ఇన్ని కష్టాలు అనుభవిస్తున్నప్పటికి పువ్వులా నవ్వులు కురిపిస్తూ మేము తృప్తిగా వుండటానికి కారణం ఆప్యాయత అనే సన్నని దారం మమ్మల్ని అందరినీ 'సంసారం' అనే సుమహారం'లో బంధించి వుండటమే!
'నా' వాళ్ళు ఎవరూ నేను దూరమై ఈ ఉద్యోగం చెయ్యడానికి అంగీకరించలేదు. డబ్బు పాశంకన్నా ప్రేమపాశం గొప్పదని తెలుసుకుంటే సంతోషిస్తాను.
ధృతి
ఉత్తరం మడతపెట్టి రిసెప్షనిష్టు చేతికి ఇచ్చి "తప్పకుండా అందజెయ్యండి ప్లీజ్...." అంది.
వచ్చేటప్పుడు "ఏం వ్రాశావ్?" అని నవీన్ అడుగుతాడేమోనని కాసేపు ఎదురుచూసింది. అతను ఏం పట్టనట్లు సినిమా వాల్ పోస్టర్స్ చూస్తూ నడుస్తున్నాడు.
ఆమె ఇంకా ఆపుకోలేక "ఉత్తరంలో ఏం వ్రాశానో తెలుసా?" అని అడిగింది.
అతను తెలియదన్నట్లు తల అడ్డంగా వూపాడు.
ఆమె అక్షరం పొల్లుపోకుండా చెప్పి, మెరుస్తున్న కళ్ళతో-
"బావుందా?" అని అడిగింది.
నవీన్ ఓ నిమిషం ఆమెని గమనించి "అలా ఇంటి పరిస్థితులన్నీ వివరంగా వ్రాయకుండా వుండాల్సింది" అన్నాడు.
"ఏం? ఆర్ధిక అవసరాలు మనుషుల్ని దేనికైనా ఒప్పిస్తాయి అనుకునే ఆయన అభిప్రాయం తప్పు అని ఆయనకి తెలియజెప్పాలి కదా...." అంది కాస్త దర్బంగా.
కొత్త బొమ్మ కొనుక్కున్నప్పుడు మిగతా పిల్లలకి త్వరగా చూపించాలని ఆరాటపడే చిన్నపిల్ల పరిస్థితిలా వుంది ఆమె స్థితి!
నవీన్ ఇంకా తర్కించలేదు. సన్నగా ఈలవేస్తూ నడవసాగాడు.
* * *
"వరవీణా మృదుపాణి......వరరుహాలోచను రాణి...." అని పాఠం చెబుతోందే కానీ, ధృతి మనసు ఇంటిమీదే వుంది. ప్రొద్దుట బియ్యంలేక అన్నం వండలేదు. తమ్ముడు, చెల్లెలూ ఖాళీ కడుపులతోటే వెళ్ళిపోయారు. డాక్టర్ గారి భార్య నవ్వుతూ మాట్లాడుతుందే కానీ జీతం సంగతి ఎత్తడం లేదు. ఇంక తప్పదు! ఈ రోజు ధైర్యం చేసి అడిగేసెయ్యాలి అనుకుంది. నెలంతా పాఠంచెప్పి నెల చివర డబ్బులు అడగాలంటే ఎంతో ఇబ్బందిగా వుంటుంది. ఆ అవసరం కలగకుండా వారంతట వారు ఇచ్చేస్తే ఎంత బాగుంటుందీ అనుకుంది.
"వెళ్ళొస్తానండీ" అంది ధృతి ఆవిడతో.
"మంచిదమ్మా" అంది ఆవిడ పూలు గుచ్చుతూ.
"ఈ నెల జీతం ఇస్తే...." అంది శరీరంలోని శక్తులన్నీ కూడదీసుకుంటూ.
"ఓ..... ఇవ్వనేలేదు...కదూ...." అంటూ ఆవిడ లోపలికి నడిచింది.
ఆమె 'హమ్మయ్య' అనుకుంది.
ఆవిడ డబ్బు తెచ్చి ఇస్తూ "ఈ నెల మా పిల్లలు పదిరోజులు ఊరికి వెళ్ళారుగా, ఆ డబ్బులు కట్ చేసి యివ్వమన్నారు మావారు....." అంది.
ధృతి గుండెల్లో రాయి పడింది. నేలంతా కష్టపడితే వచ్చేది అరవై రూపాయలు! అందులో ఇరవై తగ్గించేసింది. కనీసం ధృతి ట్యూషన్ ఫీజ్ కి వస్తాయి అనుకుంది. అయినా వాళ్ళ పిల్లలు ఊరు వెళితే తన తప్పేమిటి? ఇదే లాజిక్ పనిమనిషితో ఉపయోగిస్తే తెలిసొస్తుంది ఈవిడకి.....! ఛీ ఛీ వెధవ మధ్యతరగతి బ్ర్తతుకులు! ఏమిచ్చినా, ఇవ్వకపోయినా పనికిరాని అభిమానం మాత్రం దండిగా యిస్తాడు భగవంతుడు. వారానికి పాతిక రూపాయలు కుక్కబిస్కెట్ల మీద ఖర్చు పెట్టే ధర్మాత్మురాలావిడ! ధృతి ఇంటి పరిస్థితులు తెలిసి కూడా ఈ విధంగా చెయ్యడంలో ఏదో శాడిజం కనిపించింది ఆమెకి. పైగా "మావారు అన్నారూ...." అంటూ సాగదీయటము కూడానూ! ఆయనగారికి ఇటువంటి విషయాల మీద మహా ఆరా అన్నట్లూ ఈవిడగారు ఆయనకి మహా ఒదిగిపోతున్నట్లూ నటన అనుకుంది కసిగా అసలు ఆ డబ్బులు తిరగ్గొట్టి 'రేపట్నించి మీ పిల్లలకి పాఠం చెప్పను' అని అరవాలని పించింది. అంతలోనే 'పేదవాడి కోపం పెదవికి చేటు' అని గుర్తొచ్చింది. తను మానేస్తే ఆవిడకేం నష్టం లేదు.....తనకి మాత్రం నష్టమే! స్వభావ విరుద్దమైన పనులు చెయ్యటం మనసుకి అగ్ని పరీక్ష పెట్టడం లాంటిదే అయినా, ఆ అవసరం అప్పుడప్పుడూ కలుగుతూనే వుంటుంది. మనుషుల వ్యక్తిత్వాలు తెలిపేది వారి హోదా కాదు. వారి ప్రవర్తన.
చాలా విసుగ్గా ఇంట్లోకి కాలు పెట్టిన ఆమెకి, ఇంటి వాతావరణం అంతకంటే చిరాగ్గా అనిపించింది.
"ఎన్నిసార్లు తిప్పిస్తావయ్యా! పిల్లలు కలవాడవని వూరుకొంటున్న కొద్దీ అలుసైపోయానే! రెండొందలూ మూడొందలూ కాదు, రెండు వేలైకూర్చుంది బాకీ. యాభైరూపాయలు నెలకొకసారి నా మొహాన కొట్టి, ఇదిగో తీరుస్తా, అదిగో తీరుస్తా, ఇంకేముంది మా అమ్మాయికి ఉద్యోగం వచ్చేస్తోంది అంటూ అబద్దాలు చెబుతావు. ఇంక నీ మాట నమ్మేది లేదు. బాకీ తీరిస్తేనే నేను గుమ్మం కదిలేది" అంటూ శివాలెత్తి, చిందులేస్తున్నాడు కిరాణా షాప్ ఓనర్.
ధృతి తల ఎత్తకుండా లోపలికి వెళ్ళిపోయింది.
"ఈసారి నిజంగానే చెపుతున్నానయ్యా! అమ్మాయికి మంచి ఉద్యోగం వచ్చింది. నెలకి మూడువేలు జీతం ఒట్టు! నీ మొత్తం బాకీ ఒకేసారి తీర్చేస్తాను. రెండు మూడు రోజులు ఆగిరా...." అంటూ బ్రతిమాలుతున్నాడు తండ్రి.
అతను నమ్మినట్టు లేడు. "ఇదే ఆఖరిసారి....ఈసారి తీర్చకపోతే వూరుకునేది లేదు" అంటూ వెళ్ళిపోయాడు.
అతని తప్పు మాత్రం ఏముందీ? చిన్న కిరాణా షాప్ పెట్టుకుని నడుపుకుంటున్నాడు. ఇంకో రెండు యిలాంటి బేరాలు దొరికితే దివాలా తియ్యల్సిందే కదా! మనుషులని అర్ధం చేసుకోవడం ప్రారంభిస్తే ఎవరూ చెడ్డవారుగా కన్పించరు. జరిగిన సంఘటనల గురించి ఆలోచిస్తూ నిస్త్రాణగా పడుకుంది ధృతి. అంతలోనే ఆమెకి చటుక్కున తండ్రి మాటలు గుర్తొచ్చాయి. "అమ్మాయికి మంచి ఉద్యోగం వచ్చింది. మూడు వేలు జీతం" అని ఎందుకు అబద్దం చెప్తారు? అలా ఆయన ఎప్పుడూ అబద్దం చెప్పగా తఃను వినలేదు. బహుశా మనుషుల అలవాట్లను పరిస్థితులు మార్చేస్తాయి కాబోలు!
