ఇప్పటి జమీందారు రంగారావుగారు దీపకాంతిలో యేదో చదువు కుంటున్నారు. మమ్మల్ని చూచి పుస్తకం మడిచి ప్రక్కన పెట్టారు.
తల్లిని రాజమర్యాదతో ఆహ్వానించి కూర్చోపెట్టారు యెదురుగా కుర్చీలో వీపుకి ఆనుడు లేకుండా చేతులు కట్టుకుని కూర్చున్నారు.
ఇంత అర్ధంతరంగా ముందుగా కబురుకూడా పంపకుండా తల్లి యెందుకు వచ్చారా అని ఆలోచిస్తున్నారు రంగారావుగారు. కొడుకుతో యీ విషయాన్ని యెలా వివరించాలా అని ఆలోచిస్తున్నారు గాయత్రీ దేవిగారు.
ఆ యిద్దరి మధ్య జరగనున్న సంభాషణలో నేను కల్పించుకోవలసిన మాటలు ఏమిటా అని ఆలోచిస్తున్నాను.
మొత్తంమ్మీద అందరినీ ఆలోచనలే కాని మాటలు లేవు. మా ముగ్గురిమధ్య మౌనం రాజ్యం చేస్తోంది. కాస్సేపు అయాక గాయత్రీదేవి అన్నారు.
"బాబూ! బొబ్బిలివీరుల చరిత్ర ప్రాణం పోసుకుని మళ్ళీ మన కళ్ళముందుకు వచ్చింది యిది సృష్టిలో విచిత్రం. మల్లమదేవి మళ్ళీ పుట్టిందయ్యా" అన్నదామె. కళ్ళల్లో నీళ్ళు సుళ్ళు తిరిగినాయి. రాజరక్తం రగిలింది.
చరిత్ర యెప్పుడూ శవపేటిక కాదు. చైతన్యపేటిక ప్రతి దేశ చరిత్రా కోటి కధా సరిత్సాగరాలకు సమానం. నాకూ మనసు కదిలింది.
"అమ్మగారూ! యేమయింది?" అన్నారు రంగారావుగారు అర్ధంకాక.
కన్నీటితెరల మధ్యనించి రాజమాత నన్ను చూచారు. నాకు అర్ధమయింది. ఆమె కంఠం మూగపోయింది. నేను రంగారావుగారికి వివరించి చెప్పాలి.
"ఐరోపానించి అనుకుంటాను. యెవరో ఒక యువతి వచ్చింది. నేను మహాదేవి మల్లమ్మను అంటోంది. చిత్రంగానే వున్నది. కాని అబద్దం అనిపించట్లేదు యదార్ధం యెలా అవుతుందో అర్ధం కావటల్లేదు. ఆనాటి మీ బొబ్బిలివీరుల పేర్లు గడ గడా చదివెయ్యటమే కాదు! చుట్టరికా లను కూడా చెబుతోంది. యిప్పుడు నా గదిలో వుంది" అన్నాను.
"వెరీ యింటరెస్టింగ్!" అంటూ నా ముఖంలోకి చూచి నవ్వారు రంగారావుగారు.
"ఇది నిజం కాకపోవచ్చు. అబద్దంకూడా కాకపోవచ్చు. యేది యేమయినా యీవిషయాన్ని మనం జాగ్రత్తగా పరిశీలించటం అవుసరం" అన్నాను.
"అలాగే తప్పకుండా చెయ్యండి" అన్నారు రంగారావుగారు.
"ఇది అచ్చంగా మేము చేసేపని కాదు. మీరు కూడా ప్రమేయం కల్పించుకోవాలి. నిప్పులేందే పొగ రాదుకదా!" అన్నాను నేను తర్కశాస్త్రంలో చదువుకున్న అనుమాన ప్రమాణాన్ని జ్ఞాపకం తెచ్చుకుంటూ.
"నన్నేం చెయ్యమంటారు?" అంటూ అడిగారు రంగారావుగారు.
"ప్రస్తుతానికి నా గదిలోకి రండి. ఆ తరువాత విషయం నేను ఆలోచిస్తాను" అంటూ యిహ అక్కడ ఆయన సమాధానంకోసం యెదురు చూడకుండా క్రిందికి దిగి వచ్చేశాను.
లోపల మర్లిన్ నా గది అంతా పీకి పోగులుపెట్టి నానా యాగీ చేసి వుంటుందని వూహించాను. కాని గెడ తీసి చూస్తే అలా జరుగలేదు.
మార్లిన్ నా కుర్చీని సింహాసనంగా భావించుకుని ఠీవిగా కూర్చుని వుంది. ఆనాటి బొబ్బిలి యువతులు తీరిక సమయాల్లో పాడుకునే వీరగీతాలు పాడుకొంటోంది. యివన్నీ ఆమెకు యెలా వచ్చినాయి?
నేను వెళ్ళగానే "దామెర్ల ధర్మారాయుడు బాబాయి వచ్చారా?" అని అడిగింది.
"రాలేదు" అని చెప్తే యేమి తంటా వస్తుందోనని "వస్తున్నారు వస్తున్నారు" అన్నాను.
మార్లిన్ మల్లమదేవిలా ఠీవిగా కూర్చుంది.
ఆ ఠీవి యెన్ని జన్మల రాజరక్తం తనకిచ్చిన వరమో! తాటాకు మంటలకు ఆహుతి అయిపోయిన మల్లమ్మ మళ్ళీ పుట్టిందా? యెంత చిత్రం.
పునరపి జననం ...... జననీ జఠరేశయనం. ఆత్మకు చావులేదు హిందువుల నమ్మకాలు యెన్నడూ వృధాకాలేదు.
కల్పిత కధలు అన్నీ కాలగర్భంలో కలుస్తాయి. కాని ధర్మం నిలుస్తుంది. హిందూధర్మం యెన్నటికి అయినా మళ్ళీ తన సమగ్రతను చాటి చెప్పుకుంటుంది అనే విశ్వాసం నాకు వుండేది. అందుకు యీ సంఘటన ఒక వుదాహరణ అన్పించింది. అలా అన్పించగానే యెంతో ఆసక్తి కలిగింది.
నేను ఆలోచిస్తూ వుండగానే రంగారావుగారూ, రాజమాతా వచ్చేశారు. రంగారావుగారిని చూడగానే ఆయనలో బొబ్బిలివీరుల రూపురేఖలు కన్పించినాయి కాబోలు. మార్లిన్ అలియాస్ మహాదేవి మల్లమ్మ లేచి నిలబడి ముఖం వోరగా ఒక ప్రక్కకు త్రిప్పుకుంది. తల దించుకుంది.
"ఎవరమ్మా నువ్వు?" రంగారావుగారు సౌమ్యంగా ప్రశ్నించారు.
"మహాదేవి మల్లమ్మను గోపాలకృష్ణ రంగారావు ధర్మపత్నిని" అన్నది సిగ్గుపడిపోతూ మార్లిన్.
రంగారావుగారు నవ్వారు.
"ఎక్కడనించి వచ్చావు?" అడిగేరాయన.
మార్లిన్ కు కోపం వచ్చింది.
"బొబ్బిలి రాణుల్ని బొబ్బిలి వీరులు యేకవచనంతో పిలిచి అవమానించటం ఆశ్చర్యంగా వున్నది" అన్నది.
రంగారావుగారు పొరపాటు దిద్దుకున్నారు.
"మీరు యెక్కడనించి దయచేశారు?" అని అడిగారు.
"మేము యిక్కడే వున్నాము" మిస్ మార్లిన్ సమాధానం.
నేను టేబిల్ మీద పెట్టివున్న మార్లిన్ బ్యాగ్ ను చేతిలోకి తీసుకున్నాను. ఆమె అభ్యంతరం చెప్పలేదు. తెరిచి చూచాను.
బ్యాగ్ మీద పాకెట్ లో మిస్ మార్లిన్ అని వ్రాసి వుంది. పాస్ పోర్టు మీద ఆమె గురించిన వివరాలు తెలిసినాయి. అడ్రసులు అవీ నోట్ చేసుకున్నాను. అప్పటికి ప్రొద్దుపోయింది.