ఆ సీన్లో ఆ యిద్దర్నీ చూడగానే కంగారు పడ్డాడు ఆయన. "ఏమిటేమిటి?" అంటూ అడిగాడు.
కన్నీళ్ళు తుడుచుకుంది పారిజాతం, దుఃఖం స్థానంలో కోపంవచ్చి కూర్చుంది "మీకేం యిది తాళికట్టిన దాని కూతురైతే కదా దీని గురించి బాధ? దేనికో పుట్టింది. ఎలాగో పెరుగుతుంది. మోహన్ బాబుపై శ్రద్దలో ఆవగింజంత శ్రద్దఉన్నా యిది బాగుపడిపోతుంది. ఆడదాన్ని నేనెంతకని చస్తాను." తీవ్రంగా అంది.
"ఏమిటి పారూ?" ఆప్యాయంగా అన్నాడాయన.
"పారూ లేదు చారూ లేదు ఇటు చూడు, దీనికి ఎవడో ప్రేమలేఖ రాశాడు. దాన్నిది భద్రంగా కంపాస్ పెట్టెలో దాచుకుంది-అన్నీ తండ్రి బుద్దులే!" ఓనీలి కాగితాన్ని విసిరికొట్టింది.
అమ్మాజీ యింకా ఏడుస్తూనే ఉంది.
తాపీగా ఉత్తరం అందుకుని చదివాడాయన ఎవరో కృష్ణ రాశాడు దాన్ని. "కృష్ణ ఎవరమ్మా?" నిదానంగా మృదువుగా ప్రశ్నించాడు.
మండిపడింది పారిజాతం "ఎవడై తేనేం త్రాష్టుడు నా కూతురుకి ఉత్తరం రాస్తాడా? ఎంత ధైర్యం? తనెంత తాసిల్దారు కొడుకైనా మరీ అంత మిడిసి బాటా? చూస్తాను ఆ మిడిసి బాటు తగ్గేట్టు చెయ్యకపోతే నా పేరు పారిజాతం కాదు, నేను జస్టిస్ రామస్వామి కూతుర్ని కాదు!"
"పారిజాతం నువ్వూరుకో!" విసుక్కున్నాడు.
"అమ్మాజీ వంచిన తల ఎత్తలేదు.
వెంకట్రామయ్య లేచి ముందు గది నుంచి పడక అది లోకి నడిచాడు. పారిజాతనికి సైగ చేశాడు "ఏమిటి సంగతి?" మృదువుగా అడిగాడు.
"రోజూ స్కూలు వద్దకి వస్తాడట! కేకలు వేయటం, అల్లరిగా పలకరించటం వెంట బడటం ఇదీ తంతు! ఆఖరికి మొన్న ఉత్తరం యిచ్చాడుట. దీనికి భయమేసి యిన్ని రోజులుగా చెప్పలేదుట. అబ్బాయిలతో తగాదా అని ఊరుకుందట!"
"ఓస్ యింతేనా? అమ్మాజీ కూడా ప్రేమించానంటుందేమోనని హడలి చచ్చానుకో! ప్రేమాగీమా లేకపోతే ఏం ఫరవాలేదు. వాడినెలా కంట్రోల్ చెయ్యాలో నాకు తెలుసు. పద! పద!"
"దాని ముఖం దానికి ప్రేమేమిటి?"
వెంకట్రామయ్య సమాధానం యివ్వలేదు.
పారిజాతం కొద్దిసేపు మౌనం వహించింది.
"పారూ! నువ్వు నన్నలా అపార్ధం చేసుకోవద్దు. మోహన్ క్షేమం కోసం నేనెంత శ్రమిస్తున్నానో-ఆందోళన పడుతున్నానో అమ్మాజీ అన్నా అంతే ఆందోళన వుంది. నిన్ను కట్టుకున్న పెళ్ళాం కంటే గారాబంగా చూసుకుంటున్నాను. అమ్మాజీ నా కన్నకూతురు."
పారిజాతం తీక్షణంగా చూసింది.
"నిన్ను నమ్మించేందుకు అలా చెప్పటంలేదు. ఈ రోజు కాకపోయినా రేపయినా నేను ఆమె భవిష్యత్తు కోసం మంచి పని చేసినపుడు నువ్వు గుర్తిస్తావు!"
అమ్మాజీ లేచి వెళ్ళింది ముఖం కడుక్కోటానికి.
వెంకట్రామయ్య పారిజాతం దగ్గరికివెళ్ళి భుజంచుట్టూ చెయ్యేసేడు. "అమ్మాయి వస్తుంది!" అంది పారిజాతం. "ఇప్పుడే రాదులే పారూ! నువ్వు ఎప్పుడూ నన్ను అపార్ధం చేసుకోకు. నా ప్లాను జయించి కృష్ణవేణమ్మ ఆస్తి మన చేతి లోకొస్తే నిన్ను తూగుటుయ్యాలలో వుంచుతా! అమ్మాజీని బంగారు పూలతో అలంకరిస్తా!" అన్నాడు.
పారిజాతం నవ్వింది.
అంతలో అమ్మాజీ వస్తున్న పద ధ్వని వినిపించింది.
4
అకౌంట్స్ చూసుకుంటోంది కృష్ణవేణమ్మ. ఎంత జాగ్రత్తగా వున్నా ఆడవారి పెత్తనం అనేసరికి ఎక్కడో ఓ చోట ఏదో కొంత దోచెయ్యాలని చూస్తూనే వుంటారు. నెల నెలా సరిగా భారీగా జీతాలు ఇస్తూనే వుంటుంది ఆమె. అయినా మనిషికి దొంగతనం అనేది ఒక ఉత్సాహాన్ని యిస్తుందేమో! కష్టపడి నెలకి వేలకి వేలు సంపాదించే వాళ్ళ యినా ఆఫీసుల నుండి పెన్సిళ్ళు, రబ్బర్లు, పేపర్లు యిళ్ళకి తీసికెళ్ళటానికి ఇదే కారణం కావచ్చునేమో! అదో రకం మేనియా కావచ్చు.
