అతనికి చప్పున ఆరోజు జరిగింది గుర్తుకొచ్చింది "ఏమిటి పంతులుగారూ? యింతపెద్ద జమీకి మానేజర్ మీరు. బస్సులో వచ్చారేమిటి? కారు తీసుకుని రారాదూ?" అని అడిగారు రైతులు. "బాబులూ! మీరంతా రైతులు కష్టించి డబ్బు జాగ్రత్త పెడతారు, మీరూ మీ పిల్లలూ కార్లల్లో తిరగొచ్చు. ఈ భూమి అమ్మగారిది. ఆమె దర్జాగా కార్లల్లో తిరగొచ్చు. కానీ నేను గుమాస్తాగాడిని, కాదంటే పెద్ద గుమాస్తాని. అంతే! నాకు మీలా వందలు వందలు ఖర్చుచేసి చిన్నకార్లలో తిరిగే యోగంలేదు. పొదుపు, పొడుపు నాయనా కావలసింది." అన్నాడు తను....ఒక్క సారిగా అతనికి భయమేసింది. వెన్నెముక గుండా భయం జరజరా ప్రాకింది. తలమీద పామున్నట్టుగా భయపడ్డాడు. ఎవరయినా తను బస్సులో వచ్చివెళ్లినట్టు చెప్పిపోయారా? లేకపోతే-టాక్సీ వెధవవచ్చి చెప్పాడా? ఊహూఁ వాడికివేం తెలియదు. అయిదు రూపాయలిస్తే చాలు...రసీదిచ్చేస్తాడు ఎవరో రైతులే వచ్చారేమో! అయినా ముసుగులో గుద్దులాటెందు కనుకుని "ఎవరయినా పల్లెనుంచి రైతువచ్చాడా అమ్మగారూ?" అని అడిగాడు ఒక విధమైన తెగింపుతో.
"ఊహూ ఎవరూ రాలేదు. ఏం?"
"ఆహాఁనాయుడు వస్తానన్నాడు లెండి, మక్తావిషయం మాటాట్టానికి. అతని పొలం అనుకుని ఉన్న పొలం కూడా అతనికే కావాలట."
"చూద్దాం." గంభీరంగా అంది.
"మీరూ ఆలోచించండి, నాయుడు నమ్మకస్తుడు. మక్తా తప్పకుండా కరెక్ట్ గా యిస్తున్నాడు."
"రాయుడు కూడా యిస్తున్నాడుగా?"
"అవుననుకోండి! మనకి తక్కువమంది రైతులైతే సులభం కదా?"
"వూహూఁ నీకు తెలియదు. రైతులు ఎక్కువగా ఉంటేనే మనకిమేలు. మనకి వూర్లో బలంవస్తుంది. ఒకే రైతుక్రింద ఎక్కువ పొలం ఉంటే వాడికి బలుస్తుంది. మనపై అసూయ ప్రబలుతుంది. తన బుద్ది చెడటమే కాక యితర్ల మనస్సునీ చెరుస్తాడు. కౌలుదారీ చట్టం, అదీ అంటూ మనల్ని యిక్కట్లు పెడతారు." అంది ఆలోచనగా.
వెంకట్రామయ్య రెట్టించలేదు.
"సరే! యీ పూటకి యింటికి వెళ్ళిరా, యిదిగో చెక్కు అయిదువేలు రేపు బ్యాంక్ తెరవగానే తీసుకునిరా." అంది చెక్ అందిస్తూ. వెంకట్రామయ్య వెళ్ళి పోయాడు.
5
"అన్నయ్యా."
స్వాతి పిలుపువిని కిటికీగుండా మేడవైపు చూస్తున్న రవి తలతిప్పి చూశాడు. లేచి చెల్లాయి దగ్గరికి వచ్చాడు. "ఏమ్మా?" అంటూ.
"ఎప్పుడూ అలా చూస్తూ నుంచుంటావెందుకు?"
చప్పున సమాధానం చెప్పలేకపోయాడు రవి.
"ఎందుకన్నయ్యా?" రెట్టించింది స్వాతి.
"ఏంలేదమ్మా! నానమ్మ మనస్తత్వం గురించి ఆలోచిస్తూ ఉంటాను. అమ్మ చెప్పింది అక్షరాలా నిజమే ననిపిస్తోంది."
స్వాతి సమాధానం యివ్వలేదు.
"రేపు డబ్బిస్తానంది కదూ?"
"వూహూఁ ఏమీ జవాబు చెప్పలేదు. ఊరకే యీ గదిలో వుండమంది. అంతే!"
దిగులుపడిపోయింది స్వాతి. ఆమె విశాలమైన కళ్ళు వర్షించే జలదల్లా అయ్యాయి. ముఖంలో కాంతి తగ్గిపోయింది. గుండె బరువెక్కింది. దాంతో దగ్గుతెరవచ్చింది విపరీతమైన ఆయాసంతో, బాధతో దగ్గిదగ్గి నీరసంగా వాలి పోయింది. గాబరాతో వచ్చి చెల్లెలివీపు మృదువుగా నిమురుతూ ఉండిపోయాడు రవి.
