ఎలాగూ చావు అనివార్యం అయినప్పుడు భయపడుతూ మృత్యువుకు లొంగిపోవటం ఎందుకు? మరణం అనివార్యం అయితే ధైర్యంగా చిరునవ్వుతో దాన్ని ఎదుర్కోవాలి.
ఇటువంటి ఆలోచన కలగగానే ఆమె తాను పరుండిగ చోటునించి చివాలున లేచింది. ఎలక్ట్రానిక్ వాచ్ లో సమయం చూస్తే రెండు గంటలు దాటిపోతుంది. మరో నాలుగు గంటలు గడిస్తే తెల్లవారుతుంది. అందాకా బ్రతికి ఉంటే యిక్కడినించి బయటపడే మార్గం గురించి అప్పుడు ఆలోచించుకోవాలి అందాకా ఇక్కడినించి వెళ్ళిపోయే ఆలోచనఅవసరం. అసాధ్యం కూడా అవుతుంది.
అమితమయిన తెగింపుతో ఆమె గాలి తాకిడినించి విముక్తి కోసం గుహవైపు నడవసాగింది ఇంతకుపూర్వం తాను చూచిన మానవాకృతి ఆ గుహలోకి వెళ్ళింది. అది తనకు మృత్యుమందిరం కావచ్చు అయినా ఆమె వెనుకంజ వేయలేదు. నెమ్మదిగా అడుగులు వేస్తూ గుహ ముఖాన్ని చేరుకుంది. అక్కడ జంతుమాంసం చివికి పోయిన వాసన వేస్తోంది.
నేలమీద అడవి దున్నలు చమరీ మృగాల తాలూకు ఎముకలు చిందర వందరగా పడి ఉన్నాయి. గుహలోపల చీకటి రాసి పోసినట్లుగా అనిపిస్తోంది. ఆ పెనుచీకటి కావల ఉన్న దృశ్యాలేవో ఊహించటం మనిషికి అసాధ్యం.
అందునించి మాలతి ఆలోచనలు కట్టుపడినాయి. మునుముందు పురోగమించటం ఒక్కటే లక్ష్యంగా నడుస్తోంది ఆమె. గుహలోపల కాలు పెట్టాక కన్నులు తెరిచినా మూసుకున్నా ఒకటిగానే అనిపిస్తోంది. చిక్కని చీకటి సాంద్రతరంగా రాసిపోసినట్లుగా పేరుకుపోయివుంది.
తన ఉనికిని తాను గుర్తించేందుకుకూడా వీలుకాని మాయామోహితమైన తిమిరజగత్తు అది. ఆ తిమిర ప్రపంచంలో కాలుపెట్టాక తననుతాను ఉన్నదీ లేనిదీ ఊహించుకోవటం అసాధ్యం. స్పర్శతోతప్ప మరొక శారీరక జ్ఞానేంద్రియాలేవి పనిచేయటల్లేదు.
కొంత దూరంలోకి పోయాక గాలి విసురునుంచి విముక్తి లభించింది మాలతికి. రవ్వంత కుదుటపడినట్లు అయింది హిమపానువుల తాలూకు శీతల పవనాలు యింక తమను ఏమీ చేయలేవు అనిపించిన ఆ తిమిర జగత్తులో ఒక చోటున విశ్రాంతి కోసం కూర్చుండిపోయిందామె. విపరీత మైన చలిబాధనించి కాస్త విశ్రాంతి దొరకటంతో ఆమె శరీరమంతా తేలిక అయినట్లు అనిపించింది. అంత భయంకర మయిన చీకటిని ఆమె ఎన్నడూ అనుభవంలోనికి తెచ్చుకోలేదు.
యిప్పుడు అంతా విచిత్రంగా అనిపిస్తోంది. కనురెప్పలు విప్పినా విప్పినట్లు అనిపించలేదు. మూసినా మూసినట్లు అనిపించలేదు. ఆ పెనుచీకటిలో తానుకూడా ఒక భాగంగా కలిసిపోయినట్లు మాత్రమే అనిపిస్తోందామెకు. మాయ అంటే ఏమిటో తెలిసింది. శరీరం రవంత నులివెచ్చన అయింది. ఆలోచనలన్ని కట్టుపడినాయి. రెప్పలు విశ్రాంతి కోసం బరువుగా వాలుతున్నాయి. శరీరం నేలమీదికి ఒరిగిపోయింది.
