం దుర్భరం అని వుంటే, తను చాలా ఎఫెక్ట్ అయి వుండేవాడు. ఆ అమ్మాయి కోసం ఏది చెయ్యడాని కన్నా సిద్దపడి వుండేవాడు. కాని పాపం, మంజుల తన కోసం తన ప్రేమని త్యాగం చేసింది. త్యాగం....!!!' గమ్మత్తుగా అన్పించి, నవ్వు కొని వెనక్కి తిరిగి నడకసాగించాడు. ఈ సంఘటనతో రాజాకి, తను మానసికంగా ఎంతో ఎదిగి పోయినట్లు, తనకు తెలియని కొన్ని జీవిత సత్యాలు అనుభవం లోకి వచ్చి నట్లు అన్పించింది.
చివరి పరీక్ష కూడా సంతృప్తి కరంగానే వ్రాశాడు. రాజా హాలు నుండి బయటికి వచ్చేసి కాలేజ్ గ్రౌండు లో చెట్ల క్రింద నిల్చొని , రామకృష్ణ కోసం ఎదురు చూస్తున్నాడు. 'తనకు క్లాస్ తప్పకుండా వస్తుంది. తర్వాత ఎమ్.ఎ చదవాలి. ఆపైన ఉద్యోగం. ఇంతేగా జీవితం! ఈరోజుతో, తనకు, కాలేజీ కీ బుణం తీరినట్లే. అన్నట్లు రామకృష్ణ కు యివాళ కెమిస్ట్రీ ఎగ్జాం వెధవ! ఎలా రాశాడో! వాడికి, కెమిస్ట్రీ కీ శత్రుత్వం. చదివేరకమైతే గా! పాసవుతాడో లేదో!' రామకృష్ణ పరీక్ష ఎలా రాశాడో, అనే ఆదుర్దాతో , రాజా ఎదురు చూడసాగాడు. దూరం నుండి , రామకృష్ణ వగర్చుకుంటూ రావడం కన్పించింది. 'పరీక్ష బాగా వ్రాసుంటాడు. లేకపోతె నీరసంగా తల వెళ్ళాడేసుకొనుండేవాడు.' రాజా సంతోషంగా రామకృష్ణ కెదురుగా వెళ్తూ 'ఎరా! పరీక్ష బాగా వ్రాశావా? నీ వాలకం అవునని చెప్తోంది లే.' అని కుతూహలంగా చూశాడు. రామకృష్ణ ఆగి, చెమట తుడుచుకుంటూ ఆయాసం తీర్చుకోడానికి, ఒక్క క్షణం ఆగాడు. 'వెధవ పరీక్ష! దాన్నలా తగలడనియ్! తప్పడం గ్యారంటీ అని వ్రాసిస్తాను.' రాజా కళ్ళల్లో కోపం, బాధ తొంగి చూచాయి. 'నువ్వంత తేలిగ్గా ఎలా తీసుకుంటావో నాకర్ధం కాదురా! నీ బాధ్యత నువ్వు గుర్తించక పొతే ఎలా? ఇంట్లో యీ సంగతి తెలిస్తే, ఎంత బాధ పడతారు?'
"అబ్బబ్బ! చాల్లేరా , నీ బోధలూ నువ్వూను. చదువూ! చదువూ ! జీవితంలో యింకేం పరమార్ధం లేదా?" విసుక్కుంటూ అన్నా, మరుక్షణం లోనే రాజా నొచ్చుకుంటాడెమో అన్న అనుమానం కల్గింది రామకృష్ణ కి. అనునయంగా భుజం మీద చేతులు వేస్తూ "ఒరేయ్ రాజా! నీలాంటి మిత్రుడున్నంత కాలం నాకేం బెంగ లేదురా! నువ్వు బాగా చదువుకొని పైకి వస్తే, 'వాడు నా ప్రాణ మిత్రుడు' అని అందరితో చెప్పి గర్వపడతాను' నా సంగతంటావా? బాధపడకు. నాకేమన్నా కష్టం వస్తే , నీ దగ్గరికి వచ్చేస్తాను. సరా! ఒరే! యీ రామకృష్ణ గుండెల్లో రాజా కున్న స్థానం , యింకేవరికీ లేదురా!' భావోద్వేగంతో కంఠం కొంచెం వణికింది. రాజా మనసు ఆర్ద్ర మయింది,. 'నాకు తెలుసురా! అందుకే నువ్వు నా ప్రాణంలో ప్రాణం. ' మనస్సులోనే అనుకున్నాడు. పైకి మాత్రం గట్టిగా నవ్వేశాడు.
"కోయ్రారా! కోయ్! యిప్పటికీ ఎంతమంది విశాలాక్షులు, వనజాక్షు లు ఆ గుండెలో ప్రవేశం చేశారో! నాకట్రా నువ్వు చెప్పేది.' విశాలతో తన పరిచయాన్ని , వనజ తో తన ప్రేమయాణాన్నిదృష్టిలో పెట్టుకొని రాజా ఎడ్పిస్తున్నాడని గ్రహించి రామకృష్ణ కూడా నవ్వేశాడు.
'అవునూ! మంజులా, నువ్వు ఒక హాల్లోనే కదూ కూర్చొనేది. తను పరీక్ష బాగా వ్రాసిందా?' రాజా నడక ఆపి రామకృష్ణ మొహంలోకి కుతూహలంగా చూస్తూ అడిగాడు. రామకృష్ణ ఒక్కసారి ఎగిరి పడినంత పని చేశాడు. 'ఒరే రాజా! నేనసలు పరిగెత్తుకుంటూ వచ్చింది , ఒక న్యూస్ చెప్పాలనే . నీ తిట్లుపడేప్పటికి మర్చిపోయాను. నేను ఒక గంటన్నా మొక్కుబడిగా కూర్చున్నాను, గోళ్ళు గోల్లుకుంటూ. మంజుల ఒక అరగంటంటే అరగంటే కూర్చొని , బయటికి వెళ్ళిపోయింది రా . నన్ను తిడతావు గాని కెమిస్ట్రీ పేపర్ ఎంత టఫ్ గా వుందో తెలుసా.' సమర్దిన్చుకున్తున్నట్లన్నాడు . రాజాకి నవ్వు వచ్చింది. 'నువ్వు చెప్పదలుచుకున్న న్యూస్ యిదేనా?" 'కాదు పూర్తిగా వినవేం? నేను, శివరాం , ఒకేసారి బయటికీ వచ్చేశాం. వాడితో కాసేపు మాట్లాడి, కాంటీన్ లో కాఫీ తాగుదామని వెళ్లాను. కాఫీ తాగి, ఒక నువ్వు వచ్చేసుంటావు , నీ దగ్గరకి వద్దామను కుంటున్నాను! కెమిస్ట్రీ లాబ్ దగ్గర మంజుల, సెకండియర్ శాంతి లేదూ' ఆ పిల్లతో మాట్లాడుతోంది. పరీక్ష బాగా రాయలేదా, అని అడుగుదామను కొని, అటు వెళ్లాను. వాళ్ళిద్దరూ నేను రావడం చూడలేదనుకో. రాజా! మంజుల శాంతితో ఏమంటుందో తెలుసా?! నువ్వొట్టి మోసగాడి వట! అమాయకులైన ఆడపిల్లల్ని వలలో వేసుకొని, అడిస్తావట! తేనే పూసిన కత్తి వట! నీ అందాలతో, మాటల్తో తనని లోబరచుకొని , పెళ్లి చేసుకుంటానని నమ్మించి, యిప్పుడు దాటుకుంటున్నావట. అబ్బబ్బ! ఇంకెన్ని మాటలందో? పైగా బుద్ది లేకుండా ఏడుస్తోంది. శాంతి ముందు. నాకు ఒళ్ళు మండి, నిజం దాస్తావెందుకని అడిగేద్డామను కుంటున్నాను. ఇంతలో ఇద్దరూ నన్ను చూసి, పురుగుని చూసి దులపరించు కొని పోయినట్లు, అక్కడ్నుంచి తప్పుకొన్నారు' కసిగా బాధగా అన్నాడు.
