Previous Page Next Page 
విశాలి పేజి 6


    విశాలి ముఖంలోకి రహస్యంగా చూశాడా యువకుడు.
    అస్పష్టంగా కనిపిస్తున్న విశాలి రూపురేఖలు అతని మనసంతా నిండాయి.
    మొదట సువర్ణ ఇల్లు వచ్చింది.
    ఆ యువకుడికి కృతజ్ఞత చెప్పుకుని, గేటు తీసుకుని లోపలికి వెళ్ళబోతూ విశాలి చెవిలో మెల్లిగా చెప్పింది సువర్ణ: "జాగర్త! నిన్నెత్తుకుపోతాడేమో ఈ రాజ కుమారుడు!"
    "ఛీ! పో!" అంది విశాలి నవ్వాపుకుంటూ.
    మరికొంచెం దూరం నడిచాక విశాలి ఇల్లు రానే వచ్చింది. రెండు చేతులూ జోడించి, మనఃస్ఫూర్తిగా కృతజ్ఞత చెప్పుకుంది విశాలి.
    "నే నేదో దేవుడిలా అంత పొగడకండి. నేనూ మీ లాంటి మనిషినే." నవ్వేసి ముందుకు సాగిపోయా డా యువకుడు.
    తలుపు కొడుతూ ఆశ్చర్యపోయింది విశాలి లోపల లైటు వెలుగుతూండటం చూసి. అన్నయ్య ఇంకా మెలుకువగానే ఉన్నాడా? లేకపోతే లైటు ఎందుకు వేసుకుంటాడు?
    తలుపు తీసి, హాంగర్ కి పాంటూ, షర్టూ తగిలిస్తూ మౌనంగా ఉండిపోయాడు రామం.
    బట్టలు మార్చుకొచ్చి, మంచి నీళ్ళు తాగి పడుకో బోతూండగా అప్పుడు చటుక్కున గుర్తు కొచ్చింది విశాలికి తను భోజనం చేయలేదన్న సంగతి.
    ఆపదలో ఆదుకున్న ఆ యువకుడే తన మనసంతా నిండి ఆకలిని కూడా మరిపింపచేశాడన్న ఊహకి నవ్వొచ్చింది విశాలికి.
    విశాలి వెనకే వంటింట్లోకి నడిచాడు రామం.     వండినవి వండినట్టే ఉండటం చూసి తెల్లబోయింది విశాలి.
    "అదేమిటన్నయ్యా?నువ్వు భోజనం చెయ్యలేదే?"
    "నేనూ ఇప్పుడే వచ్చాను. కాలేజీ కొచ్చాను నేను కూడా." ముక్తసరిగా అన్నాడు రామం పీట వాల్చుకుకూర్చుంటూ.
    నిశ్చేష్ట అయి నిలుచుండిపోయింది విశాలి. ఫంక్షన్ కి తనుకూడా రాదలుచుకున్నప్పుడు తనతో సాయంత్రం ఆ సంగతి మాట వరసకైనా చెప్పకూడదా? పోనీ, వచ్చిన మనిషి తిరిగి ఇంటికి వచ్చేటప్పుడయినా చెల్లెలు వచ్చేవరకూ ఒక్క నిమిషం ఆగుదాం, చెల్లెలికి తోడు ఉన్నట్టవుతుంది, ఒక్కత్తే వస్తుంది కదా ఇంటికి అని అనుకోనే లేదా?
    "ఏమి టన్నం ఇప్పుడప్పుడే పెట్టనా? వెళ్ళి పడుకో మంటావా?" రామం మాటతో ఉలిక్కిపడి, రెండు కంచాల్లో వడ్డించింది విశాలి.
    ఒక నిమిషం మౌనంగా ఉండి మెల్లిగా అన్నాడు రామం: "అయినా మగవాళ్ళతో సమానంగా ఆడవాళ్ళు కూడా ఇలా ఇంత రాత్రివేళ దాకా బయట తిరిగి రావడం నా కేం నచ్చదు."
    నవ్వాలో, ఏడవాలో తెలియలేదు విశాలకి.
    "భలేవాడివే! నే నేమన్నా రోడ్లట్టుకు తిరుగుతున్నానా? కాలేజీలో ఫంక్షన్ అయితే వెళ్ళడంకూడా తప్పేనా? అయినా నే నొక్కదాన్నే కాదుగా? అమ్మాయి లెంతమంది రాలేదూ? పైగా బలవంతంగా నా పాట ఒకటి పెట్టారుగా? వెళ్ళక తప్పుతుందా?"
    "ఏం! నువ్వు పాడనంటే తలకొట్టి మొలేస్తారా?" విసుగ్గా అన్నాడు రామం.
    అప్పు డర్ధం చేసుకుంది విశాలి తను పాడటం అన్నయ్య కిష్టం లేదని. కానీ, తను పాడటంలో తప్పేముందో మాత్రం అర్ధం కాలేదు. మనసు పాడైమరి అన్నం సహించలేదు విశాలికి.

                             *    *    *

    విశాలి, సువర్ణ బి. ఎ, పాసయ్యారు.
    ఆ ఊళ్ళోనే ఉద్యోగం చేస్తున్న తన బావ సుందరంతో సువర్ణ వివాహం జరిగిపోయింది.    
    రాఘవరావుగారి దయవల్ల ఆయన ఆఫీసులోనే ఉద్యోగం దొరికింది విశాలికి.
    సాయంత్రం రామం ఇంటికి రాగానే తనకి ఉద్యోగం దొరికిందన్న విషయం చెవిని వేసింది.
    "గొప్పలే! నాకూ దొరికింది."
    "నిజంగానా, అన్నయ్యా!" తనకి ఉద్యోగం దొరికిన దానికంటే అన్నయ్యకి ఉద్యోగమైందన్న విషయమే విశాలిని ఎక్కువ సంతోష పెట్టింది.
    "ఎక్కడన్నయ్యా పని?"
    "మహాలక్ష్మి ఫాన్సీషాపు లేదూ? అందులో పని నే నేమీ చెయ్యనక్కర లేదులే. కొన్నాళ్ళు పోయాక ఆ షాపు యజమానిని నేనే అవుతానుగా?"
    అర్ధంకాక చూస్తూ నిలబడింది విశాలి.
    "ఏం? నమ్మలేకపోతున్నావా? ఆ షాపు ఓనర్ కి ఒక కూతురుందిలే. ఆ అమ్మాయిపేరే ఆ షాపుకి పెట్టారు-ఆ అమ్మాయిని కనక నేను పెళ్ళాడితే అందులో పని ఇప్పించడమేకాక, ఆయన తరవాత ఆ షాపు నాదవుతుంది. ఒప్పుకున్నాన్నేను." గర్వంగా చెల్లెలి ముఖం లోకి చూశాడు రామం.
    "చాలా సంతోషం, అన్నయ్యా!" అన్నదే కానీ ఏదో అనుమానం మనసులో పీడిస్తూంది. అయినా అడగలేక ఊరుకుంది.

                             *    *    *

    మొట్టమొదటిసారిగా మహాలక్ష్మిని చూసి ఒక్కనిమిషం మ్రాన్పడిపోయింది విశాలి. అంతలోనే తేరుకుని కుంటికాలు, మెల్లకన్ను, పల్లెత్తు - ఇదీ ఆ మహలక్ష్మి రూపం. అందుకే ఆ తండ్రి ఏవేవో ఆశలు పెట్టి, రామంచేత ఒప్పించా డీ పెళ్ళి చేసుకుందుకు. విశాలికి మహాలక్ష్మి మీద చెప్పలేని జాలి ముంచుకొచ్చింది. డబ్బు కోసం ఆశపడైనా ఆ అమ్మాయిని పెళ్ళాడి నందుకు అన్నయ్యకి కృతజ్ఞతలు చెప్పుకుంది మనసు లోనే, తనూ ఒక ఆడదన్న విషయం మరిచిపోలేదు గనక.
    ఆ మూడు ముళ్ళూ పడ్డాక, ఎవరూ లేకుండా చూసి విశాలితో అన్నాడు రామం: "ఇంకనించీ మనం ఉండేది వాళ్ళింట్లోనే. పెళ్ళయ్యాక వాళ్ళింటికే వచ్చేసి ఉండమన్నాడు మా మామగారు. మళ్ళీ నువ్వొక్కదానివే ఎక్కడుంటావు? అందుకని నువ్వుకూడా మా దగ్గరికి వచ్చి ఉండేటట్టు ఆయనచేత ఒప్పించాను." అదోలా అయిపోయింది విశాలి మనసు.
    'ఇల్లరికం' అనే మాట ఉపయోగించకుండా ఎంత చక్కగా చెప్పాడు అనుకుంది మెల్లిగా.
    అన్నయ్యతో పాటూ తనుకూడా వెళ్ళి వదిన పుట్టింట్లో ఉండడం ఏమాత్రం నచ్చలేదు విశాలికి. కానీ, వేరే గత్యంతరం లేదని తెలుసు. ఒంటరి ఆడది బ్రతికే సంఘం కాదిది.

                             *    *    *

    రోజులు గడిచిపోతున్నాయి.
    రామం ఆలస్యంగా షాపుకి వెళ్ళి తొందరగా తిరిగి వచ్చేసే విధానం మానలేదు.
    మహాలక్ష్మికి విశాలిమీద అర్ధంలేని కోపం, చిరాకు.
    తన అందవిహీనత్వానికి బాధపడుతూ, విశాలి అందానికి ఈర్ష్యపడుతూ విశాలి మీద అసూయ మనసంతా నింపుకుని మండిపడుతూ ఉంటుంది.
    వదిన తండ్రి సాంబయ్యగారి ప్రవర్తన ఏమాత్రం నచ్చలేదు విశాలికి.
    ఆయన చూపులు, వెకిలినవ్వులతో ఒంటిమీద తేళ్ళూ జెర్రులూ పాకినట్టవుతుంది విశాలికి.
    ఏదోవిధంగా ఆయన తనతో కల్పించుకుని మాట్లాడు తుంటే తప్పనిసరిగా, ముక్తసరిగా జవాబు లిస్తూ సాధ్యమైనంత మటుకు ఆయనకి దూరంగా ఉండడానికి ప్రయత్నిస్తూ కాలం గడుపుతూంది.
    ఆ రోజు సాయంత్రం రామం ఇంట్లో లేడు.
    మహాలక్ష్మి ముందరి గదిలో కూర్చుని  డిటెక్టివ్ నవల చదువుకుంటూంది.
    పెరట్లో చామంతిమొక్కకి నీళ్ళు పోస్తున్న విశాలి, వెనక అడుగుల చప్పుడై తిరిగి చూసింది.
    పళ్ళన్నీ బయట పెట్టి నవ్వుతూ నిలుచున్నాడు సాంబయ్య. మాట్లాడకుండా అక్కడినుంచి వెళ్ళిపోయే ప్రయత్నంలో ముందుకి నడిచింది విశాలి.
    "అంత గర్వం పనికిరాదు, విశాలీ!"    
    సాంబయ్య మాటలకి తెల్లబోయి, నిలబడి పోయింది విశాలి.
    "నేను దగ్గిరికొస్తున్నకొద్దీ నువ్వెందు కంత దూరంగా వెళ్ళిపోతావు? నువ్వు 'ఊఁ' అంటే చాలు ఈ ఇంటికి నిన్ను యజమానురాల్ని చేస్తాను."
    పెల్లుబికే కోపాన్ని పళ్ళబిగువున అదిమిపట్టి, చెలరేగే మంటని గుండెమాటున దాచిపెట్టి సాంబయ్య ముఖంలోకి చూసింది విశాలి. "దయచేసి ఇటువంటి మాటలు మాట్లాడకండి. మీరు నా తండ్రి లాంటి వారు."
    గట్టిగా నవ్వబోయి, లోపలున్న కూతురికి వినిపిస్తుందని దడిసి ఊరుకున్నాడు సాంబయ్య.
    "పిచ్చి పిచ్చి కబుర్లు చెప్పకు. నా మాట విను."
    తన చేతిని పట్టుకున్న సాంబయ్య చేతిని గట్టిగా విదిలించి కొట్టి, రెండు అంగల్లో లోపలికి వచ్చిపడింది విశాలి.
    కాళ్ళలో దడ....
    గుండెల్లో దడ....
    కళ్ళలో నీరు.....
    మనసులో బాధ.
    వంటింట్లో తలుపు నానుకుని అలాగే నిలబడిపోయింది ఎంతోసేపు.
    ఎవరూ చూడకుండా రోజూ తన వెనక పోరు పెట్టే ఈ మహానుభావుడి గురించి ఎవరితో చెప్పగలదు తను?
    అన్నయ్యకి తనంటే మొదటినించీ చిరాకే. ఇంక వదిన సరేసరి. మాట్లాడటమే అరుదు. ఇక మిగిలినది సాంబయ్యగారు.  
    తన తండ్రిలాటివాడు ఆ విధంగా ప్రవర్తిస్తే ఎలా? ఆ వయసులో ఆయన కోరవలసిన కోరికేనా అది?
    తలుచుకున్నకొద్దీ కంపరమెత్తి నట్లయింది విశాలికి.
    ఒక్క నిమిషం చిట్టి వాళ్ళమ్మ, ముకుందరావు కళ్ళముందు కదిలారు.
    ఆ ఇంట్లో ఉన్నన్నాళ్ళూ అదో బాధ.
    ఈ ఇంట్లో, ఇక్కడికి వచ్చినప్పటినించీ ఇదో రకపు బాధ, భయం.
    అక్కడ ఆఫీసులో చూస్తే అదో గోల.
    ఉద్యోగం చేస్తున్న ఆడదంటే అందరికీ చులకనే. కొలీగ్స్ లో సదాశివం ఒక్కడే మంచివాడు; మెత్తనివాడు.    
    తనతో మర్యాదగా, గౌరవంగా మాట్లాడేది అతనొక్కడే. తల్లి, భార్య, ఇద్దరు పిల్లలు అతని కుటుంబంలో సభ్యులని ఒక సా రేదో మాటల్లో అన్నాడు,
    ఇంక పరిమిళ తరహాయే వేరు.
    పైకి నవ్వుతూ మాట్లాడినా మనసులో తనంటే అసూయే. ఆ సంగతి తనెప్పుడో పసిగట్టింది.
    "అబ్బ! అక్కడ ఒక్కదాన్నీ కూర్చుని ఈ పుస్తకం చదువుతుంటే ఎంత భయం వేసిందనుకున్నావ్!" ఆలోచనల దారం పుటుక్కున తెగిపోగా ఉలిక్కిపడి చూసింది విశాలి.        
    ఎదురుగా చేతిలో డిటెక్టివ్ పుస్తకంతో నిలబడి ఉంది మహలక్ష్మి.    
    'అంత భయం వేసేదైతే ఆ పుస్తకం చదవక పోతేనేం?' నాలిక చివరిదాకా వచ్చిన మాటని వెనక్కి తీసుకుంది విశాలి.
    ఇంతలో రామం రావడంతో అక్కడినించి వెళ్ళి పోయింది మహాలక్ష్మి.
    
                             *    *    *

    ఆ రోజు విశాలి ఆఫీసునించి ఇంటికి వచ్చేసరికి వరండాలో కూర్చుని మాట్లాడుకుంటున్న మామా అల్లుళ్ళు టక్కున సంభాషణ ఆపేసి ఇద్దరూ చెరో వైపుకీ చూస్తూ కూర్చుండిపోయారు. వాళ్ళ ప్రవర్తనకి ఆశ్చర్యపోయిన విశాలి తల వంచుకుని మౌనంగా లోపలికి వెళ్లిపోయింది. వాళ్ళిద్దరూ ఏదో తన గురించే మాట్లాడుకుంటూ ఉండి ఉంటారు. లేకపోతే తనని చూసి హఠాత్తుగా సంభాషణ ఆపివేయవలసిన అవసరం ఏముంది? ఈ ఆలోచన విశాలి మనసంతా నిండి, ఎందుకో కలవరపడింది.    
    ఆ రాత్రి ఇంట్లో పనంతా అయ్యాక, తనకి నచ్చిన, తన మనసు మెచ్చిన 'వైతాళికులు' చదువుకుంటూ తన గదిలో కూర్చుంది విశాలి.    
    గది గుమ్మం దగ్గర ఒకటి రెండు సార్లు తచ్చాడి చివరికి లోపలికి ప్రవేశించాడు రామం. ఏదో చెప్పడానికి ప్రయత్నిస్తున్నాడని గ్రహించడానికి ఎంతోసేపు పట్టలేదు విశాలికి.
    "ఏం కావాలన్నయ్యా" అంది పుస్తకం మడిచి బల్లమీద పెడుతూ.
    కుర్చీ దగ్గిరికి లాక్కుని కూర్చున్నాడు రామం.    
    "నీ పెళ్ళి విషయం మాట్లాడదామని."
    మనసేదో కీడుని శంకించగా మౌనధారిణి అయింది విశాలి.
    ఒక నిమిషం ఆగి, కిటికీలోంచి బయటికి చూస్తూ అదేదో అతి సాధారణ విషయమన్నట్లుగా అడిగాడు రామం. "నీకు మా మామగార్ని చేసుకోవడం ఇష్టమేనా?"
    నెత్తిమీద పిడుగు పడినట్లయింది విశాలికి.     
    అన్నయ్యేనా ఆ మా టన్నది అనిపించింది ఒక్క క్షణం.
    కోపం, బాధ సుళ్ళు తిరుగుతుండగా వెంటనే ఏమీ మాట్లాడలేకపోయింది విశాలి.
    "ఆ గుండెనొప్పి తాతయ్యనా, అన్నయ్యా, నేను పెళ్ళిచేసుకోవాలి?" అని అడగాలనుకుంది కానీ, ఆ మాట గొంతు దాటి బయటికి రాలేదు.
    "ఎటొచ్చీ కాస్త వయసెక్కువనిగానీ.....ఆయన కేం లోటు?" చెల్లెలి ముఖంలో భావాలు గ్రహించడానికి ప్రయత్నించాడు రామం.
    అన్నయ్య మనసులో ఏ మూల వెతికినా తనంటే ప్రేమగానీ, శ్రద్దగానీ చీమ తలకాయంతకూడా లేదని ఆ నిమిషంలో నమ్మక తప్పింది కాదు విశాలికి.
    మౌనం అర్ధాంగీకారం అనుకున్నాడో ఏమో కుర్చీ వెనక్కి తోసి లేచి నిలబడ్డాడు రామం వెళ్ళే ప్రయత్నంలో.
    "క్షమించన్నయ్యా! నా కిష్టం లేదు." అప్పటికి విశాలి నోట్లోంచి స్థిరమైన మాట ఊడిపడింది.
    తనేనా అంత ధైర్యంగా జవాబు చెప్పగలిగింది అనిపించింది ఒక్క క్షణం.
    ముఖం చిట్లించాడు రామం.
    "బాగా ఆలోచించుకుని చెప్పు. తొందరేం లేదు" అంటూ అడుగు కదపబోయాడు.
    "ఇంక మళ్ళీ మళ్ళీ ఆలోచించుకునే అవసరం లేదన్నయ్యా! నా కిష్టం లేదని చెప్పానుగా? ఇంతకంటే నీ చేతులతో నాకు విషమిచ్చినా నేను బాధ పడను..." దుఃఖంతో పూడుకుపోయింది విశాలి గొంతు.
    "ఛీ! నా మాట ఏది నువ్వులక్ష్య పెట్టవు గనక! వేలకి వేలు కట్నం పోసి నీ పెళ్ళి చెయ్యడం నా తరం కాదు. పెళ్ళి చేసుకుంటావో మానుకుంటావో నాకు తెలియదు నీ గొడవ." విసురుగా అక్కడినుంచి వెళ్ళిపోతున్న అన్నయ్యని చూస్తూ నిట్టూర్చింది విశాలి.
    ఆ తరవాత రెండు మూడు రోజులు రామం చెల్లెలితో మాట్లాడనే లేదు.
    సాంబయ్యగారి కళ్ళలో పెరుగుతున్న కోపం పసి కట్టడం కష్టమనిపించలేదు విశాలికి. వదిన మరీ ముఖం ముడుచుకోవడం ఎందుకో అర్ధం కాకనూ పోలేదు.
    రాత్రిళ్ళు పనంతా అయి పక్కమీద పడ్డాక- 'అమ్మా, నాన్నా కనక ఉండి ఉంటే ఎంత బాగుండేది! వాళ్ళే కనక ఉంటే తన మనసు నొప్పించేవారా? అనురాగం, ఆప్యాయతలకి లోటు ఉండేదా? అప్పు డన్నయ్య ప్రవర్తన ఇలా ఉండేదా? తన బ్రతుకిలా మలుపుల్లో నలిగిపోయేదా? తిన్నని మార్గంలో సాఫీగా సాగేది కాదూ?' అనుకుంటూ, రకరకాల ఆలోచనలు రంగరించి పోసిన కన్నీరు దాచుకుందుకు దిండులో తల దూర్చుకుంటూంది విశాలి.

                               *    *    *


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS