"నేని అర్ధంతో ఏడ్వలేదు, నీవు అతన్ని మన్మధుడంటేను ఏడ్చినట్లుంది అన్నాను."
"అతడు మన్మధుడిలా లేడంటావా?"
"నా కళ్ళకతనేమీ ఇంద్రుడు చంద్రుడులా లేడు మన్మధుడిలానూ లేడు. మామూలు మగాడిలా వున్నాడు."
"మగాడు మగాడిలా వుండక మరోలా ఎలా వుంటాడు గాని...." అంటూ త్రిలోకసుందరి చటుక్కున మాటలాపేసింది. కారణం వైజయంతి"మగవాసన...మగవాసన" అంటూ హెచ్చరించటమే.
వైజయంతి త్రిలోకసుందరిమధ్య కొన్ని కోడ్ వర్డ్స్ వున్నాయి. అత్యవసర పరిస్థితులలోను రహస్య సాంకేతికంగాను వుపయోగిస్తుంటారు. మదన్ గురించి మాట్లాడుకుంటుంటే అతగాడు వస్తున్న సూచనలు కనపడంగానే "మగా వాసన" అంటూ వొకరినొకరు హెచ్చరించుకుని జాగ్రత్త పడుతుంటారు.
మగవాసన తాలూకా మగమహారాజు మదన్ పెద్ద పెద్ద పూలలుంగీ గీరల షర్టుతో వీళ్ళ దగ్గరకు ఫ్రెష్ గా వచ్చాడు. అతనొచ్చేసరికి మూతులు బిగించుకు కూర్చున్నారు స్నేహితురాళ్ళు.
"మాట్లాడుకుంటూ మాట్లాడుకుంటూ నన్ను చూడంగానే మాట పడిపోయినట్లు బిగదీసుకుపోతారేమిటి ఇద్దరూ ఇద్దరే" అనుకున్నాడు మదన్.
వీళ్ళ దగ్గరకొచ్చి ఆగిపోయిన మదన్ "చూడండి..." అన్నాడు.
చూడమన్నది నిన్నా - నన్నా అన్నట్లు ఒకరి ముఖం ఒకరు చూసుకుని ఆపై తమ చూపు మదన్ వేపు తిప్పారు. త్రిలోకసుందరి వైజయంతిలు.
వాళ్ళు తన్ని చూడటంతో "అగ్గి పెట్టెవుంటే ఇస్తారా?" అన్నాడు మదన్.
"మేమేం సిగరెట్లు కాల్చం అగ్గిపెట్టెలు సిగరెట్టు లైటరు దగ్గరుంచుకోటానికి" గయ్యిమంది వైజయంతి.
"ఆమాటకొస్తే నేనూ కాల్చను" కొంటెగా జవాబిచ్చాడు.
వైజయంతికి మండిపోయింది. "అగ్గిపెట్టె దేనికి?" అంది.
"నానమ్మ మడికట్టుకుంది. మడికట్టుకుంటే వంటగది గడపదాటి యివతలికి రాని మీకూ తెలుసుకదా! పొయ్యి వెలిగిద్దామంటే అగ్గిపెట్టె ఖాళీగా వుంది. మిమ్మల్ని అడిగి తెమ్మని నన్ను తరిమింది."
"ఓహో!" అంది వైజయంతి.
"నాన్నమ్మ పొయ్యి వెలిగించగానే మీ అగ్గిపెట్టె మీకు తెచ్చియిస్తాను. అంతేకాదు. ఖర్చుచేసిన అగ్గిపుల్లలు కూడా..."
"అగ్గిపుల్లలే కాదు. మాటలుకూడా అంటించటంవచ్చు" అనుకుని లేచింది వైజయంతి అగ్గిపెట్టె తేవటానికి.
వైజయంతి చేతిలోంచి అగ్గిపెట్టె అందుకుంటూ "మగ వాడనేవాడికి సిగరెట్టు అలవాటుండకపోవటం ఎంత అనర్ధకమో చూశారా?" అన్నాడు మదన్.
కిసుక్కున నవ్వింది త్రిలోక సుందరి.
కళ్ళెర్రజేసింది వైజయంతి.
"వాతావరణం బాగుండలేదు. వెలిగించకుండానే అగ్గిపుల్లలన్నీ అంటుకుపోయే ప్రమాదం వుంది." అనుకుని మౌనంగా వెళ్ళిపోయాడు మదన్ గోపాల్ అగ్గిపెట్టెతో.
"బుద్దిలేదూ? అంత నవ్వెందుకొస్తుంది?" అంది వైజయంతి.
"అతని మాటలకి....జోక్ గామాట్లాడుతాడు కదే!"
"జోకా నా ముఖమా? మా పదునుగ ద్వందర్గంగ వదులుతాడు ప్రతిమాట. మా చెడ్డవాడు."
"నువ్వెందుకలా విపరీతార్ధం తీస్తున్నావో నాకర్ధం కావడంలేదే వైజయంతీ! అతనొచ్చి సరీగ వారం అయింది. అల్లరి చిల్లరి వేషాలు వేసినట్లు కనపడలేదు..."
"కనపడదు అదే తమాషా, ఇలా మంచిగా బుద్దిమంతుల్లావున్న మగాళ్ళే రౌడీలు పైకి ఎంత అమాయికంగా మాట్లాడుతాడో, నోరుతెరిస్తే చాలు బాకులాంటి మాట ఒకటైనా విసరక మానడు."
"నీమీదెప్పుడయినా బాకులూ చాకులూవిశిరాడేమిటి?"
"విసిరితే నే వూరుకుంటానా?"