తాను పుట్టిపెరిగిన ఆంద్ర దేశానికి తనను కన్న వారికీ, కట్టుకోవాలనుకున్న వారికీ, యావద్భారతదేశానికి దూరంగా. ఓ అనంతమయిన అంధకారం అలుముకున్న కొండగుహలో మరి కొద్ది క్షణాల తరువాత తాను బ్రతికి ఉండేదీ లేనిదీ తెలియని భయంకరమయిన స్థితిలో ఎముకల రాసుల మధ్య నేలమీదపడి......ఒంటరిగా నిద్రపోయింది ఆ తెలుగింటి ఆడపడుచు......మాలతి : అటువంటి దయనీయ మయిన దుస్థితి మరొక రేవ్వరికీ రాకూడదని వెదురు పొరల్లో రాగాలాపన చేస్తోంది కొండగాలి. రవిచంద్రుల దివారాత్రాల దోబూచులాటతో రాత్రి ప్రొద్దు క్రమ క్రమంగా కరగిపోతోంది.
౦ ౦ ౦
సువిశాలమయిన మైదానంలో నిర్మించిన గుడారం లోకి కళ్ళువిప్పి చూచాడు ఫిజో అప్పటికి తన మిత్రులు తనకు అవసరమయిన సామగ్రి అంతా వొదిలేసి గుడారం ఖాళీచేసి వెళ్ళి పోయినాడు. తాను ఒంటరిగా మిగిలి పోయినాడు.
అప్పటికి సమయం ఎనిమిది గంటలయింది. శీతవాతాల తాకిడి రవ్వంత సమసిపోయింది. కొండ కొన కొమ్మలని చి సూర్యుడు యింకా ఎర్రని బంతిలా కన్పిస్తున్నాడు. ఎండ పొడ వస్తే రవ్వంత చలి కాచుకోవచ్చు.
తాను ఆరాధించే ప్రియతమురాలైన కెప్టెన్ మాలతి గురించి అన్వేషించటానికి బయలుదేరవలసి ఉంది తాను. ఆమె యింకా సజీవంగా ఉన్నదా అన్నది సంశయాస్పదమయిన విషయమే ఏది ఏమయినా కెప్టెన్ మాలతి గురించి తెలుసుకోకుండా తిరిగిపోవడం పిరికితనం. మిత్రద్రోహమవుతుంది. పిరికివారు చేయలేని పనులంటూ వుండవు ఒక లక్ష్యమంటూ నిర్ణయించుకున్న తరువాత దాన్నించి తప్పుకోవటం పిరికితనమేకాదు. నేరంకూడా అవుతుంది. అది మరణంతో సమానం.
చావో బ్రతుకో ఈ మంచుకొండలోనే తేలిపోవాలి. కాని కెప్టెన్ గురించి తెలుసుకోకుండా ఇక్కడనించి పారిపోవాలన్న ఆలోచన మనసులో అయినా చేయదని నిర్ణయించుకున్నాడు.
ఫిజో పూర్వీకులు నాగాలాండ్ లో నివాసంముండేవారు. అక్కడ తిరుగుబాటు సైనికచర్యలు క్రమంగా అధిక మయినాయి ముఖ్యంగా స్వాతంత్ర్యం తరువాత అక్కడి పరిస్థితులు మరింత జటిలమయినాయి. అందనించి తన తండ్రి అస్సాం ప్రాంతాలకు వలస వచ్చాడు. ఆయన నాగాలాండ్ లో ఉండగా అడవులలో కొండలలో తిరగటం బాగా అలవాటు పడినవాడు.
అస్సాం ప్రాంతాలకు వలస వచ్చిన తరువాత హిమాలయ పర్వతశ్రేణులో ఎవరు ఎక్కడకు పోవాలన్నా మార్గం చూపించేవాడు ఇతర దేశాలనించి హిమాలయాలను చూడాలని వచ్చి వారు ముఖ్యంగా తన తండ్రి అయిన లూయిమ్ ని ఆశ్రయించేవారు. అతడు అత్యంత ధైర్యశాలి. డెబ్బై సంవత్సరాల వయసులోకూడా కొండదారుల వెంట సునాయాసంగా నడువగలిగేవాడు.
