కవి సన్మానం
సోమేశ్వరరావు చెప్పిన కథని నారాయణబాబుకీ చెప్పాను.
నిన్న సాయంత్రం మైలాపూరు బీచిని వెలుతురు క్రమంగా
వెన్నెలగా మారిపోతూండగా సోమేశ్వరరావు అదంతా నిజం
అన్నాడు. నేను కోరితే ఒట్టుకూడా వేసుకొని ఉండును.
సోమేశ్వరరావు చెప్పిన సంగతులే నారాయణబాబుకి
చెప్పాను. నారాయణబాబు ముక్కుమీద వేలు వేసు
కున్నాడు.
ఆ సంగతులే ఇక్కడ రాస్తాను. కాని వాస్తవం కూడా రచనల్లోకి వచ్చేసరికి వాపోయిస్తవం, వం పోయివాస్త, స్త పోయి వావం ఇలా మారిపోతూ వుంటుంది. అసలు నేను చెప్తే నిజంకూడా అబద్దమానుకునే మిత్రులున్నారు. ఇంతకీ నిజం కావాలసినవాళ్ళు సోమేశ్వరరావుకి అర్జీ పెట్టుకోవాలి. నేనే నిజం తాలూకు నీడను మాత్రమే దాఖలు చేసుకోగలను.
నారాయణబాబూ నేనూ ఎప్పుడు మాట్లాడుకున్నా కవిత్వం సంగతీ, కవుల సంగతీ మాత్రమే. అయితే మా దృష్టిలో కవిత్వమనేది పరిధిలేని ప్రపంచంకాబట్టి ప్రపంచమంతా మా సంభాషణలోకి వచ్చేస్తుంది. మా దృష్టిలో కలం పట్టినవాడు మాత్రమే కవికాడు. పిపీలికాది బ్రహ్మ పర్యంతం ప్రతీ ప్రాణి ఏదో ఒక సంజీవి పర్వతాన్ని వెదుక్కుంటూ బతుకుతుంది. దోమకి నా ముక్కు సంజీవి పర్వతం.
నారాయణబాబూ అన్నాను నేను. మనం ఎవరూ అక్కరలేదని పారేసిన వాటినే కథావస్తువులుగా ఏరుకుంటాం. సంఘంలోనూ ఇంతే అందరూ నిరాకరించిన రౌడీలూ, కేడీలూ, లేడీలూ మనకి ఆధ్యాత్మిక బంధువులు వాళ్ళ కథల్లోంచి మహా భారతం పిండి వాళ్ళ జీవితంలో రామాయణం చదువుతాం.
ఆ కథ చెప్పేవు కాదన్నాడు నారాయణబాబు. సోమేశ్వరరావు చెప్పిన కథని నారాయణబాబుకి చెప్పాను. మక్కీ సోమేశ్వరరావుది ఫక్కీ నాది.
అనగా అనగా ఒక కవి పాటలూ మాటలూ వ్రాశాడు. బాగున్నాయని కొందరన్నారు. బాగులేవని మరికొందరన్నారు. మనం ఏమీ అనలేదు పత్రికలలో గ్రంథవిమర్శనలు చేసేవాళ్ళుండగా మనకెందుకా గొడవ బాగుండడం బాగుండకపోవడం కాదు. మనకి కావలసినది రాస్తాడు. అంచేత మన బంధువు వాడి కథ మనం తెలుసుకోదగ్గది.
ఈ రోజుల్లో రెండురకాల మాలవాళ్ళున్నారు. సినీమాలవాళ్ళూ, డ్రామాలవాళ్ళూ వీళ్ళు మనమట్టుకి పూజ్యులు వీళ్ళలో వీళ్ళు ఆ పంక్తినించి ఈ పంక్తికీ ఆ కొమ్మనించి ఈ కొమ్మకీ రాకపోకలు జరుపుతూ వుంటారు. ఎప్పుడో తప్ప వార్తాపత్రికలు ఎక్కరు.
కవి నాటకలోకంలోంచి సినిమాలోకంలోకి గెంతేడు. పుష్పవృష్టి కురిసింది. పాటలు రాలాయి. మాటలు పేలాయి. ఆ ఫిలింపేరేమిటో నాకు తెలియదు. నిజంగా మన కవి ఆ ఫిలింకంపెనీలో పనిచేశాడేమో తెలియదు. చేశానంటాడు. ఉత్తరాలు కూడా చూపిస్తాడు. అతను మాట్లాడుతున్నంతసేపూ ఆ మాటలు నమ్మకపోవడం అసంభవం. అరచేతిలో ఆరిన్ ఆసు చూపిస్తాడు. గప్ చప్! ఇంతల్లోనే అది ఇస్పేట్ ఆసు ఐపోతుంది.
ఆ పిల్ల పేరు చెప్పను. అప్పటికే అది మూడో అమ్మాయి. వాళ్ళ అమ్మదగ్గర కవి తనకి ఫిలింకంపెనీ దగ్గరనించి వచ్చిన ఉత్తరం చదువుతున్నాడు. ఇదివరకు ఇద్దరమ్మలదగ్గిర చదివాడు అనవసరం. ఆ కథలు మనకి అక్కర్లేదు అని టర్నర్ సత్రందాకా వచ్చి ఆగిపోయాయి.
కవి చదువుతున్నాడు. ఉత్తరంలో ముక్కలు సోమేశ్వరరావు చెప్పలేదు. తాత్పర్యం మాత్రం చెప్పాడు దాన్నిబట్టి ఉత్తరం ఇంచుమించు ఎలా వుండి ఉంటుందంటే -
".......మేము తెన్గు, కనడం, అరవం మొదలయిన భాషల్లో తియ్యబోతున్న ఫిల్ములకి ఏర్పాట్లు చురుగ్గా జరుగుతున్నాయి. తెలుగు ఫిలిం మీరు డైరెక్టుచేసి పెట్టాలి. కనీసం సాంగ్సూ, డైలాగ్సూ రాసిచ్చినా చాలు హీరోయిన్ పాత్రకి మంచి అమ్మాయి కావాలి. మీ ఖర్చుల నిమిత్తం అడ్వాన్సుక్రింద వెయ్యి రూపాయలు టి.యం.వో. చేశాం. హీరోయిన్ కి మీరెంత జీతం ఇమ్మంటే అంత ఇస్తాం....."
ఈ ధోరణిలో ఇంకా సాగివుండాలి. కవి సాంతంగా కల్పించి వుంటే ఇంత కన్నా గొప్పగా ఉండవచ్చునని కూడా నేను వినయవిధేయతలతో అంగీకరిస్తున్నాను.
కవికీ, అమ్మాయికీ, అమ్మకీ జరిగిన సంభాషణ వివరాలు నాకు సోమేశ్వరరావు చెప్పలేదు. ఊహించి రాయగలను. మంచి ఏకాంత నాటిక అవుతుంది. కాని నారాయణబాబూ నువ్వూహించగలవు. సంభాషణ వివరాలు నీ ఊహకి వొదిలేస్తున్నాను. సారాంశం సోమేశ్వరరావు చెప్పాడు. కవితో అమ్మాయిని చెన్నపట్టణం పంపించడానికి అమ్మ ఒప్పుకుందని.
ఇద్దరూ బయల్దేరారు. విశాఖపట్నం మజిలీ ఆ రాత్రి టర్నర్ సత్రంలోనే అనుకుంటా గడిచింది కళ్ళు మూసుకుని ఈ ఘట్టాన్ని దాటేద్దాం.
చెన్నపట్టణం బహుశా రామస్వామి సత్రం వుడ్లాండ్ మాత్రంకాదు. కవికి తంతి మనియార్డరు అందలేదని దీని అర్ధం ఫిలింవాళ్ళు పంపివుండరని అనుమానం.
అమ్మాయి గడుసుది ఇదివరకటి రెండు కథలూ ఎరుగును. రెండు మూడు చేతులు చూసిందని సోమేశ్వర్రావన్నాడు. హీరోయినీత్వంలోని ఆకర్షణకొద్దీ వచ్చిందే కాని చెన్నపట్టణం చూడకకాదు.
అమ్మాయిని సత్రంలో దిగవిడిచి కవి అంతర్దానమైపోయాడు. సాయంత్రం మెయిలు ఎక్కగా చూశామని అమ్మాయి తాలూకు గూఢచారులు చెప్పారు. వెంటనే పోలీసులకు రిపోర్టు యిచ్చింది అమ్మాయి.
తర్వాత కథ సోమేశ్వరరావు మంచి మజాగా చెప్పాడు
మెయిలులైను పొడుగునా టెలిగ్రాములు వెళ్ళాయి. మర్నాడు ఉదయం - స్థలం బెజవాడ ఫ్లాట్ ఫారం కవి పచారుచేస్తున్నాడు. ఇద్దరు మనుష్యులు ఎదురై పలకరించారు. ఎవరండీ చెన్నపట్నంనుంచి వస్తున్నారట. కవిట, సినిమాల్లో మంచి పేరుందిట. ఆయనకి ఈ వూళ్ళో సన్మానం చెయ్యాలనుకుంటున్నారు. ఈ మెయిల్లోనే దిగుతారని తెలిసి వొచ్చాం.
కవి ఆదుర్దాగా నేనే, నేనే.
అయితే యిలా దయచెయ్యండి.
ఫ్లాట్ ఫారం దాటి, గేటుదాటి స్టేషన్ దాటారు. పది గజాలు నడిచారు.
తమరేనా ఫలానా?
ఆ.ఆ.
అయితే తగిలించరా బేడీలు అన్నాడు సి.ఐ.డి. ఇన్ స్పెక్టర్.
--౦౦౦౦--
