అబ్బులు కావడానికి కానిస్టేబుల్ అయినా చురుకైన వాడు. రంగయ్య కు అనుమానం రాకుండా వుండడం కోసం అతను మొదటి రోజు నే రంగయ్యను కలుసుకుని తన కుటుంబంలో ఏవో ఇబ్బందు లున్నాయనీ ,అందుక్కారణం గ్రహ దోషమని నమ్ముతున్నాననీ చెప్పాడు. నమ్మకమైన దేవతకు మొక్కుకుని తన కష్టాలు తీర్చుకోవాలనుకుంటున్నట్లు కూడా చెప్పాడు.
"మా మహాకాళి చాలా గొప్ప దేవత --" అన్నాడు రంగయ్య.
"నువ్వు చెప్పడాని కేం -- నాకు నమ్మకం కలగాలిగా"
"కలిగితే ఏం చేస్తావు ?"
"అమ్మవారికో వెయ్యి పూజారికో వెయ్యి...."
"రూపాయలే ....' అంటూ నోరావలించాడు రంగయ్య.
"కాకపొతే పైసలనుకున్నావా?" అన్నాడు అబ్బులు.
రంగయ్య సంభోధన వెంటనే మారిపోయింది.... "బాబూ మీరింకా జాప్యం చేయకండి. అమ్మవారికి మొక్కుకుని నష్టపోయిన వాళ్ళింత వరకూ లేరు...."
"కానీ ఊళ్ళో నేను విన్నదాన్ని బట్టి అమ్మవారు చాలా నష్టపోయింది."
"అంటే?"
"మొక్కుబడి చెల్లించని వాళ్ళను అమ్మవారు ఏమి చేయలేక పోతోంది. అంటే ఆవిడకు ఏ శక్తీ లేదనేగా" అన్నాడు అబ్బులు.
"ఇప్పటి కూళ్ళో రెండు నరబలులు జరిగాయి. అది అమ్మవారి ప్రభావమే."
"అవి హత్యలని నా అనుమానం...." అంటూ అబ్బులు రంగయ్య ముఖంలోకి పరీక్షగా చూశాడు. రంగయ్య ఏమాత్రమూ తడబడకుండా నమ్మకంగా ముఖం పెట్టి "అవి హత్యలు కావు. ముమ్మాటికీ అమ్మవారు తీసుకున్న నరబలులు" అంటూ జరిగిన కధ కొంత ఏకరువు పెట్టాడు. అమ్మవారు ముందుగానే మాణిక్యాలరావు ను హెచ్చరించడం గురించి అతను చెప్పాడు.
"ఊరి మీద కోపం వచ్చి యిద్దర్నీ బలిగొన్నదన్న మాట అమ్మవారు."
'ఇద్దరి తో వదిలి పెడుతుందేమిటి -- ఇంకా వున్నారు " అన్నాడు రంగయ్య.
అబ్బులు కంగారుగా రంగయ్య ముఖంలోకి చూశాడు. అతని ముఖంలో అమ్మవారిపై నమ్మకం తప్పితే క్రూరత్వం మేమీ గోచరించలేదు.
"అంత కచ్చితంగా ఎలా తెలుసు నీకు?"
"ఇంకా ఊరి వాళ్ళకు బుద్ది రాలేదు. అదే కారణం..."
"బుద్ది వచ్చేదాకా జనం అలా చస్తూనే వుంటారా?"
'అంతే మరి ....దేవతలతో చెలగాటం...."
అబ్బులు రంగయ్యతో మరి మాట్లాడలేదు. ఏదో వంక పెట్టి తరచుగా అతన్నికలుసుకుంటూ ఉండడమూ అతన్నో కంట కనిపెడుతుండడమూ చేస్తున్నాడు. ఒక రోజున అతడికి అమ్మవారి మీద చాలా నమ్మకం కలిగినట్లు చెప్పి రంగయ్య చేత పూజ చేయించి పది రూపాయలిచ్చాడు.
పూజ పూర్తయ్యే సమయానికి ఎవరో అక్కడికి రొప్పుకుంటూ వచ్చారు. రంగయ్య అతన్ని చూసి -- "ఏమోయ్ వరాలూ ఏమిటిలా పరుగెత్తుకుంటూ వచ్చావ్?" అన్నాడు.
అమ్మవారి మొక్కు తీరుస్తాను. మా ఇంట్లో అందరి పేరునా పూజ చేయించాలి. నీకెప్పుడు తీరుబడవుతుందో చెప్పాలి...." అన్నాడు వరాలు.
"ఇంతకీ ఏం జరిగింది ?" అన్నాడు రంగయ్య . అతడు ముఖం సంతోషంతో వెలిగిపోతోంది.
'అమ్మవారు మళ్ళీ ఇంకో బలి తీసుకుంది" అన్నాడు వరాలు.
అబ్బులు వులిక్కిపడి -- "ఎప్పుడు?" అన్నాడు.
"ఎప్పుడో కాదు ఇప్పుడే -- పది నిమిషాలవుతుందేమో!"
అబ్బులు చటుక్కున అక్కడ్నించి లేచాడు. అయిదు నిమిషాల్లో శవామున్న చోటు చేరుకున్నాడు.
ఈసారి చనిపోయినది మునెయ్య కొడుకు రమణారావు అంతకు ముందు జరిగిన హత్యల కంటే భయంకరంగా వుందిది. తల, మొండెం దేనికి దానికి వేరుగా వున్నాయి. హత్య జరిగింది మునసబు గారి మామిడి తోటలో , చూసిన వాడు మునసబు గారి పాలేరు. శవాన్ని అతను చూడడానికి అరగంట ముందు రమణారావును చాలామంది చూశారు. అతను మనసబు గారి తోటలోకి ఎందుకు వెళ్ళాడో ఎవరికీ అర్ధం కాలేదు.
పోలీసులు వచ్చి వివరాలన్నీ సేకరించుకున్నారు. ఇది వారికీ అంతు చిక్కని సమస్యగా పరిణమించింది. పూజారి రంగయ్య మాత్రం ఇది అమ్మవారి పనేనని వూరి వారందరూ పెద్ద ఎత్తున శాంతి పూజలు జరిపించాలని తన అభిప్రాయం చెప్పాడు.
మూడో మనిషి చావడంతో ఊరు నిజంగా గగ్గోలెత్తిపోయింది. అమ్మవారికి శాంతి పూజలు జరిపించాలని అందుకు చందాలు వసూలు చేయాలని కొందరు అప్పటి కప్పుడు తీర్మానించారు.
పోలీసులను ఆశ్చర్యపరచిన విషయ మేమిటంటే చనిపోయిన వారందరూ కుర్రాళ్ళే! అమ్మవారు ప్రత్యేకంగా కుర్రవాళ్ళనే ఎందుకు బలి తీసుకుంటోంది? మానవ హంతకుడైనా అందరూ కుర్రవాళ్ళనే ఎందుకు ఎన్నుకుంటున్నాడు?
హతుడి తండ్రి మునెయ్య చాలా విచారంగా వున్నాడు. అతడికి కొడుకంటే ప్రాణం. పోలీసులు ప్రశ్న లడగడానికి వస్తే అతను భోరున ఏడ్చేశాడు.
"మీరు చాలా దుఃఖంలో ఉన్నారని తెలుసు . ఐనా మిమ్మల్ని కొన్ని ప్రశ్న లడక్క తప్పదు " అన్నాడు ఇన్ స్పెక్టర్.
"అడగండి -- " అన్నాడు మునెయ్య కళ్ళు తుడుచుకుంటూ.
"ఎవరో ఈ హత్యల్ని చాలా పకడ్భందీగా చేస్తున్నారు. ఎంత ఆలోచించినా కారణాలు అంతు బట్టడం లేదు. ఇది అమ్మవారి పని అని నేను నమ్మడం లేదు. హత్యే అయితే ఫలానా కారణమని మీరు ఊహించి చెప్పగలరా?" అన్నాడు ఇన్ స్పెక్టర్.
పుట్టెడు దుఃఖంలో వున్నాడు మునెయ్య. "ఎవరి కయినా నామీద కక్ష వుండొచ్చు గానీ ముక్కు పచ్చలారని ఈ బిడ్డ మీద ఎందుకుంటుంది చెప్పండి ?"
"మీ బిడ్డను చంపి మిమ్మల్ని దుఃఖ పెట్టాలనుకోవచ్చు గదా --"
"ఇవన్నీ మీ ఊహలు. ఇది నిస్సందేహంగా అమ్మవారి పనే!" అన్నాడు మునెయ్య.
ఇన్ స్పెక్టర్ అతన్నింక ప్రశ్నించలేదు. ప్రజల్లో అమ్మవారి భయం క్రమంగా అలుముకుంటున్నదని అతను గ్రహించాడు. అబ్బులు చెప్పినదాన్ని బట్టి రంగయ్య ప్రవర్తన అనుమానాస్పదంగా లేదు.
పోలీస్ ఇన్ స్పెక్టర్ ఆ గ్రామంలో ఓ వారం రోజులుండాలని అనుకున్నాడు. అతనూ , నలుగురు కానిస్టేబుల్స్ మునసబు గారింట్లోనే మకాం పెట్టారు. అబ్బులు మాత్రం వాళ్ళతో సంబంధం లేనివాడులా వేరే వున్నాడు.
9
పోరుగూళ్ళో బారసాల జరిపించి అక్కడే కాస్త విశ్రమించి తిరిగి తన గ్రామం చేరుకునేసరికి రాత్రి తొమ్మిదయింది సోమయాజులుకి.
ఆ ఊళ్ళో సాధారణంగా రాత్రి ఎనిమిది దాటే సరికి వీధులన్నీ నిర్మానుష్యంగా ఉంటాయి.
సైకిల్ తొక్కుకుంటూ సోమయాజులు మునసబు రిల్లు దాటేసరికి అక్కడ ఆయన్నిద్దరు మనుషులు అటకాయించి "ఎవర్నువ్వు?" అని అడిగారు.
సోమయాజులు కంగారుగా , "ఎవరు మీరు? ఏమిటా దౌర్జన్యం ?' అన్నాడు.
"దౌర్జన్యమూ కాదు - బొందా కాదు. మా కర్మ నువ్వా పంతులు వెళ్ళు!" అన్నాడు ఇద్దరిలో ఒకడు.
"అసలేమిటి కధ?" అన్నాడు సోమయాజులు.
"ఊళ్ళో ఇప్పటికి ముగ్గురు చచ్చారు. ఇంకా ఎంతమంది చస్తారో , ఏ రోజు ఎవరికి మూడుతుందో తెలియక మేమిక్కడ కాపలా పెట్టాం . రాత్రి తెల్లవార్లూ మాకు నిద్ర వుండదు ."
వాళ్ళు పోలీసులని అర్ధం చేసుకుని సోమయాజులు నవ్వుకుని ఇంటికి వెళ్ళిపోయాడు. అయన వెళ్ళిన కొద్ది సేపటికి రోప్పుకుంటూ అక్కడికో కుర్రాడు వచ్చాడు.
పోలీసులా కుర్రాడ్ని అటకాయించారు.
"నేను ఇన్ స్పెక్టర్ గార్ని చూడాలను కుంటున్నాను" అన్నాడు కుర్రాడు.
"ఎందుకు?"
"హత్యల గురించి నాకో అనుమానం వచ్చింది ...." అన్నాడు కుర్రాడు.
పోలీసులు వెళ్లి ఇన్ స్పెక్టర్ని లేపారు.
"నా పెరు రవి కుమార్, " అన్నాడు కుర్రాడు.
"ఊ చెప్పు ."
రవికుమార్ జేబులోంచి ఓ కాగితం తీసి ఇన్ స్పెక్టర్ కిచ్చాడు. ఆ కాగితం మీద చాలా పేర్లు రాసి ఉన్నాయ్. "ఏమిటీ కాగితం ?" అన్నాడు ఇన్ స్పెక్టర్.
"అందులో పేర్లు చూడండి. నంబర్లు చూడండి. వరుస ప్రకారం యిప్పటికి ముగ్గురు చచ్చిపోయారు. ఆ వరుస ప్రకారమే హత్యలు జరుగుతున్నాయని నా అనుమానం."
ఇన్ స్పెక్టర్ ఉలిక్కిపడి ఆ లిస్టు మళ్ళీ చూశాడు. అందులో మొదటి పేరు మాణిక్యాలరావు. రెండు మోహన్. మూడు రమణారావు.
"ఈ లిస్టు నీ కెక్కడిది ?"
