అతడు ఆగి అందరివైపు చూసి నవ్వేడు.
"....దీన్లో మన తప్పు కూడా లేదు. ఎన్నో చీరలు సంవత్సరాల తరబడి షాపుల్లో వుండిపోతాయి. కొన్ని వెరైటీ రంగులు ఎవరూ కొనకపోయినా మనం షాపుల్లో వుంచాలి. వీటి వడ్డీ లక్షల్లో వుంటుంది. అదీగాక ప్రొద్దున్న పదింటికొచ్చి సాయంత్రం వరకూ అన్నీ తిరగేసి, బేరం చేసి, ఏమీ కొనకుండా వెళ్ళిపోతారు. మధ్యాహ్నం పూట 'సరదాగా' షాపింగ్ వచ్చిన ఆడవాళ్ళు కొందరు వీళ్ళ ఎయిర్ కండిషన్ ఖర్చు, సేల్స్ మేన్ జీతాలూ అన్నీ మనం మన అమ్మకాల్లోనే సర్దుకోవాలి. అందుకే చీరల ధరలు ఇంతగా పెరిగిపోతున్నాయి. మనం అమ్మకాల్ని పెంచగలిగితే ధరలు తగ్గించవచ్చు."
"ఇక్కడ నేనో విషయంలో అడ్డుపడదల్చుకున్నాను" అన్నాడు శర్మ. ".....ధరలు తగ్గించనవసరం లేదని నా అభిప్రాయం. మిగతా వస్తువులు వేరు, చీరల విషయం వేరు. తక్కువ ధర చీరలయితే ఏమోకానీ, ఖరీదు ఎక్కువగా వున్న చీరలు కొనేవాళ్ళు ధర పెద్ద పట్టించుకోరు. ఆ మాటకొస్తే, ధర ఎక్కువ చెప్తే ఇంకా మంచి చీరేమో అని ముచ్చట పడతారు. కాస్త కంటికి నజరుగా కనిపించే చీర ఎక్కువ ధరైతే, పదిమందికీ చెప్పుకోవచ్చుగా ఇంకోలా చెప్పాలంటే నగల్లాగె ఖరీదైన చీరలు కూడా స్టేటస్ సింబల్. ఒకోసారి ధరలు తగ్గించటం కూడా ప్రమాదకరం. రవితేజ సూచించినట్టు పట్టుచీర యాభై రూపాయల కిస్తామంటే ఎవరూ కొనరు. మాకంతే ఖర్చయింది అని చెప్పినా నమ్మరు. ఎప్పుడూ లేనిది ఇదేమిటి అని అంటారు. ఇదేదో మోసం అనుకుంటారు...."
రవితేజ నవ్వేడు. "అవును. మన రీసెర్చి డిపార్ట్ మెంట్ ఇదికూడా ఆలోచించింది. అందుకే మనం ధరలు తగ్గించం. అలా అని, మిగతావాళ్ళలా తాహతుకి మించి మారుతీకార్లు ఇచ్చి చేతులు కాల్చుకోం...."
"మరి..."
రవితేజ వెంటనే సమాధానం చెప్పలేదు. ఇప్పుడు అసలు విషయానికి వచ్చాడు. జాగ్రత్తగా వాళ్ళని వప్పించాలి. తాము తీసుకోబోయే నిర్ణయాలమీదే కంపెనీ భవిష్యత్తు ఆధారపడి వుంటుంది.
అతడు బల్లమీదున్న కాగితాల్ని చేతుల్లోకి తీసుకుని కంఠం సవరించుకున్నాడు.
"సర్స్! దాదాపు పాతిక సంవత్సరాల క్రితం బ్రాసరీలు మార్కెట్ లో కొత్తగా ప్రవేశపెట్టబడ్డాయి. ఆ రోజుల్లో 'బాడీ'లకు బదులుగా బ్రాసరీలు ధరించే స్త్రీలని 'ఫాషన్ మరిగిన వాళ్ళు'గా చెవులు కొరుక్కునేవాళ్ళు అప్పుడు! ఇప్పుడు పొలంలో పనిచేసే కూలీ కూడా బ్రా ధరిస్తోంది."
"అవును. భూతద్దం పెట్టి వెతికినా బాడీలు కనిపించటం లేదు" వెనుకనుంచి ఎవరో అన్నారు. నవ్వులు.
రవితేజ కూడా నవ్వి అన్నాడు. "దాదాపు పాతిక సంవత్సరాల్నించీ భారతదేశపు స్త్రీల శరీరాలమీద బ్రాలు మకుటంలేని మహారాజుల్లా వెలిగాయి. నా అంచనా నిజమైతే - వాటికాలం చెల్లిపోయే రోజు వచ్చింది. చాలా తొందర్లో ఫాషన్ మారబోతూంది."
మీటింగ్ హాల్లో సూదిపడితే వినబడేటంత నిశ్శబ్దం వ్యాపించింది. అతడు కొనసాగించాడు. "బ్రాల్లో వుండే ముఖ్యమైన లోపం ఏమిటంటే- అవి కేవలం స్ట్రాప్స్ దగ్గిరే సాగదీయబడే గుణం కలిగి వుంటాయి."
"అవసరమైతే చోట" అన్నారు వెనుకనుంచి ఎవరో నిశ్శబ్దం బ్రద్దలైంది. మళ్ళీ నవ్వులు.
"అవును అవసరమైనచోట - అనవసరంగా! దీనివల్ల ఒక రకమైన 'బిగుతు' ఫీలింగ్ కలుగుతుంది. అలా కాకుండా కేవలం అవసరమైనచోట మాత్రమే తోడ్పడే ఒక కొత్త రకమైన ఫాబ్రిక్ కనుక్కోబడింది. దీని పేరు లిక్రా (Lycra). వంగినా, కదిలినా, తిరిగినా, చివరికి నాట్యం చేసినా - అదసలు శరీరంమీద వున్నట్టు ఉనికే తెలియని ఈ కొత్తరకం ఫిటింగ్, తొందర్లో బ్రాసరీ స్థానాన్ని ఆక్రమించబోతోంది. బనియన్లు, అండర్ వేర్లు తయారుచేసే వి.ఐ.పి. సంస్థ ఈ కొత్తతరాన్ని 'పెటల్స్' అన్న పేరుతో మార్కెట్ లో విడుదల చేసింది. దీని ఖరీదు 45 రూపాయలు. AS YOU FlOWER INTO WOMAN... DIS COVER PETALS అన్నది వీరి స్లోగన్." అతడు ఆగి నెమ్మదిగా అన్నాడు.
"....ఈ కంపెనీతో అగ్రిమెంట్ ద్వారా మూడొందల రూపాయల పైగా చీర కొన్నవారికి మనం ఒక జత పెటల్స్ ఉచితంగా ఇస్తాం. అదీ మన బహుమతి" అతడు ఊపిరి పీల్చుకున్నాడు. "....ఒకసారి ఈ పెటల్స్ ధరించిన స్త్రీ తిరిగి మామూలు బ్రా వైపు వెళ్ళదు. ఇది పూర్తిగా మార్కెట్ లోకి వచ్చి వ్యాప్తమయ్యే లోపులో మన అమ్మకాలు రికార్డు స్థాయి దాటతాయని నా నమ్మకం. ఏది ఏమైనా ఒకటి మాత్రం నిజం. పెటల్స్ ని "స్త్రీ" కన్నా, పెటల్స్ ధరించిన స్త్రీని పురుషుడు ఎక్కువ ఇష్టపడతాడు."
"స్వానుభవమా?" వెనుకనుంచి ఎవరో సన్నగా అన్నారు.
ఈసారి ఎవ్వరూ నవ్వలేదు.
అతడికున్న స్టయిల్ కీ, హుందాకీ, అతడు 'కో' అంటే కోటి మంది క్యూలో నిలబడతారనీ, డిజైన్స్ గీయటంలో, కలర్ మ్యాచింగ్ లో అతడిని మించినవాడు భారతదేశంలో మరొకరు లేరనీ, అన్నిటికీ మించి ఆడవాళ్ళ శరీర తత్వాన్నీ, ఫాషన్స్ నీ అంచనా వేయటంలో అతడు నిష్ణాతుడనీ వారందరికీ తెలుసు. కానీ ఒక శాస్త్రజ్ఞుడు పరీక్ష నాళికని ఎలా చూస్తాడో అంతే ఆసక్తి తప్ప మరే విధంగానూ అతడు పరాయి స్త్రీని చూడడని అతనితో పరిచయమున్న వారందరికీ తెలుసు.
అందుకే ఎవరూ నవ్వలేదు.
ఈ లోపులో రవితేజ చేతిలో కాగితం బల్లమీద పడేసి రెండో ప్రపోజల్ తీసుకున్నాడు.
"ఒక చీర కొంటే దానితోపాటు బ్లౌజుపీసు ఉచితంగా ఇస్తున్నారు కొంత మంది."
"ఫాల్స్ కూడా...."
"ఫాల్స్ ఇస్తున్నారో లేదో నాకు తెలీదు. నేను ఇప్పుడు మీ ముందు చర్చకు పెట్టబోయేదేమిటంటే చీరతోపాటు బ్లౌజుపీసు మనం కూడా ఉచితంగా ఇస్తాం. అయితే అందర్లాగ చీరలోనే దాన్ని మడతపెట్టి ఇవ్వడం కాకుండా, కొనుగోలుదార్లు మన షాపులో వుండే ఏ బ్లౌజు గుడ్డనన్నా ఎన్నిక చేసుకునే హక్కు కల్పిస్తాం. మనం ఇందుకోసం పెట్టే జాకెట్టుపీసులు మాత్రం మన లాభం కన్నా తక్కువ వుండేటట్టు చూసుకుంటాం. దీనివల్ల కస్టమరు మన షాపులో ఎక్కువసేపు వుంటారు. మన షాపుల్లో 'రద్దీ' పెరుగుతుంది. ఐ మీన్ పెరిగినట్టు కనిపిస్తుంది. వ్యాపారం యొక్క ముఖ్య లక్షణం... అన్నిటికన్నా ముందు షాపు కళకళలాడేట్టు కనిపించేలా చేసుకోవటం. మన మిత్రుడైన ఒక డైరెక్టర్ ఫాల్స్ గురించి చెప్పారు. మనం కూడా ఫాల్స్ ఇస్తాం- అయితే అందర్లాగా ఇవ్వం. అక్కడికక్కడ కుట్టించి ఇచ్చేస్తాం. ఇలా కుట్టిచ్చే సమయంలో ఆడవాళ్ళ చేతులు వూరుకోవు. మరో చీరని వెతుకుతాయి....."
చప్పట్లు ఆగకుండా వినిపించాయి. రవితేజ సెక్రటరీ వైపు చూసి నవ్వేడు. ఈ చివరి సలహా ఇచ్చింది ఆమే! ఆమెకి నలభై అయిదేళ్ళుంటాయి. అతడికి కుడిభుజంలా పనిచేస్తూంది. అతడు కొనసాగించాడు.
".....మన అమ్మకాల అభివృద్ధి పథకం క్రింద ఒక పదహారు పేజీల చిన్న పుస్తకాన్ని ప్రచురిస్తున్నాం. ఏ శరీరాకృతికి ఏ చీర బావుంటుంది- ఏ కాలంలో ఏ రంగు బావుంటుంది- కేశాలంకరణ... వగైరా అన్నీ అందులో వుంటాయి. సాధారణంగా 'టై'లు కొన్నవారికి ఇలాటి చిన్న పుస్తకాన్ని ఇస్తారు. మన చీరకొన్న ప్రతీవారికి ఈ పుస్తకం ఉచితంగా ఇస్తాం. అంతేకాదు...." ఆగి నెమ్మదిగా అన్నాడు- "అంతర్జాతీయ విమానాల్లో ప్రయాణం చేసేవారికి చిన్న టూత్ పేస్టు, బ్రష్, సేవింగ్ సెట్ బహుమతిగా ఇస్తారు. కోటీశ్వరులు కూడా ఇలాటి చిన్న ప్రెజెంట్స్ ని చాలా ఇష్టపడతారు. ఫ్రెండ్స్! మన దగ్గిర రెండొందల పైగా ఖరీదున్న చీర కొన్నవారికి, ఆ చీర రంగుకి మ్యాచ్ అయ్యే గాజులు, మేకప్ బాక్సు కాంప్లిమెంటరీగా ఇస్తాం. చీర రంగుకి సరిపోయే బొట్టు, లిప్ స్టిక్, చిన్న పౌడర్ పాకెట్ ఐ లైనర్ లాటివి వుంటాయి. మూడొందలు దాటిన చీరకి దుద్దులు కూడా ఇస్తాం - అఫ్ కోర్స్! ఆర్టీఫీషియల్ వి."
"మనకేంమిగులుతుందా అసలు-" ఒక వృద్ద డైరెక్టర్ అడిగాడు. రవితేజ గుండెల్నిండా ఊపిరి తీసుకున్నాడు. ఇక అసలు విషయం చెప్పవలసిన సమయం వచ్చేసింది.
"సర్స్, మీ అందరి అనుమతితో - ఈ రోజునుంచి మన చీరల ధర పాతిక శాతం పెంచుతున్నాను."
బాంబు పేలింది.
అప్పటివరకూ ఆసక్తితో వింటూన్న డైరెక్టర్లందరూ ఒక్కసారిగా మాట్లాడటం మొదలుపెట్టారు. కొందరు 'నో' అని అరిచారు. కొందరు తమలో తాము చర్చించుకోవడం ప్రారంభించారు. అతడు మౌనంగా అందర్నీ పరిశీలిస్తున్నాడు. తన ఆలోచన్లమీద నమ్మకం వుంది అతడికి. డైరెక్టర్లే ఇక వప్పుకోవాలి. ధర గురించి ఆడవాళ్ళు పెద్ద పట్టించుకోరని అతడికి తెలుసు. నూనె కిలో పాతికయితే ఎంతో బాధపడే స్త్రీ, చీర వంద పెరిగినా కొనేస్తుంది.
"రవితేజ టెక్స్ టైల్స్ వారి చీరలు శరీరాలకి కాదు. మనసులకి చుట్టుకుంటాయి."
ఇదీ వాళ్ళ స్లోగన్. అది నిజమైనంతకాలమూ ధర గురించి ఆలోచించనవసరంలేదు. కానీ వాళ్ళు ఇలా ఆలోచించటంలేదు. ఒకసారి మార్కెట్ పడిపోతే నష్టం. అందుకే ఇంత చర్చ!
