Previous Page Next Page 
వసుంధర కధలు -12 పేజి 8


                              టెండర్ లవ్

                                                                                                      వసుంధర

    కళ్ళు జిగేల్ మన్నాయి నాకు.
    అర్ధరాత్రి ఆకాశంలో మెరుపు కనపడ్డా అలాగని అనిపించదేమో! ఆ అపురూప సుందరి యెవరో గాని ఆ షాపులో చాలామంది ఆడా, మగా ఆమె వంక చూశారు.
    రక్తవర్ణపు చీర, అదే రంగు బ్లవుజు , గులాబి రంగు వళ్ళు, పద్మల్లాంటి కళ్ళు ....
    ఆమె నా పక్కకే వచ్చి ---"ఇది ఇంపోర్టెడా?" అనడిగింది.
    అప్పుడు నా చేతిలో ఓ గొడుగుంది. బటన్ నొక్కితే తెరుచుకుంటుంది. ఆమెను చూడ్డానికి ముందు నేనా గొడుగు బేరం చేస్తున్నాను. ఎనభై రూపాయలు అన్నాడు. బటన్ ఎలా పని చేస్తుందో చూద్దామని వెనక్కు తిరిగాను. ఆమె కనిపించింది. అన్నే మర్చిపోయాను.
    ఇప్పుడామె ఆ ప్రశ్న నన్నుద్దేశించి అడిగిందో, సేల్సు మేన్ని అడిగిందో తెలియదు. కానీ నేనే --- "అవును -- " అని వెంటనే బదులిచ్చాను. నా గొంతుతోపాటే సేల్సు మేన్ గొంతు కూడా జత కలిసింది.
    "ఎనభై రూపాయలు-------" అన్నాడు సేల్సు మెన్ ఈసారి నేను మాట్లాడలేదు.
    ఆమె వానిటీ బ్యాగ్ తెరచింది. సేల్సు మన్ కంగారుగా "మీరిది కొంటారా ?" అన్నాడు.
    ఆమె అందంగా తల ఊపింది.
    అప్పుడు సేల్సు మన్ నా వంక చూసి -- "సార్ ఇలాంటిదొక్కటే గొడుగుంది. మీరు తీసుకునేది లేనిది చెప్పండి --" అన్నాను.
    "నేను తీసుకుంటున్నాను --" అన్నాను వెంటనే. ఇందాక అయితే అయిదు రూపాయలు తగ్గించేలా కనబడ్డాడు. ఈ అమ్మాయి బెరమాడక పోవడం వల్ల నేను నిర్ణయంలో ఆలస్యం చేయడం వల్లనూ ఎలభై రూపాయలకే గొడుగు కొనాల్సి వస్తోంది. నాలో ఇప్పుడు ఆ అమ్మాయిని చూసిన థ్రిల్ తగ్గి డబ్బు గురించి ఆలోచించగల్గుతున్నాను.
    ఆ అమ్మాయి నా వంక చూసి -- "మీకీ గొడుగు అర్జంటా?" అంది.
    ఆమె నన్ను పలకరించినందు కమితానందపడుతూ "ఏం?" అన్నాను.
    "నాకిది అర్జంటు ...." అందామె.
    "మేడమ్ -- ఇది లేడీస్ గొడుగు కాదు -- " అన్నాను.
    ఆమె చటుక్కున --"నా పేరు పద్మావతి --" అంది.
    తనను మేడమ్ అన్నానని పేరు చెప్పిందా లేక ఆమె నాతొ పరిచయాన్నభిలాషిస్తోందా అన్నది అర్ధంకాలేదు. ఏమనాలో తెలియక -" నా పేరు నూతనరావు " అన్నాను.
    "మిస్టర్ నూతనరావ్!రేపు మా నాన్నగారి పుట్టిన రోజు. అయన కిది బర్త్ దే ప్రజెంట్ గా ఇవ్వాలని నా కోరిక. ఎండకూ, వానకూ కూడా ఆయనకు గోడుగుండాలి. చాలా కాలంగా అయన వాడుతున్న గొడుగు పాడై పోయింది. ఆటోమేటిక్ గోడుగైతే బాగుంటుందనిపించింది. ఇది నాకు బాగా నచ్చింది ...."
    నేను చటుక్కున --"ఇన్ని చెప్పడానికి బదులు మీ ఇంటికి పిలిచి టీ ఇస్తానంటే బాగుండేది --" అన్నాను.
    "తప్పకుండా! ఇప్పుడే మిమ్మల్నాహ్వానిస్తున్నాను " అందామె.
    నేను తెల్లబోయినా -- "అయితే గొడుగు మీదే!" అన్నాను.
    "థాంక్స్!" అందామె. సేల్సు మన్ వైపు తిరిగి -- "ప్రెజెంటేషన్ ప్యాకింగ్ చేయి --" అంది.
    క్షణాల మీద ప్యాకెట్ సిద్దం అయింది. పద్మావతి సేల్సు మన్ కు డబ్బిచ్చేసి అక్కడే నిలబడి వున్న నాతొ "రండి --" అంది.
    నేను ఆశ్చర్యంగా --"నిజంగానా ?" అన్నాను.
    "నేనబద్దలాడే దానిలా కనపడుతున్నానా?" అందామె.
    "అది కాదు , నేనూరికే సరదాగా అన్నాను...."
    "అయితే మీ యిష్టం. నేను మాత్రం సరదాకు ఆహ్వానించలేదు."
    "మీరింత అభిమానం పిలుస్తున్నప్పుడు తప్పకుండా వస్తాను-" అంటూ నేను పద్మావతితో నడిచాను. నా మనసులోంచి ఆశ్చర్యం తొలగిపోలేదు. ఎందుకో వెనక్కి తిరిగి చూస్తె సేల్సు మాన్ మా వంక ఆశ్చర్యంగా చూస్తున్నాడు.

                                  2

    "చాలా ఆశ్చర్యంగా వుందే...." అన్నాడాయన.
    అయన పేరు ముత్యాలరావు. వయసు యాభై దాటి వుంటుంది. పద్మావతికి తండ్రి అయన.
    తన కూతురు నన్ను టీ కి పిలిచినందుకు ముత్యాలరావు చాలా ఆశ్చర్య పడ్డాడు. పద్మావతికి మగాడంటే చిరాకు, సాధారణంగా ఎవర్నీ పలకరించదు. ఎవరైనా పలకరిస్తే మాట్లాడదు.
    ఏ తండ్రైనా తన కూతురి గురించి అలాగే అనుకుంటాడు. దీన్ని బట్టి పద్మావతి తెలివైనదే నని నేను గ్రహించాను.
    "అది మీమీద ప్రేమలెండి --" అన్నాను.
    "అవునవును. వెర్రి పిల్ల -- దాని కెప్పుడూ నా గురించే ఆలోచన. నాక్కొందామన్న గొడుగు దొరకదేమోనన్న పరిస్థితిలో నువ్వా మాత్రం త్యాగం చేసే సరికి నీమీద ఎడతెగని అభిమానం వచ్చేసుంటుంది --" అన్నాడు ముత్యాలరావు.
    నేను అనాసక్తంగా వింటున్నాను. పద్మావతి నన్ను తండ్రికి పరిచయం చేసి తను లోపలకు వెళ్ళిపోయింది. ఇంట్లో ఈయనుంటాడన్న విషయం స్పురిస్తే నేను టీకిక్కడి దాకా వచ్చి వుండేవాడిని కాదు. ఇంకాటైము ఆరు కూడా కాలేదు గదా -- ఆయనింకా యింటికి రాడనుకున్నాను.
    నేనాయనతో కాలక్షేపం చేస్తుండగా ట్రేలో మూడు కప్పులు టీ తీసుకుని వచ్చింది పద్మావతి.
    ముగ్గురం టీ తీసుకున్నాం.
    "ఫెంటాస్టిక్ !" అన్నాను టీ రుచి చూస్తూ. అది నేను మర్యాద కన్న ముక్క కాదు. ఆ టీ పద్మావతి తయారు చేసిందన్న భావన వల్లనో ఏమో టీ నాకు అద్భుతంగా రుచిస్తోంది.
    "మా ఇంట్లో రోజూ యిలా వుండదు. ఈరోజు మీకోసం స్పెషల్ గా చేశాను -" అంది పద్మావతీ నవ్వుతూ. ఆమె నవ్వుతుంటే పళ్ళు ముత్యాల్లా మెరిశాయి.
    ముత్యాల్ర్రావు ఆశ్చర్యంగా -- "ఈ అబ్బాయిలో ఏదో విశేషముంది! నిన్నింత సంతోషంగా యెప్పుడూ చూడలేదు!" అన్నాడు.
    పద్మావతి వెంటనే -- "ఇంటికి పిలిచి టీ యిమ్మని ఈయనడిగిన తీరు అద్భుతం! కొంతమంది కేవలం పలకరించడం కోసం టైమడుగుతారు. ఆ పలకరింపులోనే వుంటుంది ఎక్కడ లేని కల్మషం !" అంది.
    ఈ విషయం నాకు తెలుసు. నాది అందమైన ముఖం, అటు పైన నాకు నటించడం బాగా చేతనౌను. నేనెలా నవ్వినా అమాయకంగా వుంటుందని చాలామంది ఆడపిల్లలే ఒప్పుకున్నారు. కాలేజీ రోజుల్లో నేనో పెద్ద హీరోని. ఒకరికి తెలియకుండా ఒకరిని మొత్తం ముగ్గురమ్మాయిలను నావెంట తిప్పుకున్నాను. ఆ ముగ్గురిలోనూ సుగుణ నన్ను మనసారా ప్రేమించింది. నా ప్రేమ నిజమేనని నమ్మింది. నేనామెకు కుంటి సాకు చెప్పాను. నామీద ప్రేమతో ఆమె అది కూడా నమ్మింది. నామీద జాలిపడింది.
    "నువ్వు లేకుండా నేనూ బ్రతకలేను. ఆత్మహత్య చేసుకుంటాను --" అన్నాను.
    సుగుణ నన్ను వారిస్తుందని ఆశపడ్డాను. ఆమె అలా చేయకుండా -- "మనిద్దరం కలిసి చచ్చిపోదాం. నువ్వు లేకుండా నేనూ బ్రతకలేననిపిస్తోంది -" అంది.
    నేను భయపడ్డాను. కానీ అది ప్రకటించకుండా "నువ్వు చచ్చిపోవడానికి వీల్లేదు. నేను తిరుగుతున్నా ఈ భూమ్మీదే ఎక్కడో నువ్వూ ఊపిరి పీలుసున్నావు కదా అని సరిపెట్టుకుంటాను. నా గురించి నువ్వు చనిపోవడం భరించలేను --" అన్నాను.
    అప్పుడు నేనదోలా నవ్వితే -- "ఎంత అమాయకంగా నవ్వుతావు నువ్వు? ఈ నవ్వు రోజూ చూసే అదృష్టం నాకు లేదు గదా!" అని వాపోయింది సుగుణ.
    అప్పుడు నేను పూర్తిగా సుగుణను మోసగించాను. ఆమె మీద నాకు ప్రేమ లేదు, అభిమానం లేదు. ఆమెను కోల్పోతున్నానన్న బాధ లేదు, ఆమెతో నా అవసరం తీరింది. ఆమెను మరిచిపోవడానికి సిద్దంగా వున్నాను కానీ అలాంటి పరిస్థితుల్లో కూడా సుగుణ క్కూడా అనుమానం రానంత అమాయకత్వాన్ని నేను ముఖంలో ప్రదర్శించగలిగానంటే నా నటన తిరుగులేని దన్న నమ్మకం కలిగింది.
    ఆడపిల్లల్ని మోసం చేయడానికి నా నటనా శక్తి బాగా సహకరిస్తోంది. ఇప్పుడు పద్మావతి కూడా నా నవ్వు , పలకరింపు చూసి సమ్మోహితురాలయిందంటే అది నా అదృష్టం . ఎందుకంటె ఇంతవరకూ నా జీవితంలోకి వచ్చిన ఆడపిల్లలందరిలోకి పద్మావతీ అందమైనది.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS