Previous Page Next Page 
డాళింగ్ పేజి 9

 

    "అదా మీ బాధ.తెరలు తెరలుగా పెద్దగా నవ్వాడు డైరెక్టర్. తనూ నవ్వక తప్పింది కాదు ప్రొడ్యుసర్ కి.

                                               *    *    *    *

    రాత్రి ఏడుగంటలు.
    యూనిట్ అంతా షూటింగ్ స్పాట్ నిజాం పేలస్ దగ్గరికి వెళ్ళి పోయింది.
    వెళ్ళే ముందు-
    డైరెక్టర్ వచ్చి సరిగ్గా ఎనిమిది గంటలకు కారు వస్తుందని విమల్ తో చెప్పాడు.
    "ఇప్పుడు రమ్మన్నా రెడీ. మీతో వచ్చెయ్యమంటారా!" హుషారుగా అన్నాడు విమల్.
    "పుల్ నైట్ చేద్దాం కాసేపు రెస్టు తీసుకోండి" వెళ్ళిపోయాడు డైరెక్టర్.
    టీవిలో న్యూస్ ప్రోగ్రాం వస్తోంది.
    అదే సమయంలో టెలిఫోన్ మోగింది.
    మద్రాసు నుంచి ప్రొడ్యుసర్ ఫోన్ చేసాడేమో . లేచి రిసీవర్ పట్టుకున్నాడు.
    హలో.......విమల్ హియర్."
    "కాల్ ఫ్రమ్ న్యూయార్క్ సర్." ఆపరేటర్ గొంతు. మెత్తగా ఆహ్లాదకరంగా వుంది.
    న్యూయార్క్ కాల్. అంతవరకూ విమల్ మోహంలో వున్న సంతోషం చటుక్కున మాయమైపోయింది.
    న్యూయార్క్ కాల్.
    "లేనని చెప్పలేదా!" విసుగ్గా అన్నాడు విమల్.
    "లేదు సర్.....మీరున్నారని చెప్పే." ఇంకేదో చెప్పబోయింది ఆపరేటర్.
    "ఇవ్వండి"
    ఒక్క క్షణం, రెండు క్షణాలు.......మూడు క్షణాలు.
    ఒక్క నిమిషం......
    రెండో నిమిషం....
    మూడో నిమిషం.......
    అయిదు నిమిషాలు......
    పది నిమిషాలు......
    పదిహేను నిమిషాలు.......
    ఇరవై నిమిషాలు.....
    ముప్పై నిమిషాలు......
    నలబై అయిదు నిమిషాలు .
    మాట్లాడి, విసురుగా రిసివర్ని పడేసి, తలపట్టుకుని కూర్చుండిపోయాడు.
    అలా ఎంతసేపు కుర్చునన్నాడో తెలీదు.
    ఎనిమిదీ నలబై అయిదు నిమిషాలు.
    హిందీ వార్తలు కూడా అయిపోయాయి.
    సంఘర్ష్, హిందీ సీరియల్ ప్రారంభమైంది.
    తానెక్కడున్నాడో తెలీని పరిస్థితి.
    అంతా అయోమయంగా వుంది.
    ఏదో కసి. ఏదో కోపం. అతని నరాల్లో రక్తం సలసల పరుగెడుతోంది.
    పిచ్చి పిచ్చిగా వుంది.
    బాధగా జుత్తు పీక్కున్నాడు. తలగడని తీసుకుని గోడకి విసిరి కొట్టాడు.
    అప్పుడతని చూపు ఎదురుగా వున్న టీ.వీ మీద పడింది.
    టీ.వీ. తెరమీద ఏవో బొమ్మలు, కదులుతున్నట్టుగా అనిపించింది
    సూటిగా తెరవేపేపు చూసాడు.
    టేబుల్ మీదున్న ఫారిన్ సెంట్ బాటిల్ ని తీసికొని, శక్తి నంతా కూడదీసుకుని టీ.వీ. తెరమీదకు విసిరాడు.
    భళ్ళున టీ.వి. స్క్రీన్ పగిలిపోయింది.
    పగిలిన టీవి లోంచి ఏవో పొగలు.
    లేచి పిడికిలి బిగించి డ్రెస్సింగ్ టేబిల్ దగ్గర కెళ్ళి నిలువెత్తు మిర్రర్ ని గుద్దాడు.
    మిర్రర్ భళ్ళున పగిలి కింద పడిపోయింది.
    అతనేం చేస్తున్నాడో అతనికే తెలియని పరిస్థితి.
    కన్పించిన వస్తువునల్లా ధ్వంసం చేస్తున్నాడు. గదిలో ట్యూబ్ లైట్ పగిలిపోయింది. అందమైన బెడ్ లైట్ పగిలిపోయింది. యూ ఫామ్ బెడ్ పీలికలై పోయింది.
    చీకట్లో పిచ్చివాడిలా అయిపోయాడు విమల్.
    సరిగ్గా ఎనిమిది యాభై అయిదు నిమిశాలైంది.
    గదిలోంచి బయటికొచ్చాడు విమల్.


                                              *    *    *    *

    సరిగ్గా తొమ్మిదిగంటలైంది.
    హోటల్ ముందు ఆగిన కారులోంచి ప్రొడక్షన్ మేనేజర్ దిగి ఫస్ట్ ఫ్లోర్ లో కొచ్చాడు.
    హీరో విమల్ సూట్ ముందు నిలబడి కాలింగ్ బెల్ నొక్కాడు.
    ఏ అలికిడి లేకపోవడంతో , నెమ్మదిగా తలుపు తోసాడు.
    మిగతా రూముల్లో వేలుగుండగా , ఆ ఒక్క సూట్లో ఎందుకు చీకటిగా ఉందొ అతనికి అర్ధం కాలేదు.
    నెమ్మదిగా పిలిచాడు ." సార్..........సార్........"
    ఉలుకూ లేదు, పలుకూ లేదు.
    అతనిలో ఏదో అనుమానం.
    గబగబా రిసెప్షన్ కి పరుగెత్తుకొచ్చాడు.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS