"అసంభమం రాయుడు!" మీసాలు మెలేశాడు వీర్రాజు. "ఈ లోగిలిలో ముందు శుభకార్యం నా కూతురికి. ఆ తర్వాతే ఉదయ్ పెళ్ళి. నాలుగు తరాలకు పుట్టిన ఒకే ఒక్క ఆడపిల్ల నా కిన్నెర. అందుకే మేం మా కిన్నెర పెళ్ళికే ముందు ప్రాముఖ్యానివ్వదల్చుకున్నాం.'
తిరుగులేని తన నిర్ణయాన్ని ప్రకటించిన వీర్రాజు మనసులో అసలు ఇంకా పెళ్ళి కాని కూతురు బాధో, లేక మాట తప్పడమే కాక తనకన్నా ముందు తాత కాగలుగుతున్నానని చంకలు గుద్దుకుంటున్న భోజరాజు మీది ఆవేశమో- సీసా అందుకుని క్రోధంగా రెండు గుక్కలు తాగాడు.
ఇదంతా ఓ మూల నుండి ఉక్రోషంగా చూస్తున్నాడు- తండ్రి బేషజం కాని చెల్లి కిన్నెర స్వాతిశయం కాని అసలు నచ్చని ఉదయ్, అసలు చెల్లి పద్దతి సరికాదని చాలాసార్లు చెప్పాలని ప్రయత్నించాడు కాని, తండ్రిని చూస్తే చెప్పలేనంత కంగారులో వణికిపోతుంటాడు ఇప్పటి క్కూడా.
సరిగ్గా ఇదే సమయంలో......
ఆ పల్లెకు పడమటి దిక్కున ఉన్న భోజరాజు డాబా మీద ఓ లిక్కర్ బాటిల్ భళ్ళున పగలిపోయింది.
దానంతటదే కాదు-భోజరాజే స్వహస్తాలతో విసిరికొట్టాడు.
అలా కొట్టటానికి కారణం పొద్దు పోడవగానే సూర్య కిరణాలు తూర్పు లోగిలికి చెందిన వీర్రాజు బెడ్ రూంలో తొలిసారి ప్రవేశిస్తాయని కాదు. (ఈ మధ్య రాయుడు ద్వారా ఈ వివరం తెలియగానే తన బెడ్ రూం గోడ పగలగొట్టించి సూర్య కిరణాలు తన మొహంపై సరాసరి పడే ఏర్పాటు చేసుకున్నాడు భోజరాజు) ఆ సమస్య నుంచి గట్టెక్కి చాలా రోజులైంది.
తన పెద్ద కూతురు భవ్యకు పెళ్ళి కాలేదని కూడా కాదు. ఆరు నెలల క్రితమే తన కూతురుకు ఓ డాక్టరు కిచ్చి పెళ్ళి చేసి, వీర్రాజు కన్నా ఈ విషయంలో తనే ఘనుడని నిరూపించుకున్నాడు.
అంతేకాదు భవ్య పుట్టుకతోనే తన రాజకీయ జీవితంలో చాలా గొప్ప మార్పులు జరిగాయన్న నమ్మకంతో భవ్య ఎల్ల కాలం తన ఇంట్లోనే ఉండాలని ఈ మధ్య నే డాక్టరు అల్లుడికి అనకాపల్లి బదిలీ అయ్యేట్టు చేసి, రేపో మాపో నెల తప్పిన తన కూతురు తన లోగిలిలో అడుగు పెట్టె ఏర్పాట్లను పూర్తి చేసుకున్నాడు.
మరెందుకీ అవేశామమ్మా అంటే, నౌకరు నర్శిగాడు చెప్పిన ఓ వార్త.
ఆ వార్త ఆయన్ని ఎంతగా కలచివేసింది. అంటే నర్శిగాణ్ణి ఆమంతం గొంతు పట్టుకుని పైకేత్తేశాడు. "రాస్కెల్! పొలంలో నువ్వు కాపలా ఉండి కూడా ఎద్దు వరికంకుల్ని తినే దాకా చూస్తూ ఊరుకున్నా వన్నమాట!"
వయసులో ఉండగా భోజరాజు కుస్తీలో పట్టిన శరీరం కావడంతో అయన పిడికిలి మధ్య చిక్కుకున్న పాలేరు నర్శిగాడు ఏ క్షణంలో అయినా ప్రాణాలు వదిలేట్టున్నాడు.
