"అయితే అనూరాధ ఏమైందంటారు?" అన్నాడు విశ్వం.
సీతారామయ్య భ్రుకుటి ముడతలు పడింది-"కొంప దీసి అనూరాధను నువ్వు కానీ ఏమీ చేయలేదు కదా!" అన్నాడు.
"అంటే?"
"అనూరాధ యేమైందని అమాయకంగా నువ్వు నన్నడుగుతున్నావు. దాన్నేం చేశావని నేను నిలదీస్తున్నాను. జవాబు చెప్పు..."
విశ్వం తెల్లబోయి-"అనూరాధ పుట్టింటికనే బయల్దేరింది. నాకా విషయం ఖచ్చితంగా తెలుసు. మొత్తం వ్యవహారమంతా ఏదో తిరకాసుగా వుంది. అయితే నిజం నేను తెలుసుకోలేకపోను...." అన్నాడు.
"నిజమేదైనా ఒక వారం రోజుల్లో నేను మీ ఇంటికి వస్తాను. నా కూతురక్కడ కనపడకపోయిందా నిజం తేల్చడానికి పోలీసులే రంగంలోకి దిగుతారు....."
పోలీసుల పేరు వినగానే విశ్వం తడబడ్డాడు.
3
సత్యనారాయణ విశ్వానికి నమస్కరించి-"మిమ్మల్ని కలుసుకున్నందుకు నాకెంతో సంతోషంగా వుంది-" అన్నాడు.
"మనం కలుసుకుని మాట్లాడుకోవడం-ఇద్దరికీ అవసరం కూడా-" అన్నాడు విశ్వం.
"మీరేదో చెప్పాలని వచ్చినట్లున్నారు.." అన్నాడు సత్యనారాయణ.
"అవును-ముందీ ఫోటోలు చూడండి....." విశ్వం జేబులోంచి ఓ కవరు తీసిచ్చాడు.
సత్యనారాయణ కవర్లోని ఫోటోలన్నీ చూసి-"ఇవి మీ పెళ్ళిఫోటోలనుకుంటాను...." అన్నాడు.
"అవును మీ పెళ్ళి జరిగితే ఈ ఫోటోలకూ మీ పెళ్ళి ఫోటోలకూ ఒక్కటే తేడా వుంటుంది. నా స్థానంలో మీరుంటారు...."
"అంటే?"
"రెండో పెళ్ళి ఫోటోల్లోనూ పెళ్ళికూతురు మారదు."
సత్యనారాయణ నవ్వి-"అవును-వాళ్ళు కవలలు కదా!" అన్నాడు.
"మీరెప్పుడైనా ఆ కవలలిద్ధర్నీ కలిపి చూశారా?"
"ఎందుకని మీరిలా అడుగుతున్నారు....?"
"నా అనుమానం-...." అని ఏదో చెప్పబోయి ఆగిపోయాడు విశ్వం. వాక్యం పూర్తిచేయకపోయినా తన భావం అర్ధం చేసుకుని వుండవచ్చునన్న భావంతో ఆతడు సత్యనారాయణ వంక చూశాడు.
"మీ అనుమాన మేమిటో నాకర్ధం కాలేదు-" అన్నాడు సత్యనారాయణ.
"సీతారామయ్యగారికోకే అమ్మాయని...."
"అంటే?"
"అనూరాధ. మనోరమ-ఇద్దరూ ఒకరేనని..."
"అలా ఎందుకు తల్లిదండ్రులబద్ధం చెబుతారు?"
మళ్ళీ యేదో చెప్పబోయి ఆగిపోయాడు విశ్వం-"అబద్దాలు చెప్పడానికెవరి కారణాలు వాళ్ళకుంటాయి. అవన్నీ మీకు తర్వాత వివరిస్తాను. ముందు నా ప్రశ్నకు జవాబు చెప్పండి. మీరెప్పుడైనా ఇద్దర్నీ కలిసి చూశారా?"
"లేదు-" అన్నాడు సత్యనారాయణ.
"అసలు తమకిద్దరు కవల పిల్లలున్నారని సీతారామయ్యగారు మీకెప్పుడు చెప్పారు?" అన్నాడు విశ్వం.
"రెండురోజుల క్రితం."
"ఎందుకు చెప్పారు?"
సత్యనారాయణ గుర్తుచేసుకుందుకు ప్రయత్నిస్తున్నవాడిలా కళ్ళు మూసుకున్నాడు.
"రెండేళ్ళ క్రితం ఉద్యోగరీత్యా నేనీ ఊరొచ్చాను. అద్దె ఇల్లుకోసం వెతుకుతూ నేను వాళ్ళింటికి వెళ్ళాను. ఇంట్లో మనోరమ వుంది. అద్దె యిల్లు దొరకలేదు కానీ-నేనామెను ప్రేమించాను. వీలున్నప్పుడల్లా ఆమెను బయట కలుసుకుని పరిచయం పెంచుకుందుకు ప్రయత్నించాను. ఆమె నేనంటే ఎక్కువ ఇష్టపడలేదు. అలా ఆర్నెల్లు జరిగాక ఆమె ఊళ్ళో లేదు. వాకబు చేయగా ఎక్కడో బంధువులింటికి వెళ్ళిందని తెలిసింది. ఆ తర్వాత మధ్య మధ్య యెప్పుడైనా కనిపిస్తూండేది. అంటే ఊర్నించి వచ్చినప్పుడు...నేనోసారి సీతారామయ్య గారిని కలుసుకుని నా అభిప్రాయంకూడా చెప్పాను. ఆయనంతా విని-అంతా అమ్మాయిష్టం-అన్నారు. మనోరమ ఇష్టపడితే తనే స్వయంగా నా యింటికి వస్తానన్నారు. రెండ్రోజుల క్రితమే మా ఇంటికాయన వచ్చి విషయాలు చాలా చెప్పారు. పెద్దమ్మాయి ప్రేమ వివాహం చేసుకుని తమతో తెగతెంపులు చేసుకుందని చెప్పి ఓ కార్డుకూడా చూపించారు. పెళ్ళి విషయం ఆడపిల్లలకు వదలడం చాలా తెలివితక్కువ పని అనీ-అలాంటి పొరపాటు మళ్ళీ చేయననీ అన్నారు. ఆయన మనోరమకూ నాకూ పెళ్ళి చేయాలనుకుంటున్నట్లు చెప్పారు. మనోరమ చేస్తున్న ఉద్యోగం మానిపించి ఇంటికి రప్పించామని చెప్పారు. ఇదీ నా కథ...." అన్నాడు సత్యనారాయణ.
"మీ కథ నా అనుమానాన్ని పెంచుతోంది. ఇందులో ఏదో తిరకాసుంది. మనోరమ పేరు-మీకు మొదటిసారి తెలిసినప్పట్నించీ అదేనా?" అన్నాడు విశ్వం.
"ఆమె పేరు నాకు తెలిసినప్పట్నించీ అదే....-"
విశ్వం నిట్టూర్చి-"ఏమిటో-అంతా అయోమయంగా వుంది. మీరు పెళ్ళి చేసుకోబోతున్న మనోరమ నాతో కాపురం చేసిన అనూరాధేనని నా అనుమానం. మీరు సహకరిస్తే ఈ విషయం తేల్చేయొచ్చు. అది మీక్కూడా మంచిది...." అన్నాడు.
"ఎలా తేల్చడమో మీరే చెప్పండి. నాకు వీలుంటే సహకరిస్తాను...."
"ఆమె శరీరంమీద కొన్ని గుర్తులు చెప్పగలను...." అంటూ విశ్వం అతడికి మొత్తం నలుగు గుర్తులు చెప్పాడు.
అది వింటూనే సత్యనారాయణ చెవులు మూసుకుని "పరాయి ఆడపిల్ల దగ్గర-ఇలాంటి గుర్తులు నేనెలా కనుక్కోగలను?" అన్నాడు.
"మనోరమ మీకు పరాయిదికాదు. కాబోయే భార్య!"
సత్యనారాయణ క్షణం ఆలోచించి-"మీరు చెప్పిందీ రైటే! అయితే ఈ విషయంలో నేను మీకు తప్పక సహకరించగలను...." అన్నాడు.
"థాంక్స్-మనం మళ్ళీ యెప్పుడు కలుసుకుందాం?"
"ఏమో-పెళ్ళికి ముహూర్తాలెప్పుడున్నాయో నాకెలా తెలుస్తుంది?"
"పెళ్ళి ముహూర్తాలేమిటి?"
"నాకూ మనోరమకూ పెళ్ళయ్యాకనే కదా-మీకీ విషయం చెప్పగల్గుతాను...."
విశ్వం విసుగ్గా-"పెళ్ళయ్యాక-ఆమె మనోరమ కాదు-అనూరాధ-అని తెలుసుకుని ఏం చేస్తారు?" అన్నాడు.
"ఏం చేయాలో నాకూ తెలియదు. అసలు తెలుసుకోవాలన్నా కుహూహలం కూడా నాకు లేదు. కానీ మీరడిగారు కదా...."
విశ్వం ముఖంలో అసహనం కనబడింది - "అంటే ఆమె అనూరాధ అనీ - నాతో కాపురం చేసిందనీ తెలిసినాకూడా మీరామెతో కాపురం చేయగలరన్న మాట!"
"మీరు చెప్పిన గుర్తులామె వంటిమీదున్నంత మాత్రాన-ఆమె అనూరాధ అయిపోదుగదా! నాతో కలిసి జీవించాలని వచ్చిన ఆమె మాటలే నేను నమ్ముతాను. నాకు ప్రయోజనం లేనప్పుడు-నిజాల గురించి కూడా పట్టించుకోను..." అన్నాడు సత్యనారాయణ.
"అలా పట్టించుకోకపోవడంవల్ల-మీక్కూడా నా గతే పట్టవచ్చు...."
"మిస్టర్ విశ్వం! నా భార్య అలాచేస్తే ఆ తప్పు నాదే అవుతుంది. ఎందుకంటే-హిందూ స్త్రీ తనంతటతనే తన కాపురంలో నిప్పులు పోసుకోవాలనుకోదు. ఆమె అలా చేసిందంటే అందులో భర్త బాధ్యత చాలా వుంటుంది...." అన్నాడు సత్యనారాయణ.