రాజా వెంటనే ఏం మాట్లాడలేక పోయాడు. 'మంజుల ఎందుకింత అన్యాయమైన ప్రచారం చేస్తోంది/ యితరుల సానుభూతికోసం, తనని కించ పరుస్తోందా? మంజుల బాహ్య సౌందర్యానికి మురిసి పోయాడు కాని ఈ రోజున , మంజుల కి కనీసపు సంస్కారం కూడా లేదని తెలిసింది.' వ్యధతో, రాజా మనసు అల్లకల్లోల ,మయింది. రాజా ముఖంలో ప్రతిబింబించిన భావాలను గమనించి రామకృష్ణ మనసు చివుక్కుమంది. ఆ క్షణంలో మంజుల కన్పిస్తే, లాక్కొచ్చి క్షమాపణ చెప్పించాలన్నంత పిచ్చి కోపం వచ్చింది. 'ఇపుడా శాంతి మంజుల చెప్పిందంతా నిజమే ననుకుంటుంది. ఇహ, ఆ పిల్ల, అందరితో అదే చెప్తుంది కాబోలు' దిగులుగా అన్నాడు రామకృష్ణ. రామకృష్ణ ప్రేమకి రాజా విచాలితుదయ్యాడు. 'డోంట్ వర్రీ ! లెటజ్ ఫర్ గేట్ ది పాస్ట్' రామకృష్ణ చేతిని తన చేతిలోకి తీసుకుంటూ అన్నాడు.
* * * *
ట్రెయిన్ కుదుపుకి ఈ లోకంలోకి వచ్చాడు రాజా. ఏదో స్టేషన్లో ఆగింది రైలు. 'ఇక జీవితంలో ఎప్పుడూ కలుసుకో కూడదనుకున్న మంజుల కన్పడి, గతాన్ని గుర్తు చేసింది. రామకృష్ణ యిప్పుడేక్కడున్నాడో? ఎమ్.ఎ ఫస్టియర్ చదువుతుండగా కలుసుకున్నాడు. అంతే మళ్లీ తర్వాత మూడు సంవత్సరాల్లో ఒకసారీ కన్పడలేదు. అంత మంచిమిత్రులు , ఉత్తరాలు వ్రాసుకో రంటే, ఎవరికైనా ఆశ్చర్యం గానే ఉంటుంది. కాలేజీ జీవితం , ఒక కరిగిపోయిన కల. ఇప్పుడా రోజులు కావాలనుకున్నా పొందలేనివి?' ఆలోచనలు సుమిత్ర వైపుకి మరలాయి. 'తను ఎమ్.ఎ ఫస్టియర్ సెలవులకి యింటికి వచ్చినప్పుడు సరదాన్నయ్య పెళ్లి సుమిత్ర వదినతో జరిగింది. తన సీనియర్ సుమిత్రంటే అప్పట్లో తనకెంతో గౌరవం ఉండేది ఎందుకో. గంబీరంగా, హుందాగా, రిజర్వుడుగా ఉండే సుమిత్రను చూసినప్పుడల్లా, సారదన్నయ్యకి అలాంటి అమ్మాయి దొరికితే బాగుణ్ణుఅనుకునేవాడు. అదే జరిగింది చివరికి. అన్నయ్య పెళ్ళయి పోయిన తర్వాత, వదిన చుట్టూ అస్తమానం, అల్లరి చేస్తూ, చిలిపి పనులు చేస్తూ , మేత్తమేత్తటి చీవాట్లు తింటుండేవాడు. 