"దొరా!" సరిగ్గా అర్ధం కాలేదేమో అని మరోసారి వివరించాడు గిలగిలా కొట్టుకుంటూ. "ఎద్దు మనదయ్యా.....అది పడింది వీర్రాజుగారి పొలంలోనయ్యా. తిన్నది కూడా అళ్ళ పొలంలోని వరి కంకుల్నేనయ్యా!"
ఇదో శుభవార్తలా అయన విడిచిపెడతాడనుకుంటే భోజరాజుగారు పట్టు సడలించలేదింకా.
"అదే!" హుంకరించాడు మరింత ఆవేశంగా. "తరతరాల శత్రుత్వం మా కుటుంబాల మధ్య ఉందని తెలిసి, మన ఎద్దు వాళ్ళ పొలంలో ఎందుకు అడుగు పెట్టింది? ఇక గడ్డే దొరకనట్టు వాడి వరి కంకుల్ని ఎందుకు తినాల్సోచ్చింది.?"
"వాళ్ళెవరు చూడలేదయ్యా!" గొడవ జరిగే ఆస్కారం లేదన్నట్టు నచ్చచెప్పాబోయాడు నర్శిగాడు ఉక్కిరిబిక్కిరవుతూనే. "వీర్రాజుగారికి తెలిసే సెన్సు లేదయ్యా!"
"నాకు తెలిసింది. అది చాలు! అంచేత......" అమాంతం నర్శిగాడ్ని విడిచిపెట్టాడు. "నా ప్రత్యర్ధి ఎంగిలి కూటికి ఆశించింది కాబట్టి, ఎంత ఖరీదైన ఇక ఆ ఎద్దుతో నాకు పని లేదు ఈరాత్రికే దాన్ని కసాయి వాడికి అప్పుచేప్పు రేపు ఉదయమే దాని తోలు నేను చూసి కాని చల్లారనని నా మాటగా చెప్పు వెళ్లు!"
నర్శిగాడు పరుగెత్తాడు.
మూర్ఖత్వానికి పరాకాష్టను ప్రదర్శిస్తున్న భోజరాజు ఇప్పుడేదో జరగకూడని అనర్ధం జరిగినట్టు ఆవేశ పడుతుంటే ఓ మూల నుంచి గమనిస్తుంది భయంగా రజిని---అనకాపల్లిలో ప్రస్తుతం బియ్యే మొదటి సంవత్సరం చదువుతున్న భోజరాజు రెండో కూతురు.
* * * * * * * *
ఉదయం ఎనిమిది గంటలవేళ.
బడలికగా నిద్ర లేచింది కిన్నెర.
కిటికీ వేనిషియన్ బ్లైండ్సుకు ఆవల 'నీ కన్నా రెండున్నర గంటల ముందే మేం మేల్కొన్నాం' అని గుర్తు చేసే సూర్య కిరణాల వెచ్చదనం.
ఫోంపరుపుపై రాత్రి ఆమె చదివిన 'వన కిన్నెర' నవల నలిగుంది.
"మంగా!"
కిన్నెర కేకతో ఉద్విగ్నంగా లోపలికి పరిగెత్తుకొచ్చింది మంగ.
"ఈరోజు నేను లైబ్రరీకి వెళ్లాలని చెప్పాను."
"గుర్తుంది చిన రాణిగారూ! కాని మీరు మిడ్ నైట్ దాకా మేల్కొన్నారని తెలిసి ఉండడంతో నిద్ర లేపలేదు. అప్పటికి డాడీగారు మీ ఆరోగ్యం సరిలేదేమో అని రెండుసార్లు వచ్చి అడిగి వెళ్ళారు." అడపాదడపా ఇంగ్లీషు పదాల్ని దొర్లిస్తూ తనో ఆధునిక కాలపు పనిమనిషి నన్న భావాన్ని వ్యక్తం చేసింది మంగ.
"అయితే నాన్న వచ్చారా?" కిన్నెర గొంతులో అణువంత అందోళన.
"రావడమే కాదు. బ్రేక్ ఫాస్ట్ సైతం చేయకుండా మీ కోసం డైనింగ్ హల్లో ఎదురు చూస్తున్నారు."
