దంతధావన చేసీ చేయుటతో నేఁ దెచ్చిన కమలా ఫలములను రుచి జూచి," బాగు న్నవి! కాని లోన డొల్ల జాస్తి. రసము తక్కువ" యనిరి. ప్రతి వస్తువును పరిశీలించి నాణ్యము తేల్చుట వారి కొక పరిపాటి.
ఆపిమ్మట నాకు యోగచికిత్స నిచ్చుటకు వారు సమ్మతించిరి. కాని ముందు నా భోజనవసతి యెట్లని యడిగిరి. హొటలులో నుందు ననఁగానే వారి కతృప్తి కల్గెను. హొటలులో ఆహారము ససిగా నుండదని వారి బెంగ. మామూలు సాంబారు మెతుకులు గాక మంచి నేయి, కూరలు, పాలు, పండ్లు తీసికొనవలె ననిరి." ఈ యాహరముతో నీ జబ్బు కుదురునను కొనవద్దు. కుదుర్చునది సర్వకర్తయగు నిశ్వరుడే! నీ శరీర పుష్టికి ఈ తిండి కావలయును" అని చెప్పిరి. నర్సింగుహొము సంగతి చెప్పగా అందు చేరవల దనిరి. వారి మాతజాడను బట్టి నా యనారోగ్యము చక్కబడు నని వారి తలంపుగా నేను గ్రహించి సంతసించితిని.
నా కంఠస్వరము బలహీనముగా నున్నదని వారనిరి. ఆ మాట నాకు క్రొత్తగా తోచెను.కాని పూర్ణారోగ్యము బడసిన పిమ్మట పోల్చిచూచికొనఁగా వారి మాట సత్యమని తెలిసికొంటిని. ఇది యెందులకు వ్రాసితి ననగా శ్రీ శాస్త్రిగారు యోగచికిత్సకు వచ్చు వారిని మొదటి చూపులోనే ణిశితముగ పరిక్షింతురని చెప్పుట కే!వచ్చెడిరిఆకారము, ముఖవైఖరి, మాటతీరు,కఠస్వరము, అంగవిన్యాసము, వారు తెచ్చెడి కానుకలు మొదలగు వానిని బట్టి వారివారి స్వభావ ములను, అనారోగ్యము తీరున శ్రీ శాస్త్రిగారు గ్రహింతురు. వారి యూహ తప్పగుట నే నెన్నఁడు చూడ లేదు. ట్రీట్రెంటులలోనే గాక ఈ కుశలతను వారు నిత్య జీవితములో నొక వినోదముగా నవలంబించెడివారు. దస్తూరిని బట్టి స్వభావమును తెలిసికొనుట, జాబులపై పోస్టుమార్కులను చూడ కుండ చిరినామా వ్రాసిన తీరునుబట్టి ఆ కవరు ఎచటి నుండి వచ్చినదో చెప్పుట, ఒకప్పుడా జాబు చదువకయే అందలి విషయమును చెప్పుట మొదలగు చిన్నచిన్న వినోదవిమర్శలతో వారి చుట్టు నొక చల్లని ఆశ్చర్యకరమైన వాతావరణము కల్పించెడి వారు.
ఆ తొలిపూట ట్రీట్మేంటులో నా శరీర మంతట ఒక శక్తి ప్రవహించినట్లుండెను. చెమట యోడికలు గట్టెను. హొటలుకు పోయి చక్కగా భోజనము చేయుమనిరి. సాయంత్రము వరకు కాల మెట్లు గడ పెదవని యడగిరి. క్రొత్తచోట నేమి చేయుటకు తోచక విసుగు చెందుదునని వారి యాందోళన! ట్రీట్మేంటుకు వచ్చిన వారి శారీరక, మానసిక సౌకర్యములను గూర్చి అంత శ్రద్ధగా విచారించెడి వారు శ్రీ శాస్త్రిగారు! చికిత్సాకాలములో చీకాకులు లేకుండ ఆనందముగ నుండ వలె నని వారి తలపు."ఏదో పుస్తకములతో కాలక్షేపము చేయుదు" నని నే నంటిని. శ్రీలక్ష్మి నారాయణగారు " ఈయన మంచి చదువరి. అందుచే ఉబుసుపోక కేమి చిక్కు లేదు" అని చెప్పిరి. దానికి శ్రీ శాస్త్రి గారు" పుస్తకాలన్నీ కట్టిపెట్టు. భోంచేసి కమ్మగా నిద్రపో" యనిరి. శ్రీ శాస్త్రిగారు బహుగ్రంధ పరిశో ధకులు. కాని పుస్తక పాండిత్యము పై వారి కభిమానము లేదు. మన మనశ్సరీరములే సర్వరహస్య ములను వెల్వఱించు పుస్తకములు. వానిని పఠించు తీరు అలవర్చుకొనుట మేలు అని వారి అభిప్రాయము. సాహిత్యమును గూర్చి వారి యూహలను తరువాత స్పృశించెదను.
సాయంత్రము తిరిగి నేను వచ్చినపుడు నాయాకలినిగూర్చి, భోజనపదార్ధములను హూర్చి, నిద్రను గూర్చి,వచ్చునపుడు తీసుకొన్న పాలు, పండ్లను గూర్చి, శరీర స్థితిని గూర్చియు వివరములడిగి తెలిసికొనిరి. నేను వారు చెప్పినట్లే నడచుకొనుటయు, నిద్రహారము లమరుటయు గుర్తించి బండి త్రోవను నడచుచున్నదని వారు తృప్తి చెందిరి.
వారికడకు వచ్చు ప్రతివారిని ఈరీతిగనే యే పూటకాపూట ప్రశ్నించి ధ్యానములో నేమి జరిగినదియు, ఇంటి వద్ద నెట్లున్నదియు తెలిసికొని ఉత్సాహపఱచుచు ఎవరికైన బాధ తగ్గనిచో కారణ మన్వేషించుచు, దోషములను దిద్దుచు, ఆ దిద్దుగడతో నారోగ్యము చక్క బడుట గమనించచు, అనవరపరహిత కాంక్షతో కాలము గడపెడి వారు శ్రీ శాస్త్రిగారు.