'ఒరేయ్ రాజా! చిన్నపిల్లవాడిలా ఏవిట్రా అల్లరి' అని అమ్మ కోప్పడితే, సుమిత్ర ఆపేక్షగా చూస్తూ అనేది. "ఫర్వాలేదత్తయ్యా ! ఈ యింట్లో రాజా కన్నా చిన్న వాళ్ళేవరున్నారు? రాజా నాకు తమ్ముడు లేని లోటును తీరుస్తున్నాడు. వదిన అలా అంటే, తనకెంత తృప్తిగా హాయిగా, గర్వంగా ఉండేది! నిద్రలేవగానే ముందు అమ్మని, వదిన ని చూడాలనుకునే వాడు. ఆ సమయంలో అమ్మ పూజ మందిరంలో ఉండేది. అందుకని గట్టిగా కళ్ళు మూసుకొని 'వదినా!' అని అరిచేవాడు. ఏం కొంప ,మునిగిందో అని, సుమిత్ర మొదట్లో చేస్తున్నపని వదిలేసి ఆదరా బాదరా వచ్చేది. 'ఎదురుగా నిల్చున్నారా?' అని అడిగి అప్పుడు కళ్ళు తెరిచి వదిన మొహంలోకి చూసి తృప్తిగా 'వదిన గారూ! యిహ మీరెళ్ళచ్చు' అని పర్మిషన్ యిచ్చేవాడు. అసలు సంగతి , అప్పుడర్ధమై నవ్వుకుంటూ వెళ్ళిపోయేది సుమిత్ర. తర్వాత మరిది కోర్కె ప్రకారం తనే రోజూ , అక్కడ రాజా ఉన్నన్నాళ్ళూ నిద్ర లేపేది. 'వదిన గారూ!' అని అనడం, రాజాకి కష్టం గానూ, సుమిత్ర కి వినడానికి అయిష్టం గానూ అన్పించి, యిద్దరూ ఒకరోజు అగ్రిమెంట్ కి వచ్చేసారు; అప్పటి నుండి రాజా, 'వదినా నువ్వు' అనే పిల్చేవాడు.
'వదినా! తల దువ్వవా?'
'వదినా! అన్నం పెట్టు.'
'అబ్బబ్బ! నా పుస్తకం కన్పట్టం లేదు వదినా?'
పిలిచినవాడు పిలిచినట్లే ఉండి, తెగ వేధించే వాడు, అమ్మ మందలింపు ల్ని కూడా పెడచెవిన పెట్టి. సుమిత్ర ఎంతో వోర్పుగా, వోర్పుని మించిన ప్రేమతో అన్నీ అమర్చి, రాజా కిష్టమైనట్లే చేసేది. సారధి పరిహాసంగా అనేవాడు. 'దేవిగార్కి ముద్దుల మరది పనుల్లో తీరికే లేకుండా పోతుంది.' అని.
ఈ తమపులు రాజాకి ఆహ్లాదంగా కన్పించాయి. 'వదిన దగ్గరకు వెళ్తున్నాడుగా! బాగా కవ్వించి వాదనలు పెట్టుకోవచ్చు.' టైం చూసుకున్నాడు. 'అబ్బ! యింక హైదరాబాద్ ఎప్పుడు చేరేది?' కొంచెం చిరాగ్గా పైకే అనేసాడు. ఎదుటున్న ముసలాయన రాజా అజ్ఞానానికి జాలిపడుతూ 'అప్పుడేనా బాబూ! ఏదీ యింకా తెల్లారందే!' రాజాకి తెలీదను కొని సమాధాన మిచ్చాడు . రాజా నోరెత్త లేదు.
* * * *
'వదినా! వదినా!'
సుడిగాలిలా లోపలికి దూసుకుంటూ వచ్చాడు రాజా! పళ్ళెం లో వున్న జాజిమొగ్గల్ని దీక్షగా మాల కడుతున్న సంధ్య అదిరిపడి తలెత్తింది. కిటికీ లో నుంచి ప్రసరిస్తున్న సంధ్యా కాంతి, సంధ్య చెక్కిళ్ళ మీద వింత కాంతితో మెరుస్తోంది. సంధ్య నుదురు మీద అల్లిబిల్లిగ అడే ముంగురులను చూస్తూ" ఎవరీ సంధ్యా సుందరి?' స్వగతంగా అనుకున్నాడు.
