Previous Page Next Page 
జీవన సంగీతం పేజి 8


    "గోకుల్ ఉండగా నాకు పిల్లనిచ్చేవాడు ఎవడక్కా?" తేలిగ్గా నవ్వ ప్రయత్నించాడు.
    పెళ్ళి అంటేనే ఎగిరిపడే తమ్ముడు తను మాట్లాడడానికి ఈమాత్రం సందు ఇచ్చినందుకు సంతోషించింది కృష్ణప్రియ. "నువ్వు పెళ్ళి చేసుకోవాలనుకుంటే పిల్లనెవరు ఇవ్వరు?"
    "మామయ్య రాధను నా కివ్వకపోవడం అబద్ధమన్న మాట." పరిహసించాడు.
    "ఇప్పుడా విషయాలు గుర్తు తేవడం దేనికి? ఇప్పటి మాట చెబుతున్నాను. నువ్వు వివాహానికి అంగీకరించు; నిన్నొక ఇంటివాణ్ణి చేసే బాధ్యత నాది."
    గోకుల్ కు నిద్రకళ్ళు పడడంచూచి అతడిని పడుకోబెట్టి జోకొడుతూన్న కల్యాణి జవాబు ఇవ్వలేదు.
    "ఏం? చెప్పవూ, కృష్ణా?"
    "అంగీకరించడం తేలికే. కాని, గోకుల్ కు సవతి తల్లిని తెచ్చి పెట్టినట్లు ఎవతెనో తెచ్చి ఇంట్లో ఎలా ప్రవేశపెట్టను?"
    "సవతితల్లులు కూడా కన్నతల్లులలా చూచుకొనే వారు ఎందరు లేరు? బిడ్డల గీతనిబట్టి ఉంటుంది అది." కాస్సేపు మెదలకుండా ఉండి తిరిగి అంది, వాత్సల్యదృష్టి తమ్ముడిపై ప్రసరింపజేస్తూ: "బలవంతంగా కోరికలను అణుచుకోవడం ఆత్మహింస చెయ్యడమే అవుతుది. అది ఆత్మహత్యాదోషానికి తీసిపోదు. రూపమీద నీ మనస్సు పడిందని తెలుసు. వ్యర్ధ మైన విగ్రహాలకుపోయి హృదయాన్నెందుకు నలిపేసుకుంటావ్, కృష్ణా?
    "రూప నీ ఇల్లాలు కావాలని నేను మనసారా కోరుతున్నాను. రూప నీ ఇల్లాలయితే గోకుల్ కు సవతితల్లిని తెచ్చిపెట్టినట్టుకూడా కాదు. వాడిమీద ఆమెకు ఎనలేని ప్రేమాభిమానాలు. గోకుల్ ను ప్రేమగా చూచుకుంటుంధనడంలో సందేహం లేదు. ఏ సంగతే చెప్పు. స్పష్టంగా, హృదయపూర్వకంగా ఈ అంగీకారం తెలిపితే నాకు రూపను అడగడానికి వీలు ఉంటుంది."
    ఏదో స్వార్ధప్రలోభానికి లోబడిపోతూ గోకుల్ కు ఏదో అరిష్టాన్ని సృష్టిస్తున్నానేమో అన్న సంకోచం కలతపెట్టింది కళ్యాణ్ ను.    
    "ఏమో, కృష్ణక్కా! పెళ్ళంటే ఎందుకో భయంగా ఉంది. స్థానమూ, పాత్రా మార్పు చెందినప్పుడు మనిషి లోనూ మార్పు వస్తూంటుంది. రూపకు గోకుల్ మీద ఇప్పుడు ఉన్న ప్రేమ నా భార్యగా ఉండకపోవచ్చు. ఇంతోఅంతో ఉన్నా తన కడుపు ఫలించితే పూర్తిగా మాసిపోవచ్చు. గోకుల్ కు నా దగ్గిర స్థానం లేకుండానే చెయ్యవచ్చు. నేను చూస్తూ గోకుల్ కు కష్టాలు తెచ్చిపెట్టినట్లు అవుతుంది."
    "అర్ధంలేని అనుమానాలతో, దుశ్శంకలతో జీవితాన్ని వ్యర్ధపుచ్చుకోవద్దు, కృష్ణా." ప్రేమపూర్వక మైన కట్టుస్వరంతో అంది కృష్ణప్రియ." అసలు రూప అటువంటిది కాదు. ఒకవేళ గోకుల్ దురదృష్టం కొద్దీ ఆమె అభిమానాన్ని కోల్పోతే, నేను లేనా? నేను తీసికెళ్ళి రాజాలా పెంచుతాను. ఇంకెందుకు నీకు విచారం?"
    "ఎల్లాగైనా గోకుల్ ను కొట్టె య్యాలని నీ ఎత్తు!" నవ్వాడు. "అందుకేనా నేను గోకుల్ ను పెంచుతున్నది? గోకుల్ నాకు కాకుండాపోయె పరిస్థితిలో నాకు వివాహం అక్కర్లేదు: స్వర్గం అక్కర్లేదు."
    "అలా జరగదనే అంటున్నానుగా? రూప సార్ధక నామధేయురాలు. విద్యావతి సంస్కారవతి. ఆమెవల్ల గోకుల్ అదృష్టం వక్రించదనే చెబుతున్నాను, దృఢంగా. ఆమెను తొలిసారి చూడడంతోటే పరాయిదానిగా ఉంచరాదన్న ఊహ కలిగింది నాలో. మన కుటుంబంతో ఆమె స్నేహపరిచయాలు పెంచి మన కుటుంబంలో కలుపుకోవాలన్న ఎత్తుతోటే ఆమె ఇంటికి రాకపోకలు సాగించాను. గోకుల్ పుట్టినరోజుపండుగకు ఆహ్వానించడానికి వెళ్లాను తొలిసారిగా. తోటలో నువ్వు చేసిన ప్రాయశ్చిత్తం వివరించింది. 'చెయ్యరానితప్పు నేనేం చేశానని డాక్టరు నన్నంత క్రూరంగా శిక్షించి బాధించారు?' అంది కన్నీళ్లు పెట్టుకొని.
    "నా గుండె చెదిరిందనుకో, రూపచెప్పిన విషయం వినేసరికి. గోకుల్ ప్రపంచంలో పడి వెర్రిమానవుడననిపించుకొనేట్లుందే అనుకున్నాను. నువ్వీమాత్రం మార్పు చెందడం శుభపరిణామంగా భావిస్తున్నాను, కృష్ణా. ఇందులో రూపచలన ఎంతో ఉంది. ఇవాళ ఆమె తల్లితండ్రులనుగురించీ, ఇంటివిషయాలూ తెలుసుకొన్నాను. మన ఊరి సుభద్రమ్మగారి కూతురు రత్నను రూప అన్నకు ఇచ్చారట. సుభద్రమ్మగారికీ మనకీ దూరపు చుట్టరికం ఉంది.
    "తనకేమో వివాహేచ్చ లేదంటుంది రూప. తల్లిదండ్రులేమో పెళ్ళి చేసుకోమని ఒకటే పోరుతారట. అక్కడ ఉంటే ఈ బాధ అని ఉద్యోగం నెపంతో ఇక్కడ ఉందిట. తల్లి తనదగ్గిర ఉంటే రోజూ పెళ్ళి ప్రసక్తి తెస్తుందని ఆమెను బలవంతంగా సంపేసిందట. ఆమె మాటలవల్ల ఉన్నత వంశస్థులనీ, కలవారనీ తెలుస్తున్నది, అన్నివిధాలా బాగుంటుంది. రూపను చేసుకోవడం. ఇక నీ సంగతి చెప్పు."
    "తనకి వివాహేచ్చ లేదని చెప్పినప్పుడు, మరి నీ ప్రయత్నాలేమిటి?"
    "ఆఁ! రాజకుమారుడి దర్శనమయ్యేవరకే రాకుమారి ప్రతిజ్ఞ. ఆమె వస్తే మరీ శకుడిలా కూర్చోకుండా కొంచెం చనువుగా..." పక్కున నవ్వింది.
    కళ్యాణ్ కూడా శ్రుతి కలుపుతూ "కొంచెం చనువుగా..." అన్నాడు సాగదీస్తూ.
    "అది ఇంక నువ్వు చూచుకోవలిసిన విషయం" అంటూ లేచింది.
    "పద, భోజనానికి." నిదురిస్తూన్న గోకుల్ మీదికి రగ్గు లాగి లేచాడు కళ్యాణ్.
    
                            *    *    *

    హాస్పిటల్ నుండి వచ్చి ఇంకా కారుదిగనేలేదు కళ్యాణ్ ఎప్పుడో వచ్చిన రూప ఇంట్లో నుండి వచ్చింది. "గుడ్ నైట్, డాక్టర్" అంటూ. "రేపు నా పుట్టిన రోజు. తప్పకుండా రావాలి మీరు. వంటావిడ రోగంవచ్చి ఇంట్లో పడింది; కనక స్వయంపాకమే. నాచే పెట్టబడు పిండివంటకంబులు ఆరగించి భుక్తాయాసం వెంటబెట్టుకొని పోవచ్చు. ఉదయమే రావాలి." గలగలా నవ్వేస్తూ కదిలింది.
    తన ఎదట ఏదో మెరుపు మెరిసి మాయమై నట్లయింది, రూప కనుమరుగు కాగానే. పోతూ దారిలో మెరుపు తునకలేమైనా పారేసిపోయిందేమో అన్నట్లు ఆమె పోయినవైపు అలాగే చూస్తూ కూర్చున్నాడు. 'ఓహోహో! ఏమా లావణ్యం! ఏమా చిలిపి సింగారం! నిలువల్లా కవ్వింపు బంగారమే పెట్టుకొని తనకు వివాహేచ్చ లేదంటే ఎంత అన్యాయం మగాడికి! అలాంటిది ఏ ఎడారిలోనో కాపురం పెట్టుకొంటే బాగుండును!'
    "కృష్ణా, రేపు చూచుకోవాలి, చూడు." అతడు ఇంట్లోకి రాగానే చిరునవ్వుతో హెచ్చించింది కృష్ణ ప్రియ.
    చిరుహాసంచేసి గదిలోకి వెళ్ళిపోయాడు కళ్యాణ్.

                                    6

    వర్షర్తువు అంత్యదినాలు. బరువైన హృదయంతోధాత్రినుండి వీడ్కోలు తీసుకొంటున్నాడు వరుణుడు. 'నువ్వు వచ్చేసరికి మన చిన్నిపాపతో నేనే స్థితిలో ఉంటానో?' అన్నట్లు ఫలపుష్పభరితమైన తన ఒడి పంట ప్రకృతితో దిగులుగా పతిదేవుని పరిష్వంగంలో ఒదిగిపోయింది ధరణిమాత.
    ఇంకా చిరుచినుకులు పడుతూనే ఉన్నాయి. 'పద పద' అన్నట్లు సూర్యభగవానుడు తన కిరణజాలంతో వరుణుని తరమసాగాడు. తల్లి ఒడులనుండి ఓరగా తొంగిచూస్తూన్న సుమకన్నెలను సున్నితంగా స్పర్శించసాగాడు. తడిసిన తమ రెక్కలను తపతప విదిలించుకొని తరుశాఖలనుండి ఎగిరిపోతున్నాయి పక్షులు.
    అభ్యంగనస్నానం చేసిన రూప వరండా మెట్లమీద కూర్చొని ఉంది, లేతఎండకు తల ఆరబెట్టుకొంటూ. గేటులో ప్రవేశించి ప్రహరీపక్కగా ఆగిన కారునుండి గోకుల్ తొడిగాడు కల్యాణచక్రవర్తి. లాల్చీ, పంచకట్టూ అతడి బలిష్ట సుందరివిగ్రహానికి చక్కని హుందాఇస్తున్నాయి. ఎల్లప్పుడు ధరించే కళ్ళజోడు అతడి ముఖానికి ఎంతో బాగుంటుంది. భుజంమీద వేసుకొన్న జరీ అంచు ఉత్తరీయం పెద్దరికానికి చిహ్నంగా రెపరెపలాడుతూండగా గోకుల్ ను భుజ మీదికి ఎత్తుకొని రాజసం ఒలుకుతున్నట్లు ఠీవిగా నడిచివస్తున్నాడు, ఆగి ఆగి ఇంటిముందు చక్కగా పెంచిన తోటపరికిస్తూ.
    దారిపక్కన గులాబీకొమ్మపై అరవిచ్చిన పువ్వు కోయబోయాడు గోకుల్, బాల్యచాపల్యంతో. కళ్యాణ్ చటుక్కున చెయ్యిపట్టి వారించాడు, "కోయకూడదు, నాన్నా" అంటూ.
    రూప ఎదురుగా వచ్చి గోకుల్ ను ఎత్తుకొంది. "చెట్టుమీది పువ్వులు కోయకూడదు, బాబూ. చెట్టుమీద ఉంటేనే అందంగా ఉంటాయి. చూసి ఆనందించాలి. కోయకూడదు. కోస్తే ఏముంది? క్షణంలో వాడిపోతాయి." ఏదో ధర్మసూక్ష్మాన్నీ జీవిత సత్యాన్నీ స్ఫురింపజేసే ఆమె మాటలు ఆ పసిహృదయం ఏం గ్రహించగలదు?


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS