Previous Page Next Page 
వసుంధర కధలు-10 పేజి 8

 

                            చిత్రమైన ఖైదు

                                                                వసుంధర

    ఇంటర్వ్యూ గదిలో చాలా మందే ఉన్నారు. ఉన్నవారిలో యువకులూ, యువతులూ కూడా ఉన్నారు. చూడ్డానికి అందరూ మిసమిసలాడి పోతున్నారు ఆరోగ్యంతో.
    మొట్ట మొదటిసారిగా లోపలికి వెళ్ళి వచ్చి నతన్ని చాలామంది చుట్టూ ముట్టి - "ఏమడిగారు ?" అన్నారు.
    "నా బొందలా ఉంది ఇంటర్వ్యూ . నా గురించి , తలిదండ్రుల గురించి చుట్టాల గురించి, సంసారం స్థితి గతుల గురించి అడిగారు. ఇంటి పేర్లు - కులం, గోత్రం - వగైరా ప్రశ్నలు చాలా వేశారు. జనరల్ నల్దేజ్జి కి సంబంధించిన ఒక్క ప్రశ్న కూడా లేదు -- ' అని వెళ్ళిపోయాడతను.
    అక్కడున్న అందరూ వెంటనే తమ బంధువులను వారి ఇంటి పేర్లనూ, గోత్రాలనూ గుర్తు చేసుకోవడానికి ప్రయత్నించారు.
    ఉమ నంబరు పదమూడు. కొంతమంది ఆ విషయమై ఆమె పై సానుభూతి చూపిస్తే -- "నాకలాంటి నమ్మకాలు లేవు" అని లోపలకు వెళ్ళింది.
    లోపల ఓ యాభై ఎళ్ళాయన కూర్చున్నాడు. ఉమను చూస్తూనే పలకరింపుగా నవ్వి - ఆమె ఇంటి పేరు , కులం గోత్రం - అడిగాడు. ఆమె చెప్పింది. అయన సంతృప్తిగా తలాడించి - "నీకు తలిదండ్రులు లేరు కదూ -- ఎవరి వద్ద ఉంటున్నావు?" అనడిగాడు.
    "మా మామయ్య గారింట్లో ఉంటున్నాను. ఉద్యోగం దొరికితే వాళ్ళకు నా బాధ్యత చాలావరకూ తప్పుతుంది -" అంది ఉమ.
    "నీకు మెడికల్ ఎగ్జామినేషన్ ఉంటుంది. రిపోర్టు సక్రమంగా ఉంటె నువ్వు సెలక్టయినట్లే. నెలకు ఆరువందల జీతం -" అన్నాడా ముసలాయన.
    "మెడికల్ ఎగ్జామినేషన్ ఎప్పుడు?" అంది ఉమ.
    "ప్రిలిమినరీ ఇప్పుడే -" అంటూ ముసలాయన బల్ల మీద గంట మోగించాడు. మెడలో స్తేతస్కోప్ ఉన్న సుమారు నలభై అయిదేళ్ళ స్త్రీ వచ్చి ఆమెను లోపలకు తీసుకు వెళ్ళింది.
    పది నిమిషాల్లో ఉమ , లేడీ డాక్టరు తిరిగి వచ్చారు. లేడీ డాక్టరు అంతా తృప్తికరంగా ఉన్నట్లు ముసలాయనకు చెప్పి వెళ్ళిపోయింది.
    ముసలాయన ఉమా వైపు చూసి - "నువ్వు సెలక్టయ్యావు. ఈ సంగతి బయట మాత్రం చెప్పకు. మీ ఊరు వెళ్ళి విషయం మీ వాళ్లకు చెప్పి తిరిగి నేను చెప్పిన చిరునామాకు తిరిగిరా"- అం టూ అయన ఆమెకో కాగితాన్నిచ్చాడు. ఆ కాగితం మీద ఉమ ఉద్యోగానికి ఎక్కడ చేరవలసింది వివరాలున్నాయి.
    ఉమ అక్కణ్ణించి కదల బోతుండగా - "పెళ్ళైన వాళ్లీ ఉద్యోగానికీ పనికి రారు. ఉద్యోగమై నాక పెళ్ళి చేసుకోవచ్చును. ఉద్యోగంలో చేరే ముందు మళ్ళీ మెడికల్ ఎగ్జామినేషన్ ఉంటుంది. ఈ విషయం గుర్తుంచుకో -" అన్నాడు ముసలాయన.
    ఉమ ఆయనకు నమస్కరించి అక్కణ్ణించి వెళ్ళిపోయింది.
    ఉమ వెళ్ళేక అయిదో నెంబరు బలరామ్ ది.
    బలరామ్ ని కూడా ఉమ నడిగినట్లే ప్రశ్న లడిగాడు ముసలాయన. అతని జావాబు లాయనకు సంతృప్తిని కలిగించాయి.
    "నీకు తలిదండ్రులు లేదు గదా - మరెక్కడ ఉంటున్నావ్?"
    "వారాలు చేసి చదువుకున్నాను నేను. స్నేహితుల ఆదరణ తో బ్రతుకుతున్నాను." అన్నాడు బలరామ్].
    "ఉద్యోగమిస్తే వెంటనే వచ్చి చేరగలవా ?"
    "రెక్కలు కట్టుకుని వాలతానండి ."
    ముసలాయన బల్ల మీది గంట మ్రోగించాడు. మెడలో స్టెతస్కోప్ వేసుకున్న ఓ నడి వయస్కుడక్కడికి వచ్చి బలరాం ని లోపల గదిలోకి తీసుకువెళ్ళి పది నిముషాల్లో తిరిగి వచ్చి -- అంతా సంతృప్తి కరంగానే ఉన్నట్లు చెప్పాడు.
    ముసలాయన డాక్టరు వెళ్ళిపోగానే - "నువ్వు సెలక్టయ్యావు. నీ ఊరికి వెళ్ళి చెప్పవలసిన వాళ్ళకు చెప్పుకుని సరాసరి నేను చెప్పిన అడ్రసుకు వచ్చేసి ఉద్యోగంలో జాయిను కావాలి. ఆరంభం లో నెలకు అరువందలు. ఇష్టమేనా?" అన్నాడు.
    "మీకు చాలాచాలా థాంక్సు ...." అన్నాడు బలరాం.
    "థాంక్స్ సంగతి అలా ఉంచు. ఆరోగ్యం నాకు చాలా ముఖ్యం. అనారోగ్యంగా ఉన్నవాళ్ళను నేను ఉద్యోగంలో ఉంచుకోను. నిన్నుద్యోగంలో చేర్చుకున్న రోజున మళ్ళీ మెడికల్ ఎగ్జామినేషన్ ఉంటుంది...." అన్నాడు ముసలాయన.
    బలరాం ఉత్సాహంగా అక్కణ్ణించి వెళ్ళిపోయాడు.

                                    2
    "వెరీ గుడ్! చాలా ప్రాంప్ట్ గా వచ్చేశారు. ఆరోగ్యం కూడా బాగా మెయింటైన్ చేశారు" అన్నాడు ముసలాయన.
    "ఇంటర్వ్యూ ఒక వూళ్ళో వుద్యోగం ఇంకో వూళ్ళో " అన్నాడు బలరాం నెమ్మదిగా. ఈ తంతంతా అతనికి ఆశ్చర్యంగా ఉంది.
    "మీవంటి వాళ్ళ కోసం నేను చాలా కాలంగా ప్రయత్నిస్తున్నాను. నాకు చాలా ముఖ్యమైన పని ఒకటి మీ కారణంగా జరగాలి" అన్నాడు ముసలాయన.
    బలరాం, ఉమ ఒకరి వంక ఒకరు ఆశ్చర్యంగా చూసుకున్నారు. ఆనాడు జరిగిన ఇంటర్వ్యూ లో సెలక్ట యిన తామిద్దరూ అన్నమాట.
    ముసలాయన వాళ్ళిద్దరి ముందు రెండు పుస్తకాలు పెట్టి ఇవి నాపద్దు పుస్తకాలు. వీటిలో కూడికల్లో ఎక్కడయినా తప్పులున్నాయేమో చూడండి...." అన్నాడు.
    ఓ క్షణం ఆగి -" ఈ పూటకు ఇదే మీ డ్యూటీ --" అన్నాడు.
    "బలరాం ,ఉమ ఇద్దరూ చెరో పుస్తకాన్ని అందుకుని చూడ్డం మొదలు పెట్టారు. ప్రతి పేజీలోనూ కొన్ని అంకెలున్నాయి. చివర వాటిని కూడగా వచ్చిన సంఖ్య వుంది. ఇద్దరూ శ్రద్దగా అ కూడికలు మళ్ళీ చేయసాగాడు. అక్కడక్కడ కొన్ని పేజీలలో తప్పులున్నాయి.
    ఆ పుస్తకం పూర్తీ చేయడానికి బలరాం కి గంటన్నర పట్టింది. ఆ తర్వాత పది నిమిషాలలో ఉమ కూడా పని పూర్తి చేసింది. వాళ్ళు చెప్పిన తప్పొప్పుల వివరాలు ముసలాయన తన జేబులో వున్న కాగితంలో చూసి సరి పోల్చుకుని సంతృప్తిగా తలాడించి "మీకు పని శ్రద్ధ బాగానే ఉన్నదనుకోవాలి. మీరిద్దరూ నాకు బాగా నచ్చారు" అన్నాడు.
    కాసేపు విశ్రాంతి తీసుకోమని చెప్పి ముసలాయన గదిలోంచి వెళ్ళిపోయాడు. బలరాం, ఉమ ఇద్దరూ గదినే పరిశీలించి చూస్తున్నారు.
    మామూలు డ్రాయింగు రూమ్ లాగున్నది తప్పితే అది ఆఫీసు గదిలా లేదు. ఇద్దరి మనసుల్లోనూ రకరకాల ప్రశ్నలు తిరుగుతున్నాయి.
    ఈ ముసలాయన ఎవరు? తాము చేయదలచుకున్న ఉద్యోగం ఏమిటి? ఆ ఉద్యోగానికి తమ ఆరోగ్యానికీ సంబంధం ఏమిటి? ఉద్యోగం లోకి తీసుకునే ముందాయన కులం గోత్రం అడిగాడు. వాటి ప్రాముఖ్యత ఏమిటి? ముందు ముందు ముసలాయన తమ కెటువంటి బాధ్యతలు అప్పగించబోతున్నాడు?
    ఇద్దరి బుర్రల్లోనూ ఒకేరకం ప్రశ్నలు తిరుగుతున్నప్పటికీ ఇద్దరూ ఒకరితో ఒకరు మాట్లాడుకోలేదు. విచిత్రంగా ఆ గదిని పరికిస్తూ ఏవేవో ఆలోచిస్తూ అలా కూర్చుండిపోయారు. వాళ్ళిద్దరూ కనీసం ఒకరికేసి ఒకరు అయినా అట్టే చూసుకోలేదు.
    సుమారు గంట అనంతరం ముసలాయన లోపలకు వచ్చి "చాలా విచిత్రమైన మనుషుల్లా వున్నారే మీరు! నేను వచ్చేసరికి ఒకరితో ఒకరు మాట్లాడుతుంటారనుకున్నాను" అన్నాడు.
    ఇద్దరూ ఆయన్ను చూస్తూ లేచి నిలబడ్డారు.
    ముసలాయన తన డ్రాయరు సొరుగు లాగి వాళ్ళిద్దరికీ రెండు ఆల్బమ్స్ , ఒక పెద్ద కవరూ ఇచ్చి "దీన్నిండా ఫోటోలున్నాయి. కొన్ని ఆడవాళ్ళవి, కొన్ని మగవాళ్ళవి . వేరు చేసి ఒకరు ఆల్బం లో మగవాళ్ళ ఫోటోలు, ఇంకోకళ్ళు ఆడవాళ్ళ ఫోటోలు అంటించండి" అన్నాడు.
    ఆ కవర్లో వున్నవన్నీ సినిమా యాక్టర్ల ఫోటోలు. ముసలాయన దగ్గర ఏమీ పనిలేదనీ ఏదో విధంగా తమను ఎంగేజ్ చేయడానికి ప్రయత్నిస్తున్నాడని ఇద్దరకూ అర్ధమైంది. ఏదేమైనా చెప్పిన పని చేయడం తమ ధర్మం కాబట్టి, ఇద్దరూ ఆ పని మొదలు పెట్టారు. అయితే వాళ్ళిద్దరూ ఒకరితో ఒకరు మాట్లాడుకోవడం లేదు. ఆల్బం పని పూర్తికావటానికి సుమారు గంట పట్టింది.
    "మీకు నీతి నియమాల పైన నమ్మకముందా?" అనడిగాడు ముసలాయన.'    
    "యువతీ యువకుల విచ్చలివిడి జీవితం పై మీమీ అభిప్రాయా లేమిటి?" ముసలాయన ఇంకో ప్రశ్న వేశాడు.
    "నాకేమీ తెలియదు. ఇలాంటి విషయాల్లో అభిప్రాయాలు చెప్పే తెలివితేటలు నాకు లేవు" అన్నాడు బలరాం.
    "మీ ప్రశ్నలు నాకు సరిగ్గా అర్ధం కాలేదు..." అంది ఉమ.
    ముసలాయన ఆమె వంక ఆశ్చర్యంగా చూశాడు. పదిహేడేళ్ళ ఉమ ముఖం చాలా అమాయకంగా కనబడుతోంది. ఆమె పక్క నిలబడ్డ ఇరవయ్యేళ్ళ బలరాం కళ్ళలో చెప్పుకోదగ్గ అనుభవాలు కనబడడం లేదు.
    "ఇంతకాలమూ జీవన పోరాటంలో ఉండిపోయిన మీకు ఇతర విశేషాల మీద దృష్టి మళ్ళ లేదంటే పెద్ద ఆశ్చర్యం లేదు. కానీ మారినప్పుడు సంపాదన పరులయ్యారు. జీవితమంటే ఆకలి, నిద్ర ఈ రెండే కాదని తెలుసుకోవడానికి ఎంతో సేపు పట్టదు మీకు" అన్నాడు ముసలాయన.
    తర్వాత అయన ఒక ప్లాస్కు లోంచి కాఫీ రెండు కప్పుల్లో పోసి ఇద్దరికీ ఇచ్చాడు. వాళ్ళు కాఫీ తాగుతుంటే అయన ఇద్దరి వంకా చూస్తూ కూర్చున్నాడు.
    కాఫీ తాగిన అయిదు నిముషాలకే బలరాం ఉమ లిద్దరికీ నిద్ర ముంచుకు వచ్చేసింది. కోర్చున్న వాళ్ళు కుర్చున్నట్లుగా పడిపోయారు.
    ముసలాయన ఇద్దర్నీ సమీపించి కదిపి చూసి సంతృప్తిగా తలాడించాడు.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS