Previous Page Next Page 
అపరాజిత పేజి 6

 

                                    5

    ఆ సాయంత్రం శ్యామలను చూసుకోవటానికి పెళ్ళి వారొస్తున్నారు- ప్రొద్దుటి నుండీ మాధవి ఒకటే హడావిడి గా తిరుగుతోంది-ఫలహారాలు తయారు చేసింది-ఇల్లంతా సర్దింది-శ్యామలను స్వయంగా ముస్తాబు చేసింది పరమేశ్వరి ఎంత బలవంత పెట్టినా తను మాత్రం ఖరీదైన చీర కట్టుకోకుండా మామూలు మిల్లు చీరతోనే ఉంది -
    తలుపు తట్టిన చప్పుడు కాగానే గాభరాగా తలుపు తెరిచింది - రాజారావు, లోపల అడుగుపెట్టాడు-తనకు ప్రాణమైన శ్యామలకు కాబోయే వరుణ్ణి ఆనందంతో చూసింది మాధవి-
    ఎంత నిరాడంబరంగా ఉందో అంత అందంగా ఉన్న మాధవిని తనను తను మరిచిపోయి చూస్తూ నిలిచిపోయాడు రాజారావు-
    కొంత సేపటికి అతని చూపులు ఇబ్బందిగా అనిపించి నర్వస్ గా కదిలి 'లోపలకు రండి-' అంది మృదువుగా వచ్చి కూర్చున్నాడు రాజారావు-
    'చొరవగా మీపేరు?' అన్నాడు-
    'మాధవి!'
    'చదువు కొంటున్నారా?'
    'అహ! ఉద్యోగం చేస్తున్నాను-'
    'గుడ్! ప్రస్తుత మనదేశపు ఆర్ధిక పరిస్థితులనుబట్టి, ఆడవాళ్ళూ మొగవాళ్ళూ కూడా చదువుకుని ఉద్యోగాలు చెయ్యవలసిందే!'
    'నా ఉద్దేశమూ అదే! ఉండండి-ఫలహారం తీసుకొస్తాను-'
    మాధవి లోపలి కెళ్ళి టిఫిన్ ప్లేట్లు ట్రేలో సర్ది శ్యామలకిచ్చి అతని కియ్యమంది!    
    శ్యామల గడగడ వణికి పోతోంది- వళ్ళంతా చమటలు పట్టాయి-
    'నే నెందుకో నిలవలేకుండా ఉన్నాను మాధవీ! ఎందుకో చాలా భయంగా ఉంది నువ్విచ్చిరద్దూ!' అంది-
    'ఎందుకు శ్యామలా భయం?-రా! నువ్విస్తేనే బాగుంటుంది-'
    'అహ! నేను వణికి పోతున్నాను- నా చేతుల్లోంచి ట్రే జారిపడినా పడుతుంది-నువ్విచ్చిరా మాధవీ!'    
    పరమేశ్వరి కలిగించుకుని 'ఇచ్చిరా మాధవీ! అవతల పెద్దమనిషి కూర్చున్నారు-' అంది-
    పరమేశ్వరి కాఫీ డికాషన్ తయారు చేస్తోంది-మాధవి ఫలహారం తీసుకొచ్చి రాజారావు కిచ్చింది-రాజారావు ఫలహారం చేస్తూ 'చాలా బాగుంది-ఎవరు చేసారు?' అన్నాడు-
    'నేనే చేసాను-'
    'మీరు అటు ఉద్యోగమూ ఇటు వంటా కూడా చేస్తారన్నమాట!-'
    'మరి?! చాలామంది ఉద్యోగం చేస్తున్న ఆడవాళ్లు ఏదో సుఖపడి పోతున్నారనుకుంటారు -ఇళ్ళలో ఉండే ఆడవాళ్ళ కంటే మా బాధ్యతలు రెట్టింపవుతాయి-పోనీ ఆర్ధిక స్వాతంత్ర్యం ఉంటుందా అంటే అదీ ఉండదు-పెళ్ళి కాకముందు మా జీతంపైన అధికారం తండ్రిది-పెళ్ళయ్యాక భర్తది-జీతమంతా వాళ్ళ కిచ్చి ఖర్చులకి మళ్ళీ అడిగి తీసుకో వలసిందే!'
    రాజారావు చిరునవ్వు నవ్వాడు-
    'ఆర్ధిక స్వాతంత్ర్యం లేదని బాధపడుతున్నారా?"

                        
    మాధవి నవ్వింది-
    'అవతలివాళ్ళు సహృదయు లైనంత వరకూ ఈ స్వాతంత్ర్యం ఉన్నా లేకపోయినా ఒకటే! అన్నీ అవతలివాళ్ళు కనిపెట్టి చూసుకుంటూంటే మాకసలు దబ్బు దేనికి?'
    'గుడ్! కానీ అసలు హక్కుల ప్రసక్తి లేకుండా నీ, నా భేదం తలెత్తకుండా సంసారం చేసుకోవటం మంచిది కదూ!'    
    'మెల్లగా అంటున్నారా? అంతకంటే స్వర్గం ఉంటుందా?'
    'చదువుతో పాటు సంస్కారం కూడా ఉన్నవాళ్ళ సంసారాల లాగే ఉంటాయి-'    
    మాధవి సిగ్గుపడి సంభాషణ మారుస్తూ 'మీ వాళ్ళెవరూ రాలేదేం?' అంది-
    'మామూలుగా జరిగే పెళ్ళి చూపుల తంతు-అందరూ రావటం-అందరూ అన్ని రకాలుగా ఏదో ఒక బజారులో వస్తువులా పెళ్ళికూతురిని పరీక్షించటం, నచ్చదు నాకు-అందుకే నే నొక్కడినే వచ్చి పెళ్ళి కూతురితోనే మాట్లాడాలనుకున్నాను-నచ్చాను-తర్వాత ముహూర్తం నిశ్చయించు కోవడానికి మా నాన్నగారు వస్తారు-'
    'ఇంతటి సభ్యతగల యువకుని ఇన్నాళ్ళకు చూశాను-'
    'ఇలా లేనిపోని సిగ్గులు ప్రదర్శించకుండా, నిస్సంకోచంగా అన్ని విషయాలూ చర్చించగల యువతిని ఇవాళే కలుసుకున్నాను-'
    తెల్లబోయి చూసింది మాధవి-
    ఇతనిముందు తను సిగ్గు పడవలసిన అవసరమేముంది?
    ఎంతకూ కాఫీలు తీసుకుని శ్యామల రాకపోయేసరికి లోపలి కెళ్ళింది మాధవి-
    'ఏమిటి పెద్దమ్మా! నువ్వూ శ్యామలా ఎంతకూ రారేం?'
    'ఏం చెయ్యమంటావమ్మా!' కాఫీ ఇచ్చిరా! 'అని పంపుతే కాఫీ అంతా చీరమీద వలక పోసేసుకుంది- అది చీర మార్చుకొంటూంది-నేను కాఫీ తయారు చేస్తున్నాను మళ్ళీ-లాభంలేదు-అది బెదురు గొడ్డు-ఈ కాఫీ కూడా నువ్వే ఇచ్చేసిరా!'
    మాధవి తనే కాఫీకూడా ఇచ్చింది.
    అంతలో శ్యామలను చెయ్యి పట్టుకుని తీసుకొచ్చింది పరమేశ్వరి-
    తల వంచుకుని కుర్చీలో కూర్చున్న శ్యామలను తెల్లబోయి చూసాడు రాజారావు-
    'మీరు సాయంత్రం వస్తారనుకున్నాం-అందుకనే ఆయన పళ్ళు తీసుకు రావటానికి బజారు వెళ్ళారు - చిన్నమ్మాయికూడా ఆయనతో వెళ్ళింది-ఈ పాటికి వస్తూ ఉండాలి-'
    'ఫరవాలేదు-ఇప్పుడు నాకు పళ్ళూ అవీ ఏం అక్కర్లేదు-'
    అంతలోనే శివశాస్త్రి, రాధ వచ్చాను -
    'ఒహో! బావగారా! నమస్కారం-'
    చేతులు జోడించింది రాధ-
    అప్పుడే వరస కలిపేసిన రాధను చూసి నవ్వి తనూ ప్రతి నమస్కారం చేసాడు రాజారావు-
    శివశాస్త్రి కంగారు పడిపోతూ 'అరె! అప్పుడే వచ్చేసారే! మర్యాదలన్నీ జరిగాయా? ఫలహారం తీసుకున్నారా? కాఫీ త్రాగారా? క్షమించాలి - ఆలస్యమయి పోయింది' అన్నాడు-    
    'మీరేం కంగారు పడకండి-కూర్చోండి - నేను మర్యాదలకోసం రాలేదు-అయినా మీవాళ్ళు అతిధి సత్కారంలో లోపం చెయ్యలేదు-'
    'అది మా పెద్దమ్మాయి శ్యామల-చదువుకోలేదు - కానీ, కుట్లూ అల్లికలూ బాగావచ్చు-వజ్రంలాంటిది-నేను చెప్పకూడదు కాని, అంత వినయ విధేయతలు ఎవరికీ ఉండవు - దీనికి పెళ్ళయితే మాకు కొండంత బరువు తగ్గుతుంది-'
    ఒక్కసారి ఉలిక్కిపడ్డాడు రాజారావు - అప్రయత్నంగా కనుబొమలు ముడిపడ్డాయి - అంతలో సర్దుకుని కూర్చున్నాడు-
    'మీ నాన్నగారు రాలేదేం?'
    సరిగ్గా ఆలోచిస్తూన్న రాజారావు వెంటనే సమాధానం చెప్పలేదు-
    'మిమ్మల్నేనండీ!'
    ఉలిక్కి పడ్డాడు-
    'ఏవిఁటీ?'
    'మీ వాళ్లెవరూ రాలేదేం?'
    'తర్వాత వస్తారు -' క్లుప్తంగా సమాధానం చెప్పాడు - కొంచెంసేపు కూర్చుని అందరికీ నమస్కరించి వెళ్ళిపోయాడు రాజారావు -
    తర్వాత కొంచెం రోజులకు రాజారావు తండ్రి వచ్చి కట్నం డబ్బు ముందుగానే తీసుకుని ముహూర్తం నిశ్చయించుకుని వెళ్ళిపోయాడు-
    'చూడు పెద్దమ్మా! అంత సంస్కారంగా మాట్లాడాడు - కట్నం మాత్రం మానలేదు-' అక్కసుగా అంది మాధవి-
    'అంతేనమ్మా!డబ్బు అన్ని ఆశయాలకూ మంగళహారతి పాడేస్తుంది-'
    నిస్ప్రుహతో అంది పరమేశ్వరి-
    
                               *    *    *

    శ్యామలకు పెళ్ళయిన దగ్గిరనుండే మాధవి కెన్నో సంబంధాలు వస్తున్నాయి -ఆ సంబంధాలన్నింటినీ మాధవి అభిప్రాయంకూడా అడక్కుండానే ఏవేవో వంకలతో తిరగ్గొడుతున్నాడు శివ శాస్త్రి-
    మాధవికి మనసంతా అల్లకల్లోల మయిపోయింది - తనకు మధు నాలుగు వేలిచ్చినట్లు ఇంట్లో అందరికీ తెలుసు -ఆ మాత్రం తమ అనుబంధాన్ని అర్ధం చేసుకోలేరా? ఇంకా ఎందుకిలా సంబంధాలంటూ కపట నాటకం? తన అభిప్రాయం ఎవరైనా అడుగుతే చెప్పటానికి సిద్ధంగానే ఉంది 'మధుని తప్ప ఎవరినీ చేసుకోనని-' కానీ అసలు తన దగ్గిర ఆ ప్రస్తావన ఎవరూ తేకపోతే ఏం చెయ్యాలి? తనంత తను తన పెళ్ళి మాటలు ఎలా మాట్లాడగలదు?
    శ్యామల పెళ్ళయి దగ్గిర దగ్గిర ఏడాది నిండుతోంది - మధుకు సహనం తగ్గి చిరాకుప్రారంభం కాసాగింది-
    'ఎన్నాళ్ళీ దాగుడుమూతలు మాధవీ! మీ వాళ్ళతో స్పష్టంగా ఎందుకు చెప్పవూ?'
    కొద్ది చికాకుతోనే అడిగాడు-
    'ఎలా చెప్పాలో అర్ధం కావటం లేదు-నా దగ్గిర ఆ ప్రస్తావనే తేవటం లేదు ఎవరూ...'
    'నే నొచ్చి అడగనా మీ పెద్ధనాన్న గారిని?'
    'అడగండి - అదొక్కటే మార్గంలొ కనిపిస్తుంది-'
    పెద్దనాన్న కు తను పెళ్ళి చేసుకోవటం ఇష్టం లేదని మాధవికి లీలగా అర్ధమవుతోంది-పెద్దమ్మ అభిప్రాయం స్పష్టపడటం లేదు-కనీసం పెద్దమ్మయినా తన నర్దం చేసుకుని తనకండగా నిలవక పోతే ఏం చెయ్యగలదు?
    మాధవి ఇల్లు చేరుకునేసరికి పరమేశ్వరి ప్రయాణ సన్నాహంలో ఉంది-


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS