Previous Page Next Page 
శ్రీ శ్రీ కథలు పేజి 8


                              శూర్పణఖా మాన సంరక్షణం
    
    శ్రీశ్రీ అన్నాడు నారాయణబాబు.
    ఆఁ అన్నాను నేను లేక ఊఁ అన్నానో ఏదో అన్నాను.
    వింటున్నాను. అనే అర్ధం ఉద్దేశించి
    వింటున్నావా? అన్నాడు నారాయణబాబు.
    
    నా మూలుగు  అర్ధం కాలేదన్నమాట. బోధపడేటట్టు
    మూలగలేక పోయానేమో? కాని, చిత్రం! మళ్ళీ అదే
    మూలుగుతో జవాబిచ్చాను వింటున్నాననే అర్ధం వచ్చింది.
    రెండోమాట్లో ఉంటుంది కాబోలు మజా.
    
    నీమీద ఊళ్ళో పుకారుగా ఉందన్నాడు.
    ఏ ఊళ్ళో?
    ప్రస్తుతం ఈ ఊళ్ళోనే వింటున్నావా?
    వింటున్నాను అన్నాను ఈసారి స్పష్టంగా ఆఁ అనో ఊఁ అనో అనకుండా.
    నువ్వు చెబుతున్నది వింటున్నానని నా ఉద్దేశం. నామీద పుకార్లు అప్పుడే నా చెవిలో పడ్డాయని అర్ధం చేసుకున్నాడు నారాయణబాబు.
    ఒక అరనిమిషం నిశ్శబ్దం.
    తాను చెప్పదలచుకున్న సంగతి అప్పుడే నాకు తెలిసిపోయిందని ఆశాభంగం కలిగింది నారాయణబాబుకి నామీద చాలా ఘోరమైన నిందలు వ్యాపించాయి కాబోలు. చెప్పడానికి సందేహిస్తున్నాడనుకున్నాను నేను.
    వినలేదు, అన్నాను నేను......
    అయితే మరి వింటున్నానని ఎందుకన్నావు?
    చచ్చాను (బతికే ఉన్నాను లెండి) నాకేమనాలో తోచలేదు. నా మౌనం అర్ధమయింది నారాయణబాబుకి.
    నా గురించి ఎవరు ఏమనుకున్నా నాకు లక్ష్యం లేదు. ఏమీ అనుకోకపోతేనే బాధపడతాను నేను నరమాంసం భక్షిస్తానన్నా రహస్యంగా రక్తం తాగుతానన్నా సరే అలాకూడా అనుకోవచ్చు ననేస్తాను అంతే!    
    అయినా కాస్త ప్రజలేమనుకుంటున్నారో కనుక్కోవడం మంచిదని ఏమనుకుంటున్నా రేమిటన్నాను.
    నువ్వు మెటీరియలిస్టువనీ, అథీయిస్టువనీ, అనార్కిస్టువనీ అంటున్నారు.
    నాకు కోపం వచ్చింది. అవి నేనంటున్న మాటలే వాళ్ళనడ మేమిటి?
    నాకేమీ కోపం లేదన్నాను. నవ్వుతూ ఉంటే కళ్ళంట నీళ్ళొచ్చాయి. నవ్వెందుకంటే ఇవేవీ కాకుండా ఔనని అంటున్నా నేమో అని నిజానికిది దుఃఖించదగ్గ విషయం.
    దేవుడు నేనే కాదా? లేక నాకు దేవుడు లేదా? పురాణాలు వదులుకోవాలా?
    ఆరాజకత్వమంటే అల్లకల్లోలమా? అధిభౌతికంగా తర్కించకూడదా?
    అయితే అన్నీ అదిభౌతికంగానే ఆలోచిస్తున్నామా?
    ఇటువంటి ఆలోచనల మధ్య హఠాత్తుగా స్ఫురించింది కథ.
    వింటున్నావా?
    ఈ మాట నేనన్నాను. ఆఁ అనో ఊఁ అనో జవాబుగా మూలిగాడు నారాయణబాబు.
    శూర్పణఖా మానసంరక్షణం అన్నాను.
    అంటే?
    అంతే పౌరాణిక కథ.
    సాంఘిక కథలంటే విసుగొచ్సిందా? లేక ప్రజామోదాని కనుగుణ్యంగా అభిప్రాయాలు మార్చుకొంటున్నావా అన్నాడు.
    సంఘం అనకు ప్రజలంటే ఒప్పుకుంటాను. ప్రజలనగా గవర్నరు నుంచి గవరయ్యదాకా అందరూ ప్రజలే. కాని గవర్నరు సంఘం వేరు. గవరయ్య సంఘం వేరు. సాంఘిక రచనలు ప్రజామోదం పొందకపోవడానికి కారణం ఇదే. అలాగే సాంఘిక చిత్రాలు కూడా! మనకు పొడుగాటి పౌరాణిక చిత్రాలే కావాలి. అందుకు తగ్గ కథలే మనం రాసుకోవాలి. పేరు కూడా పొడుగ్గా ఉంచాను గమనించావా?
    పురాణకథనైతే ఇక నువ్వు వ్రాసే దేముంది?
    స్వకపోల కల్పితమైన పురాణ కథ. ఇది మొదటి అసంధర్భం. అసందర్భాలు మెదడుకి మెరుగుపెడతాయి. పెంచడానికీ, త్రుంచడానికీ అపరిమితమైన అవకాశం ఉంటుంది. అనవసరమైనది లేనట్టే అసాధ్యమైనది కూడా ఉండదు.
    శూర్పణఖా మానసంరక్షణ మేమిటి నీ మొగం?
    ఏం? ఏం చేతా? శూర్పణఖ రాక్షసి అయితేనేం? అది నరమాంసం భక్షిస్తేనేం? తాటికల్లు మొదలు మనుష్యరక్తం దాకా దొరికినవన్నీ తాగేస్తేనేం? శూర్పణఖకు మాత్రం మానం లేదా? దాన్ని సంరక్షించడం ఉత్తమాదర్శం కాదా?
    శూర్పణఖ తనకు మానభంగం చెయ్యవలసిందనే రాములవారి నడిగింది. అలా చెయ్యకపోవడమే మాన సంరక్షణం కాక అదే మానభంగమా? గట్టి చిక్కుతెచ్చి పెట్టావు. కేవలం హేతువాదంతో చర్చించి తేల్చుకోవలసిన సమస్య కాదు. లక్ష్మణుడు కూడా నిరాకరించాడు. అప్పటికి వానరసైన్యం మిత్రమండలిలో చేరలేదు.
    చేరినట్టు కల్పించకూడదా?
    అసందర్భాలకు కూడా ఒక సందర్భం ఉంది. నమ్మడానికి వీలులేని అపనమ్మకాల నెవ్వరూ నమ్మరు. పీపిల్సు పార్కును దండకారణ్యమని అనుకోవచ్చు గాని హనుమంతున్ని శ్రీరాముడనుకోవడం కష్టం!
    కష్టమే కాని అసాధ్యం కాదు నీ కథలో కూడా అసాధ్యాలుంటాయా? ఉండకూడదు. ఉండడానికి వీలులేదు. శూర్పణఖకు ఖరదూషణాదులవల్ల మానసంరక్షణం జరిగిందని ఋజువుచేస్తున్నాను. కామరూపిణి అయిన శూర్పణఖ ఇంటర్వెల్ దాకా అందంగా కనబడుతుంది. తరువాత వికారంగా మారిపోతుంది. మధ్యమధ్యకూడా మారవచ్చును. కథానాయిక పాత్ర ధరిస్తున్న నటి జబ్బుపడ్డా, దగాచేసినా, పిచ్చెత్తిపోయినా, ప్రొడ్యూసర్లు భయపడనక్కరలేదు. కాస్టింగ్ డైరెక్టర్లు నిద్రాహారాలు మాని పాత్రకు సరియైన వ్యక్తికోసం దేశమంతా గాలించ నక్కరలేదు.
    నారాయణబాబు ఆదరిస్తా కాగితాలూ కలం నాముందు పడవేసి నోటిని చెప్పడం కాదు. సంభాషణలతో సహా కథ తయారు చేసెయ్యమన్నాడు. పాటలు తర్వాత అతుక్కోవచ్చు నన్నాడు. సాయంత్రం సరికి కథ రాసి వాడి దగ్గరే ఉంచేశాను.
    నాలుగురోజులు పోయాక నారాయణబాబు ఉప్పొంగిపోయిన తోలు సంచీతో తంబుచెట్టివీధి చైనా బజారు వీధిలో కలిసిపోయేచోట కనిపించాడు.
    కక్షే కిం తప? అన్నాను అనుమానిస్తూనే.
    ప్రచురణ కిచ్చేద్దామని తెచ్చానన్నాడు.
    నయం నేను సమయానికే వచ్చానన్నమాట దీన్ని ఎంతమాత్రమూ బయట పెట్టడానికి వీలులేదు సుమీ వెండి తెరమీదనే ఇది కనబడాలి.
    ప్రకటిస్తేమాత్రం? అన్నాడు.
    ఇంకా పెరటిదారినే ఉన్నావు. పురాణకథలకు కాపీరైటు లేదు. కథ వ్రాయడానికి మనకెంత హక్కుందో దాన్ని ధారాళంగా స్వీకరించి ఫిలిం తియ్యడానికి అవతలివాళ్ళకి కూడా అంతే హక్కు స్టూడియో ఆవరణలోనికి కూడా మనల్ని రానియ్యరు.
    అయితే దాచేస్తా నన్నాడు.
    ఇప్పటికీ ఆ కథ అజ్ఞాతవాసంలోనే ఉంది.
    
                                                               ---౦౦౦---


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS