4
ఆవేశమనేది ప్రపంచం లో ఉన్న చాల చాల చెడ్డ గుణాలలో ఒకటి. ఆవేశమా వహిస్తే చాలు, మనిషి తనలోని మానవత్వాన్ని చంపుకొని దానవుడి గా మారడానికి కూడా వెనుదీయడు-- ఆ తర్వాత ఎంత పశ్చాత్తాపం చెందినా, చెందక పోయినా ఒకటే -- అందుకే ఆవేశ మనేది అంచు బాట కూడదు-- ఆవేశంలో తాను చేసిన పని వల్ల ఎంతమంది మానసికంగా, ఎంతమంది శారీరకంగా ,మరెంత మంది మరిన్ని విధాలుగా బాధపడ్డారో గ్రహించగలిగే -- కనీసం యోచించుకోగలిగే -- స్తోమత , శక్తి గూడ ఆవేశం హరిస్తుంది. అంతే! ఆ తర్వాత ఆకులూ పట్టుకున్న లాభం ఉందని స్థితి ఏర్పడుతుంది జీవితంలో.
ఖచ్చితంగా ఇందిరకు ఇదే అనిపించింది. సుందరి వచ్చి ఆ మాట చెప్పాక -- ఎంతపని చేశాడు రాంబాబు?
అయినా సుందరి చెప్పింది నిజమో కాదో ననే సందేహం తనలో తనకే తెలియక ఒక పక్క నుండి తలెత్తుతుంటే -- ప్రాణ స్నేహితురాలు ఏ విషయంలో నైనా -- ముఖ్యంగా ఇలాటి విషయాలలో -- పరాచికాలాడ గలిగే స్థితిలో ఉంటుందనుకోవడం తెలివి తక్కువ పని--
సుందరి తెల్లవారగానే వచ్చింది-- తనింకా నిద్ర నుండి లేవనైనా లేవలేదు -- బద్దకంగా పడుకొని ఉంది పక్క మీద. అది నిద్రాకాదు, పూర్తిగా లేచి ఉన్నట్టూ కాదు. అపుడు వినిపించింది సుందరి మాట -- 'ఇందిరా అంటూ.
అమ్మ ఏమంటుందో వినక్కర్లేదు -- 'ఇంకా ఏదన్నా కాలేదుగా సుందరీ -- రాచబిడ్డకు మేలుకొలుపు పాడాలి ముందు--'
అమ్మ ఆ విధంగా అనడం లో తనపట్ల ఆప్యాయత, గోచరిస్తుందే గానీ మరేవిధమైన భావనా కలగదు ఇందిరలో.
ఆ అవస్థ లోనే నవ్వుకుంది ఇందిర అమ్మ మాటలకు.
ఆ తర్వాత సుందరి వచ్చి లేపుతుంటే మెలకువ వచ్చింది-- 'అబ్బ, ఏమిటే , తెల్లవారకుండానే ---'
'ఇందిరా -- చూడు రాంబాబు ఏం చేశాడో ?-'
ఇందిర గతుక్కుమంది -- రాంబాబు చేసింది సుందరి కేలా తెలిసింది?'
నిద్రమత్తు క్షణంలో విడిపోయింది-- తనలో కలిగిన ఆ సంచలనాన్ని బహు కష్టం మీద ఆపుకుంటూ అంది ఇందిర; 'ఏం చేశాడేమిటే?-'
'ఏం చేశాడా?- ఈ నోటితోనే చెప్పమంటావా?--'
'అసలేం జరిగిందో చెప్పక...'
'ఇంట్లోంచి పారిపోయాడు----'
ఇందిర దీర్ఘంగా నిట్టూర్చింది -- 'ఎవరూ ? రాంబాబా?--'
'ఆ-- మీ బాబ్జీయే --' అంది సుందరి --
'నేను నమ్మను--'
'నామ్మకపోతే నీ ఖర్మ -- కానీ అది మాత్రం నిజం -'
'ఒసే సుందరీ -- కారణం ఏమిటే-?'
'కారణమా ....' సుందరి ఏదో అనబోయే సరికి సుమతి ఆ గదిలోకి రావటంతో టక్కున ఆపేసింది!.
'ఏడయినా ఇంకా ఏమిటే ఈ పడకా? లేస్తావా లేదా?-'
'ఉండవే అమ్మా, సుందరి ఏదో చెబుతోంటే.......'
'సుందరికేం ? ఎన్నయినా చెబుతుంది - సుందరీ. క్షణం ఆగమ్మా, దీన్ని లేచి కాస్త ముఖం కడుక్కోనీ! కాఫీ తాగాక మీ ఇష్టం మధ్యాహ్నందాకా ఎన్ని కబుర్లైనా సరే....'
సుందరి నవ్వింది -- 'నేను చెబుతూనే ఉన్నానండీ, లేచి ముఖం కడుక్కో అని! అయినా ....'
'లేవటం లేదు. అంతేగా -- నవ్వుతావెం పాచి ముఖమా! లే-- లే మరి !' అమ్మ ఆఖరికి బతిమాలే స్థితికి వచ్చేసరికి, దుప్పటి పక్కకు తోసి లేచింది ఇందిర.
'అమ్మా, కాస్త పక్క ఎత్తేస్తే ...' ఇందిర మెల్లిగా అంది--
'ఊ , వెళ్ళమ్మా -- చెప్పాలేమిటి? రోజూ ఏదో ఎత్తేస్తున్నట్లు ...' అంటూనే దుప్పటి మడత పెట్ట నారంభించింది సుమతి.
ఇందిర సుందరి కేసి చూసి 'కూర్చోవే ఒక్క క్షణం --' అంటూ దొడ్లో కి వెళ్ళింది.
దాదాపు అయిదు నిమిషాల తర్వాత - ఇందిర తిరిగి వచ్చింది. అమ్మ కాఫీ వెచ్చ పెట్టేంతవరకు అక్కడే ఉండి కాఫీ గ్లాసులు అందుకొని మళ్ళీ గదిలోకి దారి తీసింది సుందరి తో సహా.
'ఆ-- ఇప్పుడు చెప్పు--' అంది ఇందిర .
'ఏమిటి?--'
'అదే, కారణం లేకుండానే రాంబాబు ఎందుకు వెళ్ళిపోతాడు ?-'
'కారణం లేదని ఎవరన్నారు ?--' సుందరి అంది తీవ్రంగా.
'ఏమిటే- కారణం ఉందా? చెప్పు మరి !-'
'మా నాన్నను కొట్టేడు-'
'సుందరీ -' ఇందిర ఆశ్చర్య పోయింది -- 'పొద్దున్నే అబద్దా లెందుకే --'
'ఇక నీ ఇష్టం -- నిజాన్ని నమ్మినా నమ్మకపోయినా అబద్దం మాత్రం కాదు తెలిసిందా?- బాబ్జీ మా నాన్నను కొట్టాడు--'
ఇందిర కొంతసేపు ఏమీ మాట్లాడలేదు.
'ఎపుడు ?-' చాలాసేపు తర్వాత అడిగింది. ఆ అడగడం లో తను ఎంతో ఉన్నతంగా భావించుకునే వ్యక్తీ, హటాత్తుగా అధఃపాతాళానికి వెళ్లిపోయాడని తెలిస్తే, కలిగే బాధకు ప్రతిబింబం ఉంది.
'నిన్న రాత్రి --'
'ఎందుకు?-' నిర్జీవంగా అడిగింది ఇందిర.
'ఎందుకా ?- నీకు ఏదో సాయం చేయబోదామనుకునేసరికి , ఇదీ....'
ఇందిరకేమీ అర్ధం కాలేదు -- వెంకు పంతులు తనకేదో సాయం చేయాలనుకోవడం ఏమిటి? దానికి రాంబాబు కు ఉన్న అభ్యంతరం ఏమిటి?- కొట్టాల్సినంత అగత్యం ఏమిటి?- ఏమీ తెలీడం లేదు ఇందిరకు.
'ఏమిటి సుందరీ, సరిగ చెప్పు, ప్లీజ్--'
'ఏమందే -- ఏదో తెలిసినవాళ్ళు కదా , సాయం చేయాలను కోవడం బుద్ది తక్కువని మా నాన్నకు తెలీలేదు. అందుకనే ఒక పాఠం నేర్చుకున్నాడు.' సుందరి నిష్టూరం గా అంది.
'నువ్వలా అంటే నేనేం చెప్పను?- అసలు ఏం జరిగిందో అర్ధం కావటం లేదు నాకు. పైగా ఈ నిష్టూరాలు కూడా అయితే, ఇంక అడగక్కరలేదు నా పరిస్థితి ...' ఇందిరా అలాగే అంది.
'అది కాదె ఇందిరా -- నువ్వు, రాంబాబు చాల చనువుగా ఉంటున్నారు గదా...'
ఇందిర మళ్లీ గతుక్కుమంది -- '....అనుకో---'
'అందుకని , ఈ చనువు చాల అనర్ధాలకు దారి తీసే ప్రమాదం ఉందని, చనువు అరికట్టటం అవశ్యమనే దృష్టి తో మా నాన్న మీ నాన్నగారితో చెప్పారుట--'
'ఏమనీ ?-' ఇందిర ఆశ్చర్యపోయింది.
'ఏమనా ?-- ఊర్లో ఓ పదిమంది అనుకునే విషయం ఇది అని -- బాబ్జీ , ఇందిరలు చాలా చనువుతో ఉంటున్నారు. కొంచెం జాగ్రత్త అని చెప్పారుట -- అంతే -' సుందరి ఆగిపోయింది.
అంతే!- చాలదా ఏం?
అయినా ఈ లోకానికి ఎక్కడలేనివి తనకే కావాలి?- ఏ ఇద్దరు కొంచెం చనువుగా తిరిగితే తనకేం, తిరగకపోతే తనకేం ?
అయినా ఈ వెంకు పంతులుగారెందుకిలా చేయాలి?- పనిగట్టుకుని , మరీ-- ఏదో చదరంగం ఆడుకొనేటందుకు వస్తాడనుకుంటోంది గానీ తను-- ఇలాటి విషయాలు చెప్పటానికా రావటం?
వీళ్ళసలు ఇలాటి విషయాలు చెప్పటానికి ఎందుకు సంకోచించరో అర్ధం కాదు. ఈ విషయం చెబితే, ఎదుటి వాళ్ళు ఏమనుకుంటారో, ఏం మనసులో బాధపడతారో, ఆ తర్వాత వీటి పరిణామాలు ఎలా ఉంటాయో అనే విషయం బొత్తిగా పట్టించుకోక, సావకాశంగా వచ్చి, ఏదో ఉబుసుపోక కబుర్లు చెబుతున్నట్లు చెప్పి, ఎదురింట్లో వాళ్ల మనసుల్లో అగ్ని గుండాలు వెదజల్లి పోవాలంటే అసలు వీళ్ళకు మనసెలా ఒప్పుతుంది?
అయినా --
తన గురించి తండ్రి ఏమనుకుంటారు?
ఛ--
తన్ను ఎంతగా నమ్మకపోతే రాంబాబు తో అంత చనువుగా మసలనిస్తున్నారు?-- అయినా కన్న తల్లితండ్రులకు తమ కూతురి ని, కూతురి నడతను సరిదిద్దుకోమని మరొకరు ఇవ్వాల్సిన సలహా యేనా ఇది?-
ఈ పెద్దవాళ్ళకు ముసలితనం వచ్చే కొద్దీ బుద్ది ఉండదన్నది, ఇదిగో , ఈ విషయం వల్ల స్పష్టంగా తెలిసిపోతోంది.
అందుకే --
వెంకు పంతులు మళ్ళీ ఇలాటి పని చేయకుండా బుద్ది చెప్పి ఉంటాడు రాంబాబు-- కానీ సుందరి రాంబాబు వెంకు పంతుల్ని కొట్టాడని, ఇంట్లోంచి పారిపోయాడని అంటోంది -- ఛీ- ఛీ-- ఇపుడందరికీ ఈ విషయం తెలిసిపోతుంది-- ఖర్మ -- అనుకొంది ఇందిర.
'నమ్ముతున్నావా ఇందిరా?-'
ఇందిర నమ్మలేదు -- అందుకే మౌనంగా ఉండిపోయింది.
'ఎందుకు నమ్ముతావులే !.-----......'
చాల జాలిగా చూసింది సుందరి కేసి ఇందిర.
'సుందరీ, ప్లీజ్----.......'
'కాదె, ఇందిరా -- వీళ్ళిద్దరూ అతి చనువుగా ఉన్నారు అందుకే ....' ఆగిపోయిన సుందరి కేసి దీనంగా చూసింది ఇందిర , చెప్పమన్నట్లు.
'అందుకే మీరనుకునేటట్లయితే పెళ్లి చేసేయండి, అని అందామనుకున్నారుట మా నాన్న. కానీ...ఒక్కొక్కసారి మనం మేలు తలపెట్టినా కీడే జరుగుతుంది. అందుకే అసలు మేలు తలపెట్టడం కూడదన్నమాట----........"
ఇందిర చాలాసేపు మౌనంగా ఊరుకుంది. చాలా ప్రయత్నం మీద అడిగింది చివరకు -- 'ఇంతకూ పారిపోవటమెందుకూ?-'
'నువ్వుత్త ఫూల్ వె-- మా నాన్న వయసెంత? బాబ్జీ వయసెంత? -- మా నాన్నను కొట్టి , మళ్ళీ ఆ ముఖాన్ని వాళ్ళ నాన్నకుగానీ, నాకు గానీ-- ఆఖరికి నీకైనా చూపించగలడనే నీ ఊహ? మొహం చెల్లక...'
ఇందిర బాధపడింది ఆ చెప్పే విధానికి.
సుందరికేం తెలుసు?-- తను బాబ్జీ ఏం చేసినా సమర్దిస్తుందని.
అది బహుశా తన తప్పు గాదేమో --
ప్రేమ గుడ్డిది అన్నారు ఎవరో ఎపుడో , ఎప్పుడన్నదో గానీ అదీ ముమ్మాటికి నిజం. లేకపోతె -- లేకపోతె బాబ్జీ ఏం చేసినా తను ఎలా సమర్ధించగలదు? బాబ్జీ చేసేది, చేసినది ఎంత తప్పు పనైనా గానీ, అందులోని మంచిని మాత్రమే, -- మంచనేది లేకపోయినా, కనీసం ఉన్నట్లనుకొని అయినా -- గ్రహించగలుగుతోంది తను.
నిజమే --
రాంబాబు వెంకు పంతుల్ని కొట్టటం తప్పే!
కానీ --
నిజంగా రాంబాబు చేసింది తప్పా? అని మళ్లీ మరొకసారి ప్రశ్నించుకుంటే చాలు. రాంబాబు చేయటం లో తప్పు లేదు సరిగదా , అతను చేసింది మంచేననిపిస్తోంది -
నిజమే మరి- వెంకు పంతులు పని కల్పించుకొని వచ్చి, రాంబాబు మీద , తన మీద పెద్దవాళ్ళ కి దురభిప్రాయాన్ని కలగజేసి, వెళ్ళటం తప్పే గదా! తప్పు చేసినవాడు శిక్ష అనుభవించాలి-- కానే రాంబాబు వెంకు పంతుల్ని కొట్టకుండా ఉండాల్సింది.
'ఏమిటే ఆలోచిస్తున్నావు?-' అంది సుందరి.
'ఏముందే....' అందేకానీ ఇందిర ఆలోచిస్తున్నదేంతో ఉంది. ఆ సంగతి సుందరికీ తెలుసు.
ఎదుటివాళ్లు చెప్పేది అబద్దమని మనకు స్పష్టంగా తెలిసినా, ఒక్కొక్కప్పుడు తప్పనిసరిగా, ఆ అబద్దాన్ని నిజమనుకున్నట్లు నటించాలి. సుందరీ అదే చేసింది.
