ఎదిగిన పిల్లలు ఇంట్లోవున్నా ఒక్క శుభకార్యం కూడా జరగడం లేదు. మొదటి భార్యకు తను ఒక్కడే సంతానం మిగిలిన నలుగురు పిల్లలూ ఆమె సంతానం. తనకు ఇంకా పెళ్ళికాలేదని పిన్నికి బాధవున్నా, తన పిల్లలకు అసలు కాదేమోనన్న అనుమానం ఇంకా ఎక్కువగా వుంది.
పెద్ద చెల్లెలకు పెళ్ళిచేయాలని ప్రయత్నిస్తున్నా కుదరడంలేదు. పెళ్ళి చేసే తాహతు కూడా లేని తమ ఇంటి ఆడబడుచుకి పెళ్ళికావాలనుకోవడం అత్యాశ. ఇంక ఈ ఆలోచనలకు ఫుల్ స్టాప్ పెట్టాలని అక్కడి నుంచి లేచాడు ఆంజనేయులు.
ఇంట్లోకెళ్ళి టవల్ భుజంమీద వేసుకుని ఏట్లోకి బయల్దేరాడు.
తిరిగి ఇంటికి వచ్చేటప్పటికి అందరూ ఎవరి పనులు వాళ్ళు చేసుకుంటున్నారు.
ఇంట్లోకి వెళ్ళబోతున్న ఆంజనేయులు తండ్రి పిలవడంతో ఆగేడు.
"ఏమిటినాన్నా?" దగ్గరగా వెళ్ళి అడిగాడు.
"ఏం లేదురా కన్నా! కోరకూడనిది కాదనుకో. కానీ పెద్దవాడివై పుట్టడంవల్ల ఇంటి భారం అంతా మోస్తున్నవాడివి. గంపెడు సంసారాన్ని నీ రెండు చేతులమీద లాక్కొస్తున్నవాడివి. నీ కష్టాలు తెలియనివి కావు. పోనీ చచ్చిపోబోతున్న వాడివైనా నోటిదూల తీరడం లేదురా. ఈ రోజు ఆదివారం కదా, మటన్ తినాలని వుందిరా" అలా అడిగి ఎందుకనో తప్పు చేస్తున్నవాడిలా తల దించుకున్నాడు అతని తండ్రి శీనయ్య.
ఆంజనేయులు గుండె గతుక్కుమంది. మాంసం అంటే మాటలా కేజీ నలభై రూపాయలు. ఇరవై రూపాయలకు ఎవరైనా దయతలచి ఇస్తామన్నా జేబులో చిల్లిగవ్వలేదు. అందుకే ఆదివారంవస్తే తనకు భయం. చుట్టూవున్న ఇళ్ళనుంచి మసాలా వాసనలు ముక్కులు బద్దలుకొడుతుంటాయి. తనింట్లో మాత్రం ఏ పప్పుపులుసో, కారం మిరియమో వుడుకుతుంటుంది. అందుకే ఆదివారం వస్తే పక్కింటి వంటిల్లు వాసనలు ఇటురాకుండా ఏదైనా ఉపాయం వుంటే బావుంటుందనిపిస్తుంది ఆంజనేయులకు.
"అలానే నాన్నా! తీసుకొస్తాలే."
"నరసింహులు మంచి పొట్టేలు కోస్తున్నాడంట. నేనే వెళ్ళి అడుగుదామనుకున్నాను. కానీ దీపావళి పండక్కి తీసుకొచ్చిన కేజీ కూరకు ఇంకా డబ్బివ్వలేదు కదా. అందువల్ల ముఖం చెల్లక పోలేక పోయాను. నువ్వెళ్ళి ఆ డబ్బు ఇచ్చేసి పట్టుకురా.
"సరే" అని లోపలికొచ్చాడు.
"అన్నయ్యా! ఎలా వుంది మా చిరంజీవి ఫోజు" చిన్న తమ్ముడు నాగరాజు ఓ ఫోటోను తీసుకొచ్చి చూపించాడు ఆంజనేయులకు.
వాడికి చిరంజీవి అంటే అభిమానం పిచ్చి ప్రేమ. చిరంజీవికోసం రక్తం ఇమ్మన్నా ఇస్తాడేమో అనుకొనేంత వెర్రి ప్రేమ.
ఏదో సినిమాలోని స్టిల్ అది. నిజంగానే చిరంజీవి చాలా మంచి ఫోజులో హీరోయిన్ పక్కన నిలబడి వున్నాడు.
"బావుందిరా" అన్నాడు ఆంజనేయులు.
దాంతో పొంగిపోయాడు వాడు. ఫోటోను తీసుకుని మిగిలిన చిరంజీవి ఫాన్స్ కు చూపించడానికి వెళ్ళాడు.
వాడికి పదిహేనేళ్ళుంటాయి. ఇంట్లోకంతా చిన్నవాడు. పోయిన సంవత్సరం తొమ్మిది పాసయ్యాడు. ఆపై చదివించే వీలులేక నిలిపేశారు పుస్తకాలు అటక ఎక్కడంతో వాడికి ఏమీ పాలుపోలేదు. అంతక్రితం ఎక్కడో మనసులో ఓమూలున్న చిరంజీవిమీద ప్రేమ గుండెంతా ఆక్రమించుకుంది. అప్పటినుంచి చిరంజీవికి వీరాభిమాని అయిపోయాడు.
ప్రతి మనిషికీ అభిమానించేందుకు ఓ ఆబ్జెక్టు కావాలి. ప్రేమించడం మనిషి లక్షణం. ఈ సహజ లక్షణం ఎవరికైనా తీరుతుండాలి అయితే ఇంట్లోనో, బయటో మనం అభిమానించే వ్యక్తులు లేనప్పుడు, మనల్ని ప్రేమగా చూసుకునే వ్యక్తులు కరువైనప్పుడు ఎవరో మనకు ఆదర్శమైనవ్యక్తి అని అనుకున్న వారిని అభిమానించడం మొదలుపెడతాం కొందరు రాజకీయ నాయకుల్ని అభిమానిస్తే మరికొందరు సినిమావాళ్ళని అభిమానిస్తారు.
ఈ సినిమా యాక్టర్లకు అందుకే చాలామంది అభిమానులుంటారు. అమ్మనాన్నలు లేనివాళ్ళు, పూట గడవనివాళ్ళు కుటుంబ ప్రేమకు నోచుకోనివాళ్ళు ....... ఇలాంటి వాళ్ళే సినిమా నటులంటే క్రేజ్ పెంచుకుంటారు. తమ గుండెల్లో పొంగే ప్రేమను, ఆరాధనను ఇలా తీర్చుకుంటారన్న మాట హాపీ హోమ్ లేని పిల్లలే ఇలా తయారవుతారు." వినయ్ ఎప్పుడో అన్న మాటలు గుర్తొచ్చాయి ఆంజనేయులకు.
నిజమే నాగరాజును ఇంట్లో ఎవరూ ప్రేమగా చూసుకోరు తమ ఇంట్లో అందరూ ఏదో ఆలోచించుకుంటూ, కుమిలిపోతూ వుంటారే తప్ప ఆనందంగా మాట్లాడుకోరు. ప్రేమను కూడా మెటీరియలిస్టిక్ గానే ఎక్స్ ప్రెస్ చేయాలి. తనకు తమ్ముళ్ళన్నా, చెల్లెళ్ళన్నా చాలా ఇష్టం. కానీ తన ప్రేమ వాళ్ళ దగ్గర ఎలా ఎక్స్ ప్రెస్ చేయగలడు? వాళ్ళకు మంచి బట్టలు తెచ్చిఇచ్చో, వాళ్ళు అడిగింది కొనిచ్చో ప్రేమను బయటపెట్టుకోవాలి. కానీ అది వీలుకాదు అందుకే తను మౌనంగా వుండిపోతాడు. ప్రేమను ప్రకటించుకోలేడు.
ఇలాంటప్పుడు వాళ్ళు బయటవాళ్ళ నుంచి ప్రేమ ఆశిస్తారు. కానీ అది వీలుకాదని తెలిసిపోతుంది. తమను ఎవరూ ప్రేమించకపోగా తామైనా ప్రేమించాలన్న తపన మొదలవుతుంది. ఈ క్రమంలోనే సినిమా నటులను అభిమానించడం మొదలుపెడతారు. వినయ్ చెప్పింది అక్షరాల నిజమనుకున్నాడు ఆంజనేయులు.
వుస్సూరుమంటూ పైకి లేచి దొడ్లోకెళ్ళాడు. ముఖం కడుక్కుని వచ్చాడు.
"ఇదిగో ఇలారా! సద్దతిందువు" ప్రభావతి పిలవడంతో వంటింట్లోకి నడిచాడు.
పీట వాల్చుకుని కూర్చున్నాడు. ప్రభావతి అతని పిన్ని మొదటి సంతానం. దాదాపు ఇరవై ఎనిమిదేళ్ళుంటాయి. సన్నగా వున్నా కనుముక్కు తీరు బావుండడం వల్ల ఆకర్షణీయంగా కనిపిస్తుంది.
ప్రభావతి కంచం ముందుకు జరిపింది.
ఆంజనేయులు ముఖం పైకెత్తి ఆమెకల్లా చూడలేకపోయాడు. ఆమెను చూడాలంటే అతనికి భయం. కళ్ళల్లో కత్తులు పెట్టుకుని చూస్తూంది వాళ్ళిద్దరి మధ్య ఒక సైలెంట్ వార్ ఒకరికొకళ్ళు ఎదురుపడ్డప్పుడల్లా జరుగుతుంటుంది ఈ విషయం వాళ్ళిద్దరికీ తప్ప మరెవరికీ తెలీదు.
ఆంజనేయులు మౌనంగా తినడం మొదలుపెట్టాడు.
ప్రభావతి అటువైపు తిరిగి గిన్నెలను బాగా సౌండ్ వచ్చేట్టు సర్దుతోంది. ఈ శబ్దాలకైనా ఆంజనేయులు ముఖం పైకెత్తుతాడని ఆమె ఆశ కానీ ఎప్పటికప్పుడు ఆమె నిరాశకు గురవుతూ వుంటుంది.
ఆంజనేయులు వల్లే తాము ఇన్ని ఇబ్బందులు పడుతున్నామని ఆమె నమ్మకం. అతని ఆశక్తి వల్లనే ఏ ఆనందానికీ నోచుకోలేక పోతున్నామని గాఢంగా అనుకుంటుంది. తనకు పెళ్ళికాకపోవడం దగ్గర్నుంచి అన్ని కష్టాలకు మూలం తన అన్నయ్యేనని భావిస్తుంటుంది. అందుకే అతను కనిపించినప్పుడల్లా శత్రువును చూస్తున్నట్లు చూస్తుంది ఆప్రియమైన వ్యక్తితో మాట్లాడినట్టు మాట్లాడుతుంది. గిట్టని వాళ్ళతో వ్యవహరించినట్టు వ్యవహరిస్తుంది.
అయితే ఆంజనేయులు మాత్రం ఆమెను ద్వేషించడు. ఆమె బాధనంతా అర్ధం చేసుకునే సహృదయత వుంది గనుక శత్రువుగా పరిగణించడు. ఆమె తన పట్ల అయిష్టత ప్రకటించినా, చూపులతో అసహ్యించుకున్నా సానుభూతితో ఆమె మానసిక స్థితిని అంచనా వేసుకుంటాడు. ఆమె అసహనాన్నంతా మౌనంగా భరిస్తాడు. వీలైనంత వరకు ఆమెకు దూరంగా వుండడానికి ప్రయత్నిస్తాడు.